మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Sep 12, 2020 , 04:12:04

ఏడు గుంటలకు... ఏడాది ఏడుపు

ఏడు గుంటలకు... ఏడాది ఏడుపు

  • సామాన్యుడి మాట

నా పేరు సత్తయ్య. మా ఊరు కన్నారం జిల్లాలోని మానకొండూర్‌ మండల కేంద్రం. మా నాయిన పెద్దెంకయ్యకు ఒక్క బిడ్డా, ఎనమండుగురు కొడుకులం. నేనే ఇంటికి చిన్నోన్ని. మా నాయిన నాకిచ్చిన పది గుంటలకు తోడు ఇంకో ఎకురం భూమి నా రెక్కల కట్టంతోని కొనుక్కున్న. అది మానకొండూర్‌ శివారులోని 1374 ‘ఏ’, 1374 ‘ఏ, బీ’ పట్టా నెంబర్లలో ఉంటది. మూడేండ్ల కిందనే బిడ్డకు లగ్గం జేసిన. ఇగ నాకిద్దరు మొగ పోరగాండ్లు. అందులో పెద్దోనికి కడుపులుండంగనే గానం పడితే కొండెనాలిక లేకుండా పుట్టిండు. అందుకే వానికి మాట నత్తివోతది. కేసీఆర్‌ సార్‌ దయ వల్ల వికలాంగుల పింఛన్‌ కింద నెలకు మూడు వేల రూపాలొత్తున్నయ్‌. వాటితోనే వాని కర్సులు ఎళ్తున్నయ్‌.

ఇల్లు కట్టి సూడు, పెండ్లి చేసి సూడని అట్టిగన్లేదు. బిడ్డ పెండ్లి జేసి, ఇల్లు కట్టేసరికి నాకు మొసమర్రకుంటయ్యి అప్పుల పాలైన. నా కట్టం మిత్తీలకు సాలలె. ఇట్లా కాదని ఓ ఉపాయానికచ్చిన. నాది పిరం భూమి. ఆ భూమి అమ్ముకోంగ అచ్చిన పైసలతోని అప్పులు కట్టి, అగ్గువకు దొరికే కాడ ఓ ఎకురం కొనుక్కుందామనుకున్న. భూమమ్ముతానంటే కొనేటోళ్లు మస్తుగొస్తుర్రు గనీ, దాన్ల కొంచెం కొర్రి వడ్డది. నా భూమిలకెల్లి ఓ ఏడు గుంటలు పక్కోని పేరు మీద వడ్డది. భూమి కొనేటోడు కొర్రీల్లేకుండనే సూసుకుంటడు గదా, ఆడు మనకు కొత్తలిత్తలేడా మరి మనసులనుకున్న.

ఆన్నుంచి నా భూమిని అమ్ముకోవడానికి నేను వడ్డ తిప్పలెన్నో. మండలాఫీస్‌ సుట్టూ చెప్పులరిగేలా తిరిగిన. తిరుగంగా తిరుగంగా ఒకరోజు ఎమ్మార్వో సార్‌ దొరికిండు. ‘సార్‌ నా భూమి మీ మండలాఫీసుల పన్జేసే సార్ల మిస్టిక్‌ వల్ల నా ఏడు గుంటల భూమి పక్కపొంటోని పేరు మీద వడ్డది. జెర్ర దయుంచి నా భూమిని నా పట్టాలకెక్కియ్యం డి సార్‌, భూమమ్ముకోవాలె, అప్పులోల్లు ఇంటిమీదికొచ్చి ఇజ్జతి, మానం తీత్తర్ర’ని ఎమ్మార్వోకు నా బాధంతా చెప్పుకున్న. ఆ సార్‌ ఎంబటే వీఆర్వోను పిల్సి ‘వీఆర్వోగారు సత్తయ్య పనేందో మోక మీదికి వెయ్యి సూడు, ఆ పక్కపొంటోళ్లను కూడా తెల్సు కో’ అని జెప్పి ఇద్దర్ని బైటికి తోలిండు. సార్‌ దగ్గర తలూపిన వీఆర్వో, బైటికొచ్చినంక ‘సత్తయ్యా కొంచెం పనిమీదున్న, రేప్పొద్దున్నే సక్కగా మోకమీదికే అస్తా, నువ్వు పొద్దున్నే ఆడికి నడువ్‌' అని చెప్పి నన్ను ఇంటికి తోలిండు. మోక మీదికి రేపొ స్తానన్న వీఆర్వో, ఎనిమిది నెల్లయినా జాడ లేడు పత్తా లేడు. నేను రోజూ ఎమ్మార్వో ఆఫీసుకు పోవు డు, నేను ఎమ్మార్వో సారును కల్వకుండా వీఆర్వో నాకేదో కథ చెప్పుడు, నేను మర్రొచ్చుడు. ఇట్లా ఏడాది దగ్గరికొచ్చింది. పని పట్టాకెక్కలేదు.

ఇట్లా కాదనుకొని ఓ రోజు వీఆర్వోకు దొరుకకుండా సీదా ఎమ్మార్వో సారునే కలిసి ముచ్చటం తా చెప్పిన. ఎంబటే సార్‌ వీఆర్వోను పిల్సి ‘ఎందుకిన్నొద్దులు సత్తయ్య పని పెండింగ్‌ల వెట్టినవ్‌, మోక మీదికెందుకు వోలేదం’టూ గదమాయించిండు. ‘సార్‌ రేపు తప్పకుండా వోత’నని తెల్లారంగనే పొలం కాడికి చేరిండు వీఆర్వో. పక్కపోంటోళ్లతో మాట్లాడిండు, వాళ్లు కూడా ఆ భూమి సత్తయ్యదే, మిస్టిక్‌ల పలానోళ్ల పట్టాల వడ్డదని చెప్పిం డ్రు. వాళ్లు చెప్పిందే ఎమ్మార్వో సార్‌తోని చెప్పిండు వీఆర్వో. నా పని కతమైంది. నెల రోజుల్లో నా భూమి అమ్ముడు పోయింది. నా అప్పులు తీరినయి. ఇరుకింట్ల ఉండే నేను కొత్తిల్లూ కట్టుకున్న.గిట్లుంటుండే వీఆర్వోల కథ. అసోంటోళ్లు ఉంటేంది, పోతేంది? ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ మంచి పనే జేసిండు.

- ఇంటర్వ్యూ: గడ్డం సతీష్‌, 99590 59041


logo