శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Sep 14, 2020 , 23:35:21

రైతును గౌరవించే సర్కార్‌

రైతును గౌరవించే సర్కార్‌

భూసంస్కరణలు ఎన్ని తెచ్చినా 73 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన సమగ్ర భూపరిపాలన వ్యవస్థ రూపొందలేదు. గ్రామీణ వ్యవస్థ అవినీతికి ఆలవాలంగా మారింది. రక్తబంధువులే ఆస్తుల కోసం శత్రువులై హత్యలదాకా తెగిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయ. ఇలాంటివాటితో సామాజిక జీవనం అశాంతిమయమవుతుంది. దేశంలో ఇందిరాగాంధీ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పీవీ నరసింహారావు తెచ్చిన భూ సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వలేదు. లోపభూయిష్టమైన చట్టాల కారణంగా అవి ప్రజలపై ప్రభావాన్ని చూపలేకపోయాయి. నేటికీ తెలంగాణలో భూ పంపిణీ, రెవెన్యూ వ్యవస్థ నిర్మాణం, పనితీరు హేతుబద్ధంగా లేక ప్రజల నుంచి విమర్శలు, నిరసనలు ఎదురవుతున్నాయి. దీనిని ప్రక్షాళన చేయాలన్న దృఢ సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకితభావంతో సమగ్ర భూ పరిపాలన సంస్కరణలను చేపట్టారు. 

రెవెన్యూ వ్యవస్థ కాలానుగుణంగా మార్పు చెందలేదు. దాంతో ప్రజలు తమ భూ హక్కులు, వాటి రికార్డుల గురించి గతంలో కరణం చుట్టూ, నేడు మండల రెవెన్యూ ఆఫీసు అధికారుల చుట్టూ, ముఖ్యంగా వీఆర్వోల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రహించారు. రెవెన్యూ చట్టాల మార్పు పారదర్శకంగా, లంచగొండితనం లేనివిధంగా, జవాబుదారీతనంతో ఉండాలని భావించారు. గతంలో పాలకులు ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రాధాన్య అంశంగా భావించలేదు. దానిని ముట్టుకుంటే తమ అధికారం ఎక్కడ పోతుందోనని మిన్నకుండిపోయారు. రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కేసీఆర్‌ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం అతి ముఖ్యమైన నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టారు. సరళీకృత, పారదర్శక భూ పరిపాలన చట్టాలను అంచెలంచెలుగా చేపడుతూ ప్రజల ఇక్కట్లను తీర్చే క్రమం కొనసాగుతున్నది. 


కేసీఆర్‌ దూరదృష్టి గల, సమాజ హితం కోరే సహజ నాయకుడు అయినందున చిరకాలంగా జరుగుతున్న అన్యాయానికి పరిష్కారంగా తన ఊహాత్మక తెలంగాణ రాష్ట్ర స్వప్నానికి సానుకూలంగా ప్రజలను మలిచారు. ఇది నాయకత్వ లక్షణాల్లో మొదటిది. చివరికి ఆంధ్రప్రాంత ప్రజలు, మేధావులు కూడా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఒప్పుకోక తప్పలేదు. ముఖ్యంగా అక్కడి బడుగు, బలహీనవర్గాలు సిద్ధాంతపరంగా మద్దతునిచ్చాయి. కొందరు రాజకీయంగా తమ అభ్యంతరాలను ముందుపెట్టారే తప్ప వ్యతిరేకించలేని స్థితికి కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపారు. అప్పుడు కోరుకున్న ఫలితాలను ఇప్పుడు సాధించే పనిలో పడ్డారు. వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భూ సమస్యల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ చట్టాలను సంస్కరించారు. రైతులు ఎవరిచుట్టూ తిరుగకుండా, ఏండ్ల తరబడి పరిష్కారం లేని సమస్యలను పరిష్కరిస్తూ పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. 1బీ ఫారం ద్వారా రైతు ఖాతాలో వేర్వేరు సర్వే నంబర్లలోని భూయాజమాన్య హక్కులను అందించారు. వంశపారంపర్యంగా, కొనుగోలు ద్వారా సంక్రమించిన భూ హక్కులను అతి తక్కువ సమయంలో భూరికార్డులతో చట్టరీత్యా కల్పించారు. తరాలుగా పేరుకుపోయిన భూసమస్యలు చాలావరకు నిష్పక్ష పాతంగా న్యాయబద్ధంగా పరిష్కారమయ్యాయి. ఆర్వోఆర్‌ యాక్ట్‌ సవరణతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 40 వేల భూ రికార్డులను మార్పు చేయడం సాధ్యమైంది. వంశపారంపర్యంగా సంక్రమించిన భూహక్కు పత్రాలు సంవత్సరానికి 80 వేలుగా ఉండేవి. అవి ప్రస్తుతం.. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలలో భాగంగా దాదాపు రెండు లక్షల వరకు పెరిగాయి. కొన్న భూములు, వారసత్వంగా సంక్రమించే భూములను వారసులకు మ్యుటేషన్‌ ద్వారా సునాయాసంగా అతి తక్కువ నిర్ణీత సమయంలో మార్పు చేసేలా ప్రభుత్వం చట్టాలను రూపొందించింది. వీటివల్ల ఒక గుంట భూమికి కూడా ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. రైతుబంధు పథకం, రైతు బీమా పథకం అందరికీ వర్తిస్తుంది. 

తరతరాలుగా మారని భూ చట్టాలను, రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్‌ ప్రభుత్వం ఈ విధంగా ప్రజానుగుణంగా ప్రక్షాళన చేస్తున్నది. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా, లంచగొండితనం లేని జవాబుదారీ రెవెన్యూ వ్యవస్థ నిర్మాణమే ధ్యేయంగా మరిన్ని మార్పులతో తెచ్చిన బిల్లులు గొప్ప పరిణామం. ఈ వినూత్న సంస్కరణలతో ప్రజలకు మేలు చేకూరి, కేసీఆర్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశిద్దాం.

(వ్యాసకర్త: ప్రొఫెసర్‌ ఎమిరిటస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషియాలజీ, ఓయూ)

ప్రొఫెసర్‌ గట్టు సత్యనారాయణ


logo