శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Sep 11, 2020 , 16:00:41

అబద్దమా సిగ్గుపడు!

అబద్దమా సిగ్గుపడు!

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చినా, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి పోయినా రూపాయి రూపాయే ఉంటది. దాని విలువలో, దాని రూపంలో ఏ మార్పూ ఉండదు. కానీ బీజేపీవాళ్లు ఢిల్లీలో 514 కోట్లు విడుదల చేస్తే హైదరాబాద్‌కు వచ్చేవరకు 7000 కోట్లు అయ్యిందంటున్నరు. అట్లెట్లా? అంటే చెప్పరు. ఎప్పుడైనా రాష్ర్టాల నుంచి వివిధ పన్నులు కేంద్రానికి పోతయి.. అందులో నుంచి కొంత భాగం రాజ్యాంగం నిర్దేశం ప్రకారం మళ్లీ రాష్ర్టాలకు వస్తయి. ఇందులో కొత్తేం ఉంది? దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియే. ఇది పార్టీలకు, నాయకులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంటది. అయితే బీజేపీ నాయకులు మాత్రం దీన్నొక ఘనకార్యంగా చెప్పకొంటున్నారు. వాళ్లిచ్చే సొమ్ములాగా ప్రచారం చేసుకుంటున్నారు. పైస నీదే అయినా, నీ జేబులో ఉన్నా.. ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పింది నేనే కాబట్టి.. ఆ ఘనత అంతా నా ఖాతాలో వేయాలని తొండిచేస్తున్నారు. 

కొవిడ్‌ కాలంలోనూ రాజకీయాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 ప్రతాపంతో ప్రజలంతా కకావికలం అవుతుంటే, సాయం చేయడం వదిలిపెట్టి.. శవాలమీద పేలాలు ఏరుకున్నట్టుగా.. అందులోనూ తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కొనే పనిపెట్టుకున్నది. ఇంతకు మించిన దౌర్భాగ్యం, దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అన్ని రాష్ర్టాలకు, ప్రజలకు ఇచ్చినట్లే తెలంగాణకు కూడా హక్కుగా రావాల్సిన నిధులే ఇచ్చింది తప్ప.. రూపాయి ఎక్కువ ఇయ్యలేదు. పీఎం కిసాన్‌ యోజనకు  1377.80 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చాలని కేంద్రం తీసుకొచ్చిన మరో పథకం జన్‌ధన్‌ యోజన కింద 770.27 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ డబ్బు కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వ మరో పథకం పీఎం ఉజ్వల్‌ యోజన. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు గ్యాస్‌ సబ్సిడీ అందించే పథకం. ఇందులో.. మన రాష్ట్రంలోని లబ్ధిదారులకు 130.05 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రతీ ఏడాది విడుదల చేసినట్టే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 307.50 కోట్లు విడుదల చేసింది. తాము ఇచ్చిన వాగ్దానం మేరకు ఆహార ధాన్యాల సరఫరాకు 1682.64 కోట్లు విడుదల చేసింది. పెన్షన్లు పెన్షన్లు అంటూ గగ్గోలు పెడుతున్న బీజేపీ నాయకుల్లారా.. తెలంగాణలో పెన్షన్‌ పథకానికి ఈ కరోనా కాలంలో కేంద్రం విడుదల చేసింది 66.60 కోట్లు మాత్రమే అని తెలుసుకుంటే బావుంటుంది. అంతేకాదు, ఇలా వివిధ పథకాలకు గత 5-6 నెలలుగా కేంద్రం డబ్బును నేరుగా విడుదల చేసింది. ఇవన్నీ కలిపినా బీజేపీ నేతలు చెప్తున్న 7 వేల కోట్లకు దరిదాపుల్లోకి కూడా రావన్నది సత్యం. నిజాయితీగా చెప్పాలంటే.. కరోనా కష్టకాలంలో కేంద్రం తెలంగాణకు విదుదల చేసిన సాయం డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద 299.33 కోట్లు. ఇది కూడా ప్రతి సంవత్సరం అన్ని రాష్ర్టాలకు విపత్తు సమయాల్లో వాడుకునేలా విడుదలచేస్తారు, అలాగే విడుదల చేశారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌కి కేటాయించిన 290.30 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 514.8 కోట్లు. కానీ ఇదే వైద్య ఆరోగ్య శాఖకు, తెలంగాణ ప్రభుత్వం 1405.60 కోట్ల రూపాయలను కేటాయించింది. కరోనా నియంత్రణలో పోలీసులకు ఇతర సిబ్బంది డైట్‌ చార్జీలకు 53.54 కోట్లు కేటాయించింది. 87.59 లక్షల బీపీఎల్‌ కుటుంబాలకు 1500 రూపాయల చొప్పన ఆర్థికసాయం చేసేందుకు 2628 కోట్లు ఖర్చు చేసింది. దిక్కులేక దీనులుగా నడకదారిన పోతున్న 2 లక్షల మంది ఇతర రాష్ర్టాల కార్మికులను మానవతా ధృక్పథంతో రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపేందుకు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కరోనాకాలంలోనూ రాష్ట్రంలో పనిచేసిన వలస కార్మిక కుటుంబాల ఆకలి తీర్చేందుకు 107 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాదు, కరోనాను అదుపులోకి తెచ్చేందుకు సక్రమంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించేందుకు సీఎం ఇన్సెంటివ్స్‌ కింద 216.82 కోట్లు చెల్లించింది. ఇక కేంద్రం ఇచ్చేవాటికి తోడుగా డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం 74.83 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 102.50 కోట్లు, బియ్యం పంపిణీ కోసం పౌర సరఫరాల శాఖ ద్వారా 774.49 కోట్లు ఖర్చు చేసింది. కేవలం కరోనా కట్టడి కోసమే దాదాపు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే.. బీజేపీ నాయకులు మాత్రం.. కేంద్రం విడుదల చేసిన 514 కోట్లను 7 వేల కోట్లని జుగుప్సాకరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు.

