బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Sep 16, 2020 , 23:16:07

హమీల అమలు అనుమానమే

హమీల అమలు అనుమానమే
  • ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..

1992 ఫిబ్రవరిలో ప్రారంభించి నిర్మిస్తున్న ‘రామ్‌దీవార్‌' (రామకుడ్యం), 4) అనేక రక్షణ చర్యల్ని నిలిపివేసి సేకరించిన ప్రాంతంలోకి యథేచ్ఛగా ప్రజలకు ప్రవేశాన్ని కల్పించటం, 5) 1992 నుండి కూల్చివేతలు, తవ్వకాలు చదును చేసే పనులు పెద్ద ఎత్తున చేపట్టడం, 6) 1992 జూలైలో మంటప నిర్మాణం, 7) రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థలాన్ని ప్రధాన రహదారికి కలుపుతూ కొత్తగా రోడ్డును వేయటం, 8) 1992 మార్చిలో 42 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు బదలాయించటం.

అధికార ప్రకటనల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగానే శబ్దాల్ని పలికించే జాగ్రత్తలు తీసుకుంది. ఉదాహరణకు జాతీయ సమైక్యతా మండలి సమావేశంలోనూ, కోర్టులకు సమర్పించిన వాంగ్మూలాలలోనూ ముఖ్యమంత్రి / రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద కట్టడాన్ని పరిరక్షిస్తామని, కోర్టు ఉత్తర్వుల్ని అమలుపరుస్తామని, ఉల్లంఘించమని హామీలివ్వటం జరిగింది. కానీ నిజంగా జరిగిన సంఘటనల్ని విశ్వహిందూ పరిషత్‌, సంఘ్‌ పరివార్‌ ప్రతినిధుల పొంతనలేని ప్రకటనల నేపథ్యం నుండి చూస్తే ఈ హామీలన్నీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు కోర్టులు గానీ రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు గైకొనేందుకు వీలుగాకుండా చూసేందుకే రూపొందించినట్లు కన్పిస్తుంది. రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. బాబ్రీ మసీదుకు ఎటువంటి నష్టం వాటిల్లటం గాని, కూల్చటం గాని జరుపకుండా రామ మందిర నిర్మాణానికి కేంద్రం సుముఖమేనని నేను 1992వ సంవత్సరపు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాను. 1991 జూలైలో దేశాధ్యక్షుని పార్లమెంటు ప్రసంగంలోనూ, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలోనూ రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సంప్రదింపుల ద్వారా ఒక  సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని పేర్కొనబడింది. అటువంటిది సాధ్యపడనప్పుడు కోర్టు తీర్పును గౌరవించటమే శరణ్యం

అలా త్వరత్వరగా ఆవిష్కృతమైన పరిణామాల్నీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో వుంచుకొని చూస్తే ఈ క్రింది భయాందోళనలకు తావిస్తున్నట్లుగా మనకు కన్పిస్తుంది. 1) సేకరించిన ఏ భూమిలో హైకోర్టు పూర్వపు స్థితిని కొనసాగించమని ఉత్తర్వులు జారీచేసిందో, ఎక్కడైతే న్యాయస్థానాలు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని ఆదేశించాయో దానిలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నిర్మాణ కార్యక్రమంతో కూడిన కరసేవను అనుమతించవచ్చు. 2) కరసేవ పునఃప్రారంభంతో ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు తీవ్ర ప్రతిఘాతం ఏర్పడనుంది. కరసేవ మతావేశపు వాతావరణంలో జరుగనున్నందున రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కట్టడ భద్రతకు ముప్పు ఏర్పడే భయాన్ని రేకెత్తిస్తున్నది; ఆ కట్టడంపై ఏ విధమైన దాడి అయినా పలు తావుల్లో తీవ్రమైన మతహింస చెలరేగేందుకు అవకాశమిచ్చినట్లవుతుంది. 1992 డిసెంబరుకు ముందు మాసా ల్లో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి ఒక సామరస్యపూర్వక పరిష్కారం కోసమున్నూ, ప్రతిబంధకం కాబోయే సంక్షోభాన్ని నివారించేందుకూ తీవ్ర కృషి జరిగింది. విశ్వహిందూ పరిషత్‌, ఆల్‌ ఇండియా బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీల ప్రతినిధులతో నిరంతరం నిర్వహించే సమావేశాలే గాక నా స్థాయిలోనూ రాజకీయపక్షాల, ధార్మిక సంఘాల నాయకులు మున్నగువారితో సమావేశాలు, సంప్రదింపులు జరుగుతూండేవి. పలు రాజకీయపక్షాల నాయకులు జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తపరుస్తూ కరసేవ పునఃప్రారంభం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవాళ్ళు.

