గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Sep 12, 2020 , 04:12:07

రెవెన్యూ బిల్లు రైతుకు మేలు

రెవెన్యూ బిల్లు రైతుకు మేలు

అన్ని ప్రభుత్వ శాఖలపై మంచి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెవెన్యూ శాఖ పనితీరుపై లోతైన ఆలోచన ఉంది. అన్ని పనులూ రెవెన్యూవారే చేస్తున్న సంగతి కూడా తెలిసిన ముఖ్యమంత్రి భూ వ్యవహారాలలో వారి పని విధానం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు అనేక సందర్భాలలో తెలుస్తూ వచ్చింది. ఆ అసంతృప్తి ప్రజలలో కూడా ఉందని భావించి ఆ శాఖను సంస్కరించాలని సంకల్పించారు. అందులో మొదటి అడుగుగా ‘భూమి హక్కుల రికార్డు బిల్లు- 2020’ను స్వయంగా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ బిల్లు తయారీలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నట్లుగా బిల్లులోని అంశాలను చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 1971’ని రద్దుపరుస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ భూమి హక్కుల రికార్డును ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్వహించడం, ఎలక్ట్రానిక్‌ పాసు పుస్తకాలు రైతులకు అందించడం, పాసు పుస్తకాలను తరచూ నవీకరించుకునే అవసరాలను తగ్గించడం, రైతుల నుంచి ఏ డాక్యుమెంటును అడుగకుండా అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ డేటా ఆధారంగా బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రుణాలు మంజూరీ చేయడం, రిజిస్ట్రేషన్‌తో పాటే యాంత్రికంగా హక్కుపత్రంతో భూములు చేరిపోవడం లక్ష్యంగా ఈ బిల్లు తయారుచేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడటం, అవినీతిని నిర్మూలించడం కూడా ఇందువల్ల సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. స్థూలంగా ఈ బిల్లులో రెండు విప్లవాత్మకమైన నిర్ణయాలున్నాయి. అవి ఆటో మ్యుటేషన్‌, రెవెన్యూ కోర్టుల రద్దు.

ఈ బిల్లు ‘ధరణి వెబ్‌సైట్‌'ను అంతిమంగా తయారైన హక్కుల రికార్డుగా భావిస్తుంది. సాధారణంగా హక్కుల రికార్డు (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌- ఆర్వోఆర్‌) తయారీలో ముసాయిదా ప్రకటన, అంతిమ ప్రకటన అనే అంచెలుంటాయి. 1971 చట్టాన్ని 1979- 80లలో, 1989- 90లలో నవీకరించాలనుకున్నప్పుడు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో భాగంగా హక్కుల రికార్డును ‘ఫారం-1’గా ప్రకటించి కొంత సమయం ఇచ్చి అభ్యంతరాలు, చేర్పులను ఆహ్వానించేవారు. అట్లా వచ్చిన అభ్యంతరాలు, చేర్పులను పరిష్కరించి తుది ఆర్వోఆర్‌ను ప్రకటించేవారు. ప్రస్తుతం ఈ బిల్లు ‘ధరణి’లో ఉన్న డేటాను తుది ఆర్వోఆర్‌గా ప్రకటిస్తుంది. ధరణిని డ్రాఫ్ట్‌గా పరిగణించి అభ్యంతరాలను కోరితే అట్లా వచ్చే అభ్యంతరాలను తిరిగి రెవెన్యూ వారే పరిష్కరించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కథ మళ్ళీ మొదటికే వస్తుందని ప్రభుత్వం భావించింది. అందుకే ధరణిని తుదిరూపంలో ఉన్న ఆర్వోఆర్‌గా ప్రకటించింది. ధరణిలో వివాదరహితమైన, నిస్సందేహమైన, తప్పుల్లేని రికార్డు నిక్షిప్తమై ఉందని ప్రభుత్వం భావించింది. కాబట్టి రిజిస్ట్రేషన్‌తో పాటుగా పట్టా మార్పు కూడా జరగాలని ఇందులో పొందుపరిచింది. ఇది సజావుగా జరగాలంటే రిజిస్ట్రేషన్‌ చేసే అధికారి, మ్యుటేషన్‌ చేసే అధికారి ఒకరే ఉండాలని భావించడం గొప్ప పురోగామి ఆలోచన. రైతాంగానికి ఇది గొప్ప ఊరట.