అధికారం కోసం పచ్చి అబద్ధాలా?

పాలించబడే ప్రజలకు- పాలించే నాయకులకు మధ్య తల్లీబిడ్డల అనుబంధం ఉండాలంటారు రాజనీతిజ్ఞులు. కానీ బీజేపీ నాయకులు ఈ విలువలను మరిచినట్టుగా కనిపిస్తున్నది. లేదంటే సొంత బిడ్డల్లాంటి ప్రజలకు ఇంతటి అబద్ధాలు చెప్తారా? అదీ ఆపదలో ఆదుకోవాల్సిన బాధ్యతను విడిచి.. పదేపదే అదే అబద్ధాలతో మోసం చేస్తారా?  వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేదు ‘మేం మాట్లాడే ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం.. మేమిచ్చింది ప్రజలకు చెప్తాం’ అనేంత గుండె ధైర్యం, సత్యసంధత ఉంటే.. ఆ 7000 కోట్ల రూపాయలను తెలంగాణకు ఏయే తేదీల్లో ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? ఒక్క తెలంగాణకు మాత్రమే ఇచ్చారా? ఇవన్నీ కేంద్రప్రభుత్వ అధికారిక జీవోలతో వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. అంతేకానీ నిత్యం 7 వేల కోట్ల పేరుతో ఏడ్పు రాజకీయం చేస్తే తెలంగాణ సమాజం సహించదన్న వాస్తవం గ్రహించాలి.

రాష్ట్రంలో బీజేపీ విద్వేష రాజకీయాలు

ప్రపంచమంతా ప్రగతివైపు, సాంకేతిక నైపుణ్యాలవైపు, అత్యున్నత జీవిత సాధనవైపు పరుగులు తీస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం తెలంగాణలో విధ్వంస రాజకీయాలకు తెరతీస్తున్నారు. లౌకికతత్వం, ప్రజాస్వామ్యాలను విడిచి.. మరిచిపోయిన రజాకార్లను తెరపైకి తెస్తున్నారు. గాయాలైన తెలంగాణ బిడ్డల గుండెలపై జ్ఞాపకాల గునపాలు దింపి విద్వేషం రెచ్చగొడుతున్నారు. ఐకమత్యంతో బతికే బతుకుల్లో విద్వేషపు కుంపట్లను రగిలిస్తున్నారు. ఒకపక్క అబద్ధాలు, మరోపక్క విద్వేషపు యాత్రలతో తెలంగాణను ఆగమాగం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. బీజేపీ నాయకుల వైఖరి తెలంగాణ బిడ్డలను తీవ్రంగా కలచివేస్తున్నది. జీవితాలే ఉద్యమంగా బతికి సాధించుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుంటే ఈ విభజన రాజకీయాలెందుకని ఆవేదన చెందుతున్నారు. ఈ తిరోగమన రాజకీయాలెందుకని గొంతెత్తి అడుగుతున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రజలకు తేల్చిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేదంటే ప్రగతిశీలురైన తెలంగాణ బిడ్డల ఆగ్రహానికి బలికాక తప్పదు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే విభజన రాజకీయాలకు, అబద్ధపు ప్రచారాలకు తెరలేపే అలవాటును మానుకొని, ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తే భవిష్యత్‌ లోనైనా ప్రజలు కొంతైనా ఆదరించే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నేండ్లయినా సింగిల్‌ నంబర్‌ సీట్లు, డిపాజిట్ల కోసం పాట్లే మిగులుతాయనే విషయాన్ని గ్రహించి మసులుకుంటే మంచిది. 

- అన్వితlogo