మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Sep 12, 2020 , 04:12:03

కరోనాపై విజయం సాధ్యమే

కరోనాపై విజయం సాధ్యమే

మారుతున్న కాలంతోపాటు టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందుతున్న వాస్తవం కనిపిస్తున్నదే. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌ ప్రక్రియ కూడా తొందరగానే ముగియవచ్చు. అందుకే కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నాయి. రష్యా వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు, త్వరలోనే వినియోగంలోకి తెస్తామని చెప్పడాన్ని కూడా కొట్టిపడేయలేం.

కరోనాకు అంతమెప్పుడో.. ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పటి పరిస్థితుల్లో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా కరోనా ప్రసక్తి రాకతప్పదు. కరోనా ఎఫెక్ట్‌ ఇంకెన్ని రోజులుంటుందో? అసలు పోతుందంటారా? పెరుగుతుందా తగ్గుతుందా? వ్యాక్సిన్‌ ఇప్పట్లో వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల మధ్య గింగిర్లు తిరుగుతున్నాయి. విడుతలుగా లాక్‌డౌన్లు ఎత్తేస్తున్న తరుణంలో ప్రజలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పటికీ లోపల మాత్రం భయంగానే ఉంటున్నారు. తమకు లేదా తమ కుటుంబసభ్యులకు ఎవరికన్నా కరోనా పాజిటివ్‌గా వస్తే అధైర్యపడుతున్నారు. 

కొన్ని అస్పష్టమైన, విరుద్ధమైన వార్తలతో జనం గందరగోళానికి గురవుతున్నారు. ఉదాహరణకు.. కరోనాకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఇది మామూలు దగ్గు, జలుబు లాంటిదే, ఒకరకమైన వార్తలైతే; లక్షణాలు కనపడగానే వైద్యుణ్ని సంప్రదించండి, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం మీదకు రావొచ్చు అనేవి మరోరకం. కరోనా అదుపులోనే ఉంది కేసుల నమోదు తగ్గుముఖం పడుతుందని ఒకరోజు వార్తలొస్తే.. మరుసటి రోజు దానికి భిన్నంగా భారత్‌లో కేసులు 41 లక్షలు దాటి ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానానికి చేరుకుందనే రకం వస్తుంటాయి. ఇలాంటివి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఒకసారి కరోనా సోకి వెళ్తే ఆ వైరస్‌కు వ్యతిరేకంగా ఆ వ్యక్తిలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెంది మళ్లీ ఆ వైరస్‌ బారిన పడకుండా రక్షిస్తాయనే వార్త కొందరికి సంతోషం కలిగిస్తే; వైరస్‌ మళ్లీ సోకదనే గ్యారంటీ ఏమీ లేదు, శరీరంలో యాంటీబాడీస్‌ ఉన్నంత మాత్రాన అవి పూర్తిరక్షణ ఇస్తాయని చెప్పలేం, జాగ్రత్తగానే ఉండాలనే మరో వార్త కలవరం రేపుతుంది. ఈ మధ్య రష్యా వ్యాక్సిన్‌ కనిపెట్టాం, త్వరలోనే వాడుకలోకి తీసుకరానున్నామని ప్రకటించగానే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండ్రోజులకే ఇంత తొందరగా సాధ్యం కాదు, మూడో దశ ట్రయల్స్‌కే చాలా సమయం పడుతుందని ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలు ప్రకటించేసరికి ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.

ఇలాంటి కొన్ని పరస్పర విరుద్ధ ప్రకటనల గురించి కొంత లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు బోధపడుతాయి. వాస్తవానికి కరోనా మనం అనుకున్నంత భయంకరమైంది కాదు. ఆరోగ్యశాఖ గణాంకాలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కరోనా సోకినవాళ్లలో 80 శాతం మందికి ఏ లక్షణాలూ ఉండటం లేదు. లక్షణాలు న్న వాళ్లలో కూడా 99 శాతం మంది కోలుకుం టున్నారు. ఒక శాతం లోపే మరణాలు సంభవిస్తున్నాయి. ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లలో మాత్రమే కొం దరు మరణిస్తున్నారు. లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయ కుండా వైద్యుణ్ని సంప్రదించి, చికిత్స పొందితే ఆ మరణాలనూ నివారించవచ్చు.

కేసులు పెరిగినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అదుపులోనే ఉందంటున్నా పాజిటివ్‌ కేసులు 41 లక్షలు దాటుతున్నాయి కదా అనే అంశం గురించి విశ్లేషించుకుంటే- పాజిటివ్‌లు పెరగడం వల్ల హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చి ఈ వైరస్‌ ఎఫెక్ట్‌ తగ్గే అవకాశం ఉంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉంది కాబట్టి పరిస్థితి అదుపులో ఉన్నట్టే. ఇక కరోనా ఒకసారి సోకి నయమైతే మళ్లీ రావడం గురించి పరిశీలిస్తే- ఇప్పటివరకు మన దేశంలో కొన్ని లక్షల మందికి కరోనా సోకి నయంకాగా రెండోసారి ఇన్ఫెక్షన్‌కు గురైన ఉదంతాలు కొన్ని మాత్రమే. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వ్యాక్సిన్‌ విషయానికి వస్తే- ఇదివరలో వ్యాక్సిన్‌ తయారీకి కొన్నేండ్లు పట్టేది. వ్యాక్సిన్‌ రూపొందాక పలుదశల్లో ట్రయల్స్‌ కొనసాగుతాయి. మొదట కొంతమంది మీద, ఆ తర్వాత కొన్ని వందల మంది మీద ప్రయోగించి చూడాలి. కాబట్టి వ్యాక్సిన్‌ ఇప్పట్లో అందుబాటులోకి రావడం సాధ్యం కాదని పలు దేశాలతోపాటు డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రకటించింది. కానీ మారుతున్న కాలంతోపాటు టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందుతున్న వాస్తవం కనిపిస్తున్నదే. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌ ప్రక్రియ కూడా తొందరగానే ముగియవచ్చు. అందుకే కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నాయి. రష్యా వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు, త్వరలోనే వినియోగంలోకి తెస్తామని చెప్పడాన్ని కూడా కొట్టిపడేయలేం. కాబట్టి ప్రజలు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలి. గుంపులుగా చేరకుం డా, ఏ మాత్రం లక్షణాలు కనపడ్డా నిర్లక్ష్యం చేయకూడదు. నాకేమీ కాదనే అతి విశ్వాసం పనికిరాదు.

(వ్యాసకర్త: చెవి, ముక్కు, గొంతు నిపుణులు,ఈఎన్టీ దవాఖాన, కోఠి)logo