మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Sep 11, 2020 , 00:17:54

నీటి వాడకంలో నూతనాధ్యాయం

నీటి వాడకంలో నూతనాధ్యాయం

కురిసే వర్షపు నీటిని డబ్బు పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఆ నీటిని కుంటలు, చెరువుల్లోకి మళ్ళించడానికి, భద్రంగా నిల్వ చేసుకోవడానికి, కాల్వల ద్వారా పంట పొలాలకు మళ్ళించడానికి మాత్రమే ప్రభుత్వాలు కొంత డబ్బు ఖర్చుచేసేవి. అందుకే రైతులు చెల్లించాల్సిన నీటి తీరువా (పన్ను) నామమాత్రంగా ఎకరానికి వందో, రెండు వందలో ఉండేది. అందుకే రైతాంగానికి నీటి విలువ ఏమిటో తెలిసేది కాదు. రాజకీయ పలుకుబడితో లేదా రైతుల ఒత్తిడితో అధికారులు కూడా నిబంధనలు పక్కనపెట్టి కాల్వలకు కావలసినంత నీటిని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విడిచిపెట్టేవారు.

తమ పొలాల దిగువ నుంచి కాల్వల్లో నీరు ప్రవహిస్తుంటే ఎగువ భూముల రైతులు డీజిల్‌ మోటార్లతో కాల్వల నుంచి నీటిని తోడిపోసుకోవడం సర్వసాధారణమైంది. ఈ కారణాల వల్ల కాల్వ చివరి భూములకు, ప్రాజెక్టు అంచనా ఆయకట్టులో కనీసం సగభాగానికి కూడా నీరందక రైతులు ఇబ్బందులు పడటం అన్ని ప్రాజెక్టులలోనూ చూడవచ్చు. ఆయకట్టు పరిధిలో మెట్ట పంటలు (ఇరిగేటెడ్‌ డ్రై) నిర్ణీత విస్తీర్ణంలో పండించాలని ప్రతి ప్రాజెక్టు రిపోర్టులలోనూ ఉంటుంది. కానీ కాల్వల్లో నీరు వస్తుంటే అప్పటిదాకా అదే భూమిలో మెట్ట పంటలు పండించిన రైతులు కూడా ప్రభుత్వ ఆదేశాలను, వారి సంప్రదాయాన్ని పక్కనబెట్టి వరి, చెరువు వంటి మాగాణి పంటలను పండిస్తున్నారు. కాల్వ చివరి ఆయకట్టుకు నీరు పారకపోవడానికి ఇదొక ముఖ్య కారణం.

1980వ దశకంలో ప్రపంచబ్యాంకు వివిధ దేశాల్లోని నీటి పారుదల ప్రాజెక్టులపై సర్వే నిర్వహించింది. ‘డ్యాం’ల నిర్మాణంలో భారతదేశం అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉంది. కానీ సమర్థవంతంగా నీటిని వినియోగించుకోవడంలో ప్రపంచంలోని చాలా చిన్నదేశాల కన్న కూడా వెనుకబడి ఉంది. ప్రాజెక్టు నీటి వినియోగ సామర్థ్యంలో కనీసం మూడోవంతు ఆయకట్టుకు కూడా నీరందించలేకపోతున్నామని, పనితీరు మెరుగుపర్చుకోవడానికి ‘భూమి మరియు నీటి నిర్వహణా సంస్థ’లను ప్రారంభించాలని, అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 16 రాష్ర్టాలలో ఈ సంస్థలు ఏర్పడినవి. మన రాష్ట్రంలో అలా ఆవిర్భవించిందే ‘వాలంతరి (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) రాజేంద్రనగర్‌లో ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హిమాయత్‌సాగర్‌ కింద నెలకొల్పిన ‘ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ’కి చెందిన సుమారు 440 ఎకరాలలో నుంచి 237 ఎకరాలను ‘వాలంతరి’కి కేటాయించింది. ప్రభుత్వం (సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల కేవలం 46 ఎకరాలను మాత్రమే వాలంతరి ఉపయోగించుకుంటున్నది).

