సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Sep 14, 2020 , 00:15:32

ఘర్షణ నివారణ యత్నాలు

ఘర్షణ నివారణ యత్నాలు

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

తీర్పును వెలువరించటంలో జరుగుతున్న అకారణ జాప్యం వల్ల అయోధ్యలో పరిస్థితి తీవ్రతరం అవుతున్నదన్న ఆర్‌.కే.గర్గ్‌ వాదనకు ప్రతిగా సుప్రీంకోర్టు వెల్లడించేదేమంటే హైకోర్టు తీర్పు త్వరగా వెలువరించే విషయంలో అర్జీదారుని ఆకాంక్షను దృష్టిలో ఉంచుకోమని కోరటం జరిగిందని తెలియజేయటం జరిగిందన్నది. ఈ లోగా న్యాయవాది ఓ.పి.శర్మ అయోధ్యలోని పరిస్థితి తీవ్రతరమవుతున్నందున కేంద్ర ప్రభుత్వం తరపున, సేకరించిన 2.77 ఎకరాల భూమికి రిసీవరును నియమించాలని కోరటం జరిగింది. అందుకు తార్కాణంగా ఆయన ఒక పత్రికలోని వార్తను కోర్టు దృష్టికి తెచ్చారు. దాని ప్రకారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ డిసెంబరు 5న రాజీనామా చేయాలని తీవ్రంగా యోచిస్తున్నారని అలా చేయటం వల్ల కేంద్రం నిస్సహాయస్థితిలో పడిపోగలదని. మొహమ్మద్‌ అస్లామ్‌ తరఫున శ్రీ కల్యాణ్‌సింగ్‌పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన కోర్టు ధిక్కార నేరాన్ని మోపిన ఓ.పి.శర్మ ఆ పత్రికలో వార్త ఆధారంగా ఇంకా ఇలా చెప్పారు: ఒకవేళ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా సమర్పిస్తే కరసేవ సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కేంద్రానికి తగినంతగా సమయం దొరకదు. పైగా బీజేపీ ప్రభుత్వంపై కోర్టు ఆంక్షలుండవు. అయితే జస్టిస్‌ యమ్‌. యన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన గల ముగ్గురు జడ్జీల ధర్మాసనం వార్తాపత్రికలలోని వార్తల ఆధారంగా వెంటనే కేంద్ర ప్రభుత్వ రిసీవరును నియమించేందుకు నిరాకరించింది. వాళ్లు కోర్టు పరిశీలకునిగా ఉన్న తేజ్‌ శంకర్‌ నివేదికపై గాని, అయోధ్యలో మౌనంగా వున్న జనం అదుపుతప్పే సమయం ఆసన్నమైనప్పుడు గాని అటువంటి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని స్పష్టంచేయటం జరిగింది. ఈలోగా అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచి అయోధ్యలో 2.77 ఎకరాల భూ సేకరణతో దాని తీర్పును నిలిపి ఉంచినట్లు డిసెంబరు 3న అదనపు రిజిస్ట్రార్‌ ప్రకటన ద్వారా తెలియవచ్చింది.

ఆరు గంటలపాటు అయోధ్య స్థితిపై డిసెంబరు 3న లోకసభలో కొనసాగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిస్తూ హోంశాఖామంత్రి, యస్‌.బి. చవాన్‌ సభలోని అన్ని వర్గాల వారిని కోరినదేమంటే వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మిత్రుల్ని ‘దేశంలో సమస్యల్ని సృష్టించేదానికి ఏ కార్యక్రమాన్ని తలపెట్టవద్దని’ నచ్చజెప్పవలసిందిగా కోరటం జరిగింది. ఘర్షణను నివారించేందుకు సకల చర్యలు గైకొనబడినాయని ఇంకా కేంద్రం’ ఆ పనిమీదనే ఉన్నదని’ హోంమంత్రి చెప్తూ అనుకోనిది జరిగితే అదుపు చేసేందుకు కేంద్రం వ్యూహాన్ని వెల్లడించటంగాని, దానిపై వ్యాఖ్యానించటంగాని సబబుకాదు గనుక అలాచేయటం లేదన్నారు. బీజేపీయేతర ప్రతిపక్షాల మనస్సుల్లో నెలకొన్న కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వపు పోకడల నిజస్వరూప విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఏదో జరగబోతోందని వాళ్లు ఊహించుకుంటున్నారన్నారు. ఆయన చివరకు రామజన్మభూమి- బాబ్రీ మసీదు భద్రత విషయంలోనూ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించబడకుండా చూచే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీలను గుర్తుచేశారు. అంతేగాక జాతీయ సమైక్యతామండలి ప్రధాని పైనా, ప్రభుత్వం పైనా గట్టి నమ్మకాన్ని ఉంచినందున మీరు దయచేసి నన్ను అనుకోని సంఘటనలు ఎదురైతే ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహరచనను వెల్లడించమని కోరకండి. నేను ఎలా దానిని అదుపు చేసేదీ చెప్పరాదు. పరిస్థితినిబట్టి మేము చర్యలు గైకొనటం జరుగుతుందని అన్నారు.

