శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Sep 11, 2020 , 00:18:16

రణ రాజకీయం(సంపాదకీయం)

రణ రాజకీయం(సంపాదకీయం)

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న రోజునుంచీ సందేహాలు, వివాదాలతో మొదలై తుపాన్‌గా మారుతున్నది. సుశాంత్‌ది ఆత్మహత్యా, హత్యా అన్న దాన్నుంచి.. మాదకద్రవ్యాల దాకా సాగిన ఈ ఘటన చివరికి ఆధిపత్య రాజకీయాల దరికి చేరుకున్నది. సుశాంత్‌ ఆత్మహత్యపై అనుమానాలున్నాయంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు, ప్రతిస్పందనగా శివసేన నేతలు మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలతో సుశాంత్‌ కేసు రాజకీయ రంగు పులుముకుంటున్నది. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి అరెస్టు, మరునాడే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) సిబ్బంది కంగనా ఇంటిలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ కూల్చివేతకు దిగడం, పాలక కూటమి, భాగస్వామ్యపక్షాలు దీన్ని వ్యతిరేకించడం వెరసి రాజకీయ ఆధిపత్య ఆరాటంగా మారిపోయింది.

సుశాంత్‌ మరణం వెనుక బాలీవుడ్‌ మూవీ మాఫియా, రాజకీయ నేతల  హస్తం ఉందని కంగనా రనౌత్‌ ఆరోపించింది. అంతటితో ఆగకుండా ముంబై పోలీసులపై విశ్వాసం లేదని ప్రకటించి, జీవించాలంటేనే భయం వేస్తుందని, ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా మారిపోయిందని విమర్శించింది. భద్రత లేదనిపిస్తే ముంబై రావద్దని సంజయ్‌ రౌత్‌ అంటే, ముంబైలో జీవనోపాధి పొంది, ఇక్కడి ప్రజలను అవమానిస్తే సహించబోమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ హెచ్చరించారు. దీంతో తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని కంగనా కోరగానే కేంద్రం ఆమెకు వై క్యాటగిరీ భద్రత కల్పించింది. ముంబైలోని కంగనా నివాసానికి అనుబంధంగా నిర్మించుకున్న కార్యాలయంలో అనుమతులు లేకుండా మార్పులు చేశారని బీఎంసీ నోటీసులు పంపి, గడువు లేకుండానే కూల్చివేతలకు పాల్పడటం గమనార్హం. ముంబై హైకోర్టు ఉత్తర్వులతో కూల్చివేతలు నిలిచిపోయినా, శివసేన తీరుపట్ల కంగనా  తీవ్రం గా స్పందించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి.. ‘ఇవాళ నా ఇంటిని కూల్చటం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా..? ఇవ్వాళ నా ఇల్లు కూలినట్లే, రేపు నీ అహంకారం కూలుతుంద’ని విమర్శించటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

సుశాంత్‌ కేసులో ఆదినుంచీ అటు కేంద్రం, ఇటు శివసేన  అవసరానికి మించి, హద్దు మీరి ప్రవర్తిస్తున్నాయి. అయితే ఆయా పార్టీల చరిత్ర తెలిసిన వారికి ఇది వింతగా, కొత్తగా కనిపించదు. కంగనా విమానాశ్రయంలో దిగగానే శివసైనికులు నిరసనకు దిగారు. దీంతో కంగనాకు మద్దతుగా కొన్ని రాజకీయపక్షాలు రంగం మీదికొచ్చాయి. మరోవైపు కంగనాను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నట్టు బీజేపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఏదేమైనా సుశాంత్‌ విషాదంతో బాలీవుడ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి విషాద ఘటనలను రాజకీయాలకు పావులుగా వినియోగించుకునే సంస్కృతి అనుచితం.


logo