‘ఆంధ్రులది ఆరంభ శూరత్వమనే నానుడికి ‘వాలంతరి చక్కగా సరిపోతుంది. ఆరంభంలో దేశంలోనే అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబర్చిన వాలంతరి ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ అధికారుల మన్ననలు పొంది ఇతర ‘వాల్మి’ (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి లక్ష్యాలను గాలికివదిలి కేవలం ట్రైనింగ్‌ సంస్థగా మిగిలింది వాలంతరి. ఈ సంస్థ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. 

జల వనరుల శాఖ పునర్నిర్మాణంలో భాగంగా ‘వాలంతరి’కి పూర్వ వైభవం తేవాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది సంస్థ యాజమాన్యం. జల వనరుల రంగంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సమర్థవంతంగా ప్రతి నీటి బొట్టును సాగు కోసం వినియోగించడం. గతంలో నాగార్జునసాగర్‌ నీటి వినియోగ సామర్థ్యాన్ని (వాటర్‌ యూజ్‌ ఎఫీషియెన్సీ) అంచనా వేయగా కేవలం 32-33 శాతానికి మించి లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ఇటీవల ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌.ఎల్‌.బి.సి. ప్రాజెక్టు నీటి వినియోగ ఎఫీషియెన్సీని వాలంతరి అంచనా వేయగా మూడో వంతు ఆయకట్టుకు కూడా నీరందడం లేదని తేటతెల్లమైంది.

నీటి పారుదలశాఖ ఇంజినీర్లకు, ఆయకట్టు రైతులకు మధ్య సత్సబంధాలుంటే సాగునీటి సమస్యలను సులభంగానే పరిష్కరించవచ్చునని విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ సానా మారుతి నిజాంసాగర్‌లో నిరూపించారు. అర్ధరాత్రి దాకా పంట కాల్వలపై పర్యటిస్తూ చివరి ఆయకట్టు దాకా పొలాలకు నీటిని ‘వార బందీ’ పద్ధతిలో నీరిస్తూ ఒక్క టీఎంసీతో 16 వేల ఎకరాల్లో వరి, చెరుకు పంటల పండించడంలో దేశంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు సానా మారుతి. ఆయన అనుభవాన్ని అధ్యయనం చేసిన ‘వాలంతరి’ శిక్షణ పొందుతున్న ఇంజినీర్లకు తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు ఎలా పండించాలో మెళకువలను బోధిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కింది ఆయకట్టులో ఒక్క టీఎంసీతో 12 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.

కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా రైతులకు లభించే నీరు ఎంతో ప్రియమైనది. వివిధ దశల్లో వందలాది మెగావాట్ల విద్యుత్తును వెచ్చిస్తే గానీ ఈ నీరు పొలాలకు చేరదు. ఒక్కో నీటి బొట్టు ఎంతో విలువైనది. ఎంతో నైపుణ్యంతో నీటిని వినియోగించేలా రైతులకు, ఇంజినీర్లకు శిక్షణనిస్తున్నది వాలంతరి. కాల్వల్లో ప్రవాహ నష్టాలను అరికట్టడానికి కాళేశ్వరం-21 ప్యాకేజీలో పైపుల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్‌ సంకల్పించారు. దీనివల్ల ఒక్క టీఎంసీతో 17,500 ఎకరాల్లో పంటలు పండుతాయి. కేసీఆర్‌ సారథ్యంలో నీటి వినియోగంలో నూతనాధ్యాయాన్ని ఆవిష్కరించబోతున్నది తెలంగాణ. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రైతులకు, సాగునీటిశాఖ ఇంజినీర్లకు శిక్షణనివ్వడానికి ముస్తాబవుతున్నది తెలంగాణ ‘వాలంతరి’.

(వ్యాసకర్త: వి.ప్రకాశ్‌, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌)


logo