దేశంలో ఏ ప్రాంతానికైనా పారా మిలటరీ దళాలను తరలించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హోంమంత్రి చెప్పారు. రాజ్యాంగపు అధికరణం 355 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని బయటి దాడుల నుంచి గాని లేదా అంతర్గత కల్లోలాల నుంచి గాని రక్షించటం కేంద్రం విధి. అయితే సర్కారియా కమిషన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో అంతర్గత కల్లోలాల విషయంలో ఇచ్చిన వివరణ కారణంగా కేంద్రం ఆ విధంగా చేయలేదు అన్నారాయన. కేంద్రం న్యాయవ్యవస్థ వెనుక ఉండి తనను తాను కాపాడుకుంటూ అయోధ్య వ్యవహారంలో దానిపై ఒత్తిడి పెంచుతున్నదనే అభియోగానికి సమాధానం చెబుతూ ‘మేమెన్నడూ న్యాయవ్యవస్థ పనితీరులో జోక్యం కల్పించుకోము. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేటటువంటిది. అటువంటి దయమాలిన వ్యాఖ్యలు చేసి దానికి మచ్చతేకండి’ అన్నారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ చర్చల్లో ఆసాంతం అయోధ్యలో బీజేపీ వైఖరి దాదాపు అన్నివర్గాల నుండి తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు నుండి బీజేపీ తన వైఖరిని సమర్థించుకునే దిశగా ప్రజాభీష్టం మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మించాలనుకొన్న యూపీ ప్రభుత్వం నేరమేమీ చేయలేదే అన్నది. ప్రధాన ప్రతిపక్షం తరపున ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ప్రతివాదం కాంగ్రెసు ఇతర పక్షాల నిరసనలను మాటిమాటికీ ఎదుర్కొనవలసి వచ్చింది. అయోధ్య వ్యవహారం ప్రజల విశ్వాసంతో ముడిబడినటువంటిది గనుక తొందరపాటు నిర్ణయాలు కూడవంటూ ఆయన తన ప్రతివాదాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం చెప్పేదానికీ చేసేదానికీ పొంతనలేకుండా పోయిందని అంటూ లౌకికవాదం అనేది అసలు విజాతీయ పదమనీ అత్యధిక సంఖ్యాకుల మనోవేదనల్ని పట్టించుకునేవారే లేకుండాపోయారని ఆయన వాపోయారు. ఈ లోగా బీజేపీ ఉపాధ్యక్షులు డిసెంబరు 6న ప్రారంభం కానున్న కరసేవలో నిర్మాణ కార్యక్రమం ఉండబోదని డిసెంబరు 3న ప్రకటించారు. డిసెంబరు 4న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఈ విధంగా వార్తనందించింది. బీజేపీ విషయాన్ని జటిలం చేయదలచక అయోధ్యలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న కరసేవలో నిర్మాణ కార్యక్రమం ఉండబోదని ఈ రోజు తెలియజేసింది. వివాదంలో ఉన్న కట్టడం యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పదిలం అనీ కనుక కేంద్రం వెంటనే పారామిలటరీ దళాలను ఉపసంహరించాలనీ; ఆ విధమైన బలప్రదర్శన రెచ్చగొట్టగలదనీ బీజేపీ నేత పునరుద్ఘాటించారు.

కోర్టు ఉత్తర్వులు ధిక్కరింపబడేవరకు కేంద్ర ప్రభుత్వాన్ని రిసీవరుగా నియమించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా సుప్రీంకోర్టు పరిశీలకుడు కూడా ఇంతవరకు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరగలేదనే పేర్కొన్నారు.

డిసెంబరు 4న రాజ్యసభలో హోంమంత్రి మరో ప్రకటన చేస్తూ కేంద్రం అయోధ్య విషయంలో ఘర్షణను నివారించాలనే పట్టుదలతోనే ఉన్నదనీ కనుక ఆ సమస్యకు సంబంధించిన వారందరినీ ఏకోన్ముఖ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఒప్పించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo