ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Sep 16, 2020 , 23:16:18

వందనాలు వందనాలు తెలంగాణ తల్లి

వందనాలు వందనాలు తెలంగాణ తల్లి

వందనాలు వందనాలు తెలంగాణ తల్లి

పాదాభివందనాలు పుడమి పాలవెల్లి 

॥ వందనాలు వందనాలు ॥ 


తంగేడు పూవులా శోభ నీది జననీ

బంతీ చేమంతులా సొగసు నీది ధరణీ

నీ నల్లని కురులూ అవి సింగరేణి సిరులూ

నీ ఎద పొంగిన ఝరులూ కృష్ణా గోదారి నదులు 

॥ వందనాలు వందనాలు ॥ 


తల్లీ నీ జ్ఞానకాంతి బాసర భారతి తేజం

అమ్మా నీ శౌర్య దీప్తి భద్రాద్రి రామబాణం

నీ పలుకుల మధురసుధ పోతన భాగవత కవిత

భక్తరామదాసు పాట తేటతెలుగు తేనె ఊట 

॥ వందనాలు వందనాలు ॥ 


చిందులేసే జానపదం నీకెంతో ప్రాణప్రదం

బతుకమ్మ బోనాలు పల్లెజనుల గానాలు

సమ్మక్క సారక్కకు బెల్లం నైవేద్యాలు

అడుగడుగున జాతరలు శివసత్తుల పూనకాలు 

॥ వందనాలు వందనాలు ॥  


కాకతీయ రాజులా కదనపటిమ నీ చరిత

గోలుకొండ రాజులా వైభవాలు నీ ఘనత

బతుకునిచ్చు భాగ్యనగరి హైద్రబాదు నీ మకుటం

చార్మినారు శిఖరాలు నీ కీర్తికి సంకేతం 

॥ వందనాలు వందనాలు ॥  


కరుణజూపి ఆదరించె ప్రేమ నీకు సొంతం

దోపిడీని సహించని తిరుగుబాటు నీ పంతం

బంగారు తెలంగాణ బాట సాగుతోంది తల్లి 

గమ్యాన్ని ముద్దాడే బలమునివ్వు కల్పవల్లి 

॥ వందనాలు వందనాలు ॥

- మద్దెల కృష్ణబాబుlogo