అయితే లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడైన శ్రీ యల్‌.కె.అద్వానీతో సహా కొన్ని వర్గాల నుండి ప్రభుత్వం సేకరించిన స్థలంలో కరసేవను పునః ప్రారంభించేందుకు అనుమతించాలనీ సలహాలు అందుతూ ఉండేవి. అటువంటి సలహాలపై శ్రద్ధ పెట్టాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు సమర్పించాలనీ, అవి వివాదంలో వున్న స్థలాల్లోకి గానీ, కట్టడాల్లోకి గానీ విస్తరింపబడరాదనీ, ఏ విధంగానూ వివాదాస్పద కట్టడానికి ముప్పు వాటిల్లకూడదనే విషయానికి కట్టుబడి వుండాలనీ హోంమంత్రి వివరణ ఇవ్వగా దానికి ఏ మూలనుండీ ప్రతిస్పందన రాలేదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను అమలుపరచలేక తిరిగి చేతులెత్తేసే దశ రాకుండా పనిని నెరవేర్చేందుకు కరసేవ పునః ప్రారంభాన్ని యితర ఎడతెగని సమస్యల నుండి వేరుపరచే సలహా కూడా యివ్వబడింది. జాతీయ సమైక్యతా మండలి సమావేశం 1992 నవంబరు 23న జరిగింది. మండలి బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదాన్నీ, ప్రభుత్వ నివేదికనూ అన్ని కోణాల నుండి పరిశీలిస్తూ కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేందుకూ, చట్టానికీ, రాజ్యాంగానికీ భంగం వాటిల్లకుండా చూచేందుకు ఏ చర్య అవసరమని నేను భావిస్తానో దానికి అనువైన సహకారాన్నీ, మద్దతునూ అందించేందుకు ఆమోదాన్ని తెలియజేస్తూ తీర్మానించింది. 1992 నవంబరు 20న సుప్రీంకోర్టు ముందుకువచ్చిన కోర్టు ధిక్కార నేర విచారణ సందర్భంగా కోర్టు అంతకుముందు జారీచేసిన ఉత్తర్వులు అమలయ్యేటట్లు చూచేందుకుగాను తగిన సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తన వైఖరిని తెలియజేయవలసిందిగా కోరింది. దానికి అనుగుణంగా 1992 నవంబరు 23న సుప్రీంకోర్టుకు భారత సొలిసిటర్‌ జనరల్‌ ఈ క్రింది విషయాలను నివేదించటం జరిగింది.

1) రాష్ట్ర ప్రభుత్వం తన వాంగ్మూలంలో యింకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొనటం సబబు కాదు. ప్రస్తుతం సంప్రదింపుల్లో అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం గల సంప్రదింపులేవీ పెండింగులో లేవు. 2) జూలై 1992లో పరిస్థితులు చాలా దూరం వెళ్ళటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదుపులో వుంచటం తనవల్ల కాదని తెలిపింది. కనుక అటువంటి స్థితి పునరావృతం కాకుండా చూడాలని నివేదించటమైనది, కనుక ఏ మాత్రం జాగుచేయక వెనువెంటనే తగిన నివారణ చర్యలు గైకొనాలి. 3) తీసుకునే చర్యల లక్ష్యం ఆ స్థలం వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగు కావటాన్ని అనుమతించరాదు. భవన నిర్మాణ సామాగ్రి, పరికరాలు అక్కడికి చేరవేయటాన్ని కూడా నిలిపివేయాలి.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo