మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Sep 12, 2020 , 04:12:02

ఘర్షణకు తలపడితే సిద్ధమే

ఘర్షణకు తలపడితే సిద్ధమే

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

కోర్టు ప్రత్యేకంగా అయోధ్య కోసం నియమించిన పరిశీలకుడు తేజ్‌శంకర్‌కు కావలసిన సకల సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినట్లున్నూ ఆయన వివాదంలో వున్న కట్టడాన్నీ, శిలాన్యాస్‌ స్థలాన్నీ, సేకరించిన 2.77 ఎకరాల భూమిని విస్తృతంగా సర్వే జరిపిన మీదట సుప్రీంకోర్టు ఉల్లంఘన ఏమీ జరుగలేదని ఆయన గమనించారనిన్నూ కల్యాణ్‌సింగ్‌ తెలియజేశారు. డిసెంబర్‌ 6న ఆయన కరసేవ చేయనున్నారనే వార్తల్ని ఖండిస్తూ తమ ప్రభుత్వం రాజ్యాంగపు పవిత్రతను, చట్టం యొక్క హుందాతనాన్ని కరసేవ సందర్భంగా నిలబెట్టి తీరుతుందని ప్రకటించారు. డిసెంబర్‌ 2న పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ అయోధ్య వ్యవహారమే ప్రముఖంగా చర్చించబడినట్లు, ఆ చర్చలకు బీజేపీ నేతలు యల్‌కే అద్వానీ, యమ్‌. యమ్‌.జోషీల వ్యాఖ్యల వల్ల మాటిమాటికీ అంతరాయం ఏర్పడినట్లు వార్తలు.నిరంతర అంతరాయాల మధ్య ప్రసంగించిన అటల్‌ బిహారీ వాజపేయి చెప్పిందేమంటే.. కరసేవ సందర్భంగా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించబడతాయనే పత్రికల్లోని వార్తల ఆధారంగా జనతాదళ్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌, కొందరు కాంగ్రెస్‌ సభ్యులూ ఒక్క ఉదుటున నిర్ణయానికి రావటం ఘోర తప్పిదమని. డిసెంబర్‌ 6న, నాటి కరసేవ తదితర కార్యక్రమాలన్నీ డిసెంబర్‌ 4న దేశ రాజధానిలో జరిగే ఓ సమావేశంలో నిర్ణయించబడతాయని యల్‌.కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని సభ దృష్టికి తెచ్చారు. అలాగే కోర్టు ఉత్తర్వులు అధిగమించబడవన్న అయోధ్య నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ వినయ్‌ కతియార్‌ ప్రకటన వైపు కూడా దృష్టి మళ్లింపజేశారు. వార్తాపత్రికల్లో వచ్చినంతగా అక్కడి పరిస్థితి తీవ్రంగా గానీ, ఆందోళనకరంగా గానీ లేదని వాజపేయి చెప్పారు. అయితే అసలు సమస్య ఏమంటే.. ఈ సభలోని సభ్యులు కొందరు అయోధ్యలోని ఉద్రిక్తతను సాకుగా తీసుకొని యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దుచేయాలని బాగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో తమ పార్టీ కోరుకునేది మందిర నిర్మాణమే గాని, కేంద్రంతో ఆ వ్యవహారంలో ఘర్షణ కాదు. అయినా సరే కేంద్రం ఘర్షణకు తలపడితే సవాలును స్వీకరించేందుకు బీజేపీ సిద్ధమే.

డిసెంబర్‌ 3 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక, యల్‌కే అద్వానీ ఈ కింది ప్రకటనను ప్రచురించింది- ‘యూపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కరసేవకులపై ఎటువంటి బలప్రయోగానికి పూనుకోదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కరసేవ డిసెంబర్‌ 6న ప్రారంభమవుతుంది. కరసేవను నిలిపివేయటం లేదా దానిని ప్రతీకాత్మకంగా చేపట్టే ప్రశ్నేలేదు.’ యల్‌.కే. అద్వానీ ఇంకా విలేఖరులకు తెలియజేసిందేమంటే.. కరసేవ భజనలకు, కీర్తనలకే పరిమితం కాదని మందిర నిర్మాణం కరసేవకుల ద్వారానే పూర్తికాదనీ, ఇంజినీర్లు, కౌశలం కలిగిన శ్రామికుల సేవల్ని కూడా వినియోగించటం జరుగుతుందన్నారు. బాధ్యతారహితంగా హిందువుల్ని కోపోద్రిక్తుల్ని చేసే ప్రకటనలతో ఆటలాడవద్దని కేంద్రాన్ని ఈ బీజేపీ నేత గట్టిగా హెచ్చరించటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం తన బలగాలను దింపి అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నది. ఆయన దృష్టిలో అయోధ్యలో కేంద్ర బలగాలు ‘ఫ్లాగ్‌ మార్చ్‌' చేయటం రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగేందుకు సంకేతం. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo