బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Sep 13, 2020 , 00:22:46

రక్షణ చర్యలపై నిర్లక్షమా?

రక్షణ చర్యలపై నిర్లక్షమా?

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

ఓ ప్రశ్నకు సమాధానంగా అద్వానీ.. కొందరు కుహనా లౌకికవా దులు భయపడినట్లుగా రామమందిర నిర్మాణం అంతర్జాతీయ సంబంధాలను చెడగొట్టదు అని చెప్పారు. డిసెంబర్‌ 6 దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో ఉద్రిక్తత ఊపందుకోసాగింది. ఆ రోజున ప్రారంభం కానున్న నిర్మాణ కార్యక్రమంలోని ప్రతీకాత్మక కరసేవ విషయంలో అంతా గందరగోళమే. బీజేపీ నాయకులు-మరీ ముఖ్యంగా యల్‌కే అద్వానీ, యమ్‌యమ్‌ జోషీలు, వీహెచ్‌పీ-ఆరెస్సెస్‌, భజరంగదళ్‌ కూటమివారు అందరూ తలకొక రకమైన ప్రకటనలివ్వటంతో అది మరింతగా కలవరపెట్టసాగింది.

డిసెంబర్‌ 3న రాజ్యసభలో జరిగిన చర్చలో వివిధ వర్గాలు అయోధ్యలో తలపెట్టిన కరసేవ సందర్భంగా ఘర్షణ చెలరేగవచ్చునని భయాందోళనలు వ్యక్తం చేస్తుండగా, బీజేపీ మాత్రం డిసెంబర్‌ 6లోగా వివాదంలో ఉన్న 2.77 ఎకరాల సేకరించిన భూమి విషయంలో కోర్టు తీర్పు వెలువడేట్లు చేయగలిగితే సంక్షోభం కుదుటపడే అవకాశం ఇంకా లేకపోలేదని తెలియజేసింది. నాలుగున్నర గంటలపాటు అయోధ్య సమస్యపై జరిగిన చర్చలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన సభ్యులు- ఒక్క బీజేపీ తప్ప.. పరిస్థితి భగ్గుమనేట్లుందనీ దానిని తగిన సమయంలో చల్లార్చేందుకు తక్షణ చర్యలు గైకొనబడాలని వాదించారు. పలువురు సభ్యులు ప్రభుత్వపు క్రియారహిత వ్యవహారాన్ని దుయ్యబట్టారు. అవసరాన్ని బట్టి ఏ చర్య అయినా గైకొనేందుకు ప్రభుత్వాన్ని సిద్ధపడమని జాతీయ సమైక్యతామండలి సమావేశంలో చెప్పినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రణాళికాబద్ధం కానందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సభలోని పలువర్గాల దాడికి బీజేపీ లక్ష్యమయ్యింది.

కేంద్ర బలగాలను యూపీకి పంపటాన్ని బీజేపీ తప్పుపడుతుండగా, పలు పార్టీలు, కాంగ్రెస్‌లోని కొన్ని ముఠాలు అయోధ్యలో శాంతిభద్రతలు కాపాడే బాధ్యతను నేరుగా కేంద్రమే వహించి వివాదంలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు తీర్థాన్ని సంరక్షించాలని భావించాయి. ఆ వ్యవహారం బీజేపీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండరాదని వాళ్లు భావించారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు వ్యతిరేకంగా నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించాలనే తలంపుతో ఇచ్చే ప్రకటనలు బీజేపీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేశాయి. యల్‌కే అద్వానీ, యమ్‌యమ్‌ జోషీ యూపీలో నిర్వహిస్తున్న యాత్రలు దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా హింసను ప్రేరేపించే చర్యలుగా చూడబడినాయి.