ఇక రెండో విప్లవాత్మకమైన నిర్ణయం రెవెన్యూ కోర్టుల రద్దు. తాసిల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్ల కోర్టుల్లో ఉండే కేసుల సంఖ్య నిజానికి పెద్దదేమీకాదు. కానీ రెవెన్యూ అధికారుల ప్రాధాన్య అంశాలలో కోర్టుల నిర్వహణ ఉండదనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే రెవెన్యూ కోర్టుల కేసుల పరిష్కారానికి ఎక్కడా టైంలెన్‌ లేదు. కనీసం పర్యవేక్షించేవారూ లేరు. కొందరు ఆర్డీవోలు, జాయింట్‌ కలెక్టర్ల దగ్గర దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కేసులున్నాయి. కొన్ని కేసులు సత్వరం పరిష్కరించే సందర్భాలుంటాయి. రెవెన్యూ కోర్టులు సరిగ్గా పనిచేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. అడ్వకేట్ల కోరిక మేరకు రెవెన్యూ కోర్టులు శనివారాలే నడుస్తాయి. నెలలో దొరికే మూడు శనివారాలలో ఉన్నతాధికారుల దగ్గర సమావేశాల వల్లనో, ప్రొటోకాల్‌ హాజరీల వల్లనో కనీసం ఒక శనివారం పోతుంది. కోర్టుల నిర్వహణలో సామర్థ్యం ఉన్న రెవెన్యూ అధికారులు చాలా తక్కువమందే ఉంటారు. జ్యుడీషియరీలా కాకుండా క్షేత్రస్థాయి అధికారులు కాబట్టి ఒత్తిళ్లు కూడా ఉంటాయి. కాబట్టి రెవెన్యూ కోర్టులను రద్దుచేయడం ఒకరకంగా రెవెన్యూ అధికారులకు ఉపశమనం కూడా.

ప్రస్తుతం రెవెన్యూ కోర్టులలో పెండింగులో ఉన్న కేసులన్నీ ఈ బిల్లు ద్వారా ఏర్పాటయే ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి. ట్రిబ్యునల్‌ రూపురేఖలు, పని విధానం గురించి ఈ బిల్లు లో ఏమీ చర్చించలేదు. కాబట్టి బహుశా ట్రిబ్యునల్‌ ఏర్పాటు కోసం మరో చట్టం చేయవలసి వస్తుంది. ఎంతో సదుద్దేశంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూమి హక్కుల రికార్డు బిల్లు చట్టరూపం ధరించేవరకు కొన్ని చేర్పులు, మార్పులు ఉండటానికి అవకాశం ఉంది. వాటిని ఇలా సూచించవచ్చు.

1. ‘ధరణి’ని అంతిమంగా రూపొందించిన హక్కుల రికార్డుగా భావిస్తున్నారు. ఈ హక్కుల రికార్డులో పొరపాట్లు దొర్లాయని భావిస్తే సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దానిని ఏదో ఒక క్లాజుగా చేర్చవచ్చు.

2. ప్రత్యేక ట్రిబ్యునళ్లు భూమి హక్కుల రికార్డుకు సంబంధించిన వివాదాలకు మాత్రమే పరిమితమవుతాయా, లేక అన్నిరకాల కేసులను విచారిస్తాయా స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది. ఆక్రమణల చట్టం ప్రకారం తాసిల్దారు, ఇనాం రద్దు చట్టం ప్రకారం ఆర్డీవో ప్రాథమిక విచారణ అధికారులు. కౌలుదారీ చట్టం, ఎస్టేట్స్‌, బొనావెకెన్షియా చట్టం, ప్రభుత్వ కార్యాలయాల ఆక్రమణల తొలగింపు చట్టం తదితరాల ప్రకారం రెవెన్యూ అధికారుల విచారణలు ‘రెవెన్యూ బోర్డు’ నిర్వచనంలోకి వస్తాయా రావా అనేదానిని ఏదో ఒక క్లాజులో చేర్చవచ్చు.

3. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఆదేశాలే అంతిమం అని ఈ బిల్లు చెప్తున్నది. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ లేని సందర్భంలో నష్టపోయిన పార్టీలు నేరుగా హైకోర్టునే ఆశ్రయించవలసి ఉంటుంది. హైకోర్టులో రిట్‌ జ్యూరిస్‌డిక్షన్‌ (పరిధి)లో మాత్రమే విచారణ ఉంటుంది. కాబట్టి ట్రిబ్యునల్‌ పొరపాటున వదిలివేసిన అంశాలుంటే కనీసం రివ్యూ (పునర్విచారణ) అయినా ట్రిబ్యునల్‌ వద్ద కొనసాగే వెసులుబాటు ఉండాలి. గతంలో లాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు వైఫల్యాన్ని ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి.

4. పాస్‌బుక్‌లో కుటుంబసభ్యులను చేర్చుకోవాలని ఒక నిబంధన ఈ బిల్లులో ఉంది. ఇది కొంత ఉపయోగకరమైన ఎంట్రీయే కానీ ఆ ఎంట్రీకి కట్టుబడి మాత్రమే తర్వాత ఫౌతీలు జరగవనే ఒక నిబంధన చేర్చడం మంచిది.

5. బిల్లులో నిబంధన 7(6)లో తాసిల్దార్‌ నిర్దిష్టపరిచిన తేదీన తీర్పు రుణగ్రస్థుడు హాజరై పాస్‌బుక్‌ సమర్పించాలని ఉంది. వాస్తవికంగా తీర్పు రుణగ్రస్థుడు తన ఆస్తిని తొలగించుకోవడానికి తాసిల్దార్‌ పిలిచినప్పుడు రాడు కాబట్టి అతని రాకతో సంబంధం లేకుండా సవరణ చేసుకోవడం మేలు.గ్రామాధికారులను తొలగించడం, రెవెన్యూవారి అధికారాలను తగ్గించడం, ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు జవాబుదారీ పాలనను అందించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. పరిమితమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన పనులు చేసి మంచిపేరు సంపాదించుకోవడానికి రెవెన్యూశాఖ ఈ మార్పులనొక అవకాశంగా స్వీకరించాలి.


logo