మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Sep 15, 2020 , 23:00:09

ఇల్లు కట్టి చూడు!

ఇల్లు కట్టి చూడు!

 ప్రజానుకూల సంక్షేమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపుతున్నది. జన జీవితంతో ముడిపడి ఉండే చట్టాలన్నీ ఒక్కొక్కటిగా ప్రజానుకూలంగా మారుతున్నాయి. చిక్కుముడులన్నీ వీడి సరళీకృతమవుతున్నాయి. గ్రామీణ ప్రజానీకానికి మోదం కలిగించేందుకు నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ ప్రజానీకానికి ఇబ్బందులను దూరంచేసే టీఎస్‌బీపాస్‌ చట్టానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం హర్షణీయం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల్లోని పేద మధ్యతరగతి ప్రజలందరికీ భవన నిర్మాణం సులభతరం కానున్నది. దీని ప్రకారం 75 గజాల వరకు గృహ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. 75 నుంచి 600 గజాల వరకు నిర్మించుకునే ఇండ్లకు తక్షణ అనుమతి, స్వీయధ్రువీకరణ పత్రం సరిపోతుంది. అనుమతులు అవసరమైనవాటికి కూడా 21 రోజుల్లోపు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు రాకుంటే.. టీఎస్‌బీపాస్‌ చట్టం ‘డీమ్డ్‌ అప్రూవల్‌ విధానం’తో అనుమతులు వచ్చినట్లుగానే భావించి నిర్మాణం చేసుకునే వీలు కల్పించటం ముదావహం.

తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేండ్లుగా పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పథక రచన చేస్తున్నది. ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్నది. కాలం చెల్లిన చట్టాలు, విధివిధానాలు భవన నిర్మాణానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. సమస్యలను దూరంచేయటం కోసం 2015లో డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ పర్మిషన్‌ సిస్టం (డీఎంపీఎస్‌)  తీసుకొచ్చినా, దానికి చట్టబద్ధత లేకపోవటంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభుత్వం 2019లో నూతన మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించింది. ఈ రెండూ వేర్వేరుగా, భిన్నంగా ఉండటంతో ఏకరూపత తీసుకొచ్చేందుకు రూపకల్పన చేసిందే టీఎస్‌బీపాస్‌ చట్టం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తించే ఈ చట్టం తర్వాత కూడా ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే తీర్చేందుకు ఓ చేజింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

దేశంలో వేగంగా నగరీకరణ చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉన్నది. రాష్ట్ర జనాభాలో 42 శాతం మంది పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అత్యావశ్యకం. విస్తరణకు అనుగుణంగా రహదారుల నిర్మాణం, ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్లై ఓవర్లు, వంతెనలు నిర్మించటమే కాదు, నగర సుందరీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసి భారీ బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, చట్టాల్లో విప్లవాత్మక మార్పులు తేవటం ఆహ్వానించదగినది. టీఎస్‌బీపాస్‌ చట్టంతో తెలంగాణలో పట్టణీకరణ పరుగులు తీస్తుందనటంలో సందేహం లేదు.


logo