చర్చ ముగింపు సమయంలో బీజేపీ సభ్యుడు డాక్టర్‌ జేకే.జైన్‌ వివాదంలో ఉన్న కట్టడానికి పక్కనే 2.77 ఎకరాల సేకరించిన స్థలంపై హక్కుకు సంబంధించిన తీర్పును త్వరగా ఇవ్వవలసిందిగా కోర్టును కోరాలనే ప్రతిపాదన చేశారు. మందిరం విషయంలో వివాదం జటిలమైనది కనుక వెంటనే తేలేది కానందున, 2.77 ఎకరాల వివాదాన్ని కరసేవ ప్రారంభానికి ముందే తేల్చమని పార్లమెంటు, ప్రభుత్వం, సంబంధిత పార్టీలు కోర్టును కోరినట్లయితే అది పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉన్నది. కోర్టు వాదోపవాదాలు విన్నది గనుక ఇక తీర్పు చెప్పటమే తరువాయి అని అన్నారాయన. ఈ వ్యవహారంపై చర్చ హోంశాఖకు చెందిన సహాయమంత్రి యమ్‌.యమ్‌.జాకబ్‌ అయోధ్యపై ప్రస్తుతం నెలకొన్న స్థితిపై ప్రకటన చేయటంతో ప్రారంభమైంది. అటువంటి ప్రకటనే లోకసభలో హోంశాఖామంత్రి యస్‌.బి.చవాన్‌ చేశారు. మంత్రి ప్రకటనపై వివరణలు కోరుతూ సభ్యులు సుదీర్ఘంగా ప్రసంగించారు

బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అయిన సికందర్‌ భక్త్‌ రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా కేంద్ర బలగాలను యూపీకి పంపటంలోని చట్టబద్ధతను ప్రశ్నించారు. గతంలో అధికరణం 257 కింద దేశంలో ఏ ప్రాంతానికైనా తన బలగాలను తరలించే హక్కు కేంద్రానికి ఉండేది. కానీ తర్వాత తెచ్చిన సవరణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించటం తప్పనిసరి. ఆ బలగాలు అక్కడ ఉండటం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. పాలకపక్షం తరపున మాట్లాడిన యమ్‌.సి.భండారే, మదన్‌టియా, యన్‌.కే.పీ.సాల్వే మరికొందరు పరిస్థితిని చక్కదిద్దటంలో ప్రదర్శించిన పరిపక్వతకు కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు గనుక బీజేపీ, మిగతా పక్షాలు కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవటం మంచిదన్నారు. కోర్టులో ఒక విధమైన వైఖరి బయట వేరే విధమైన వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నందుకు బీజేపీని దుయ్యబట్టారు. ఓట్ల కోసం మతపరమైన ఆవేశాన్ని రెచ్చగొట్టే బీజేపీ ప్రయత్నాన్ని వాళ్లు తప్పుబట్టారు. 

కాంగ్రెస్‌ సభ్యులు సుప్రీంకోర్టును వివాదంలో ఉన్న కట్టడం మందిరమా లేక మసీదా అనేది తేల్చమని ఏకోన్ముఖంగా కోరటం జరగాలన్నారు. డిసెంబరు 4న ధరమ్‌ సంసద్‌ కరసేవ ఎలా జరగాలనేది నిర్ణయించిన తర్వాత దానిని సమీక్షించేందుకు డిసెంబరు 5న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహింపబడాలని ఓ కాంగ్రెస్‌ సభ్యుడు సూచించటం జరిగింది. కేంద్ర హోంమంత్రి యస్‌.బి.చవాన్‌, యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ లేఖలకు 1992 డిసెంబరు 3న సమాధానం పంపుతూ పేరామిలటరీ దళాలను ఒకచోట ఉంచటానికి, రంగంలో దించటానికి గల తారతమ్యాన్ని గమనించమని కోరారు. (అనుబంధం XI చూడండి.. నవంబరు 23న సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ దృష్ట్యా కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించగలిగిన సాయం అంతా అందించాల్సి ఉంది గనుక కేంద్రం పారా మిలటరీ దళాలను యూపీలో అనువైన తావులకు నవంబరు 24న ‘పంపింది’. కట్టడ రక్షణ కోసం ఎప్పుడు అవసరం బడితే అప్పుడే తక్షణం రంగంలోకి దించేందుకు’ అలా చేయటం జరిగిందని ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయటం జరిగిందని ఆయన గుర్తుచేసారు.

వివాదంలో ఉన్న కట్టడానికి దగ్గర్లో 2.77 ఎకరాల భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు చట్టబద్ధమైనవా కావా అనే విషయంలో అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచి తన తీర్పును అయోధ్యలో కరసేవ ప్రారంభానికి ముందు అంటే డిసెంబరు 6కు ముందు వెలువరించేట్లు ఉత్తర్వులు జారీచేయవలసిందిగా ఆర్‌.కే.గార్గ్‌ అనే న్యాయవాది వేసిన రిట్‌ దరఖాస్తును డిసెంబరు 3న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo