శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Sep 11, 2020 , 00:16:58

సంచార జాతుల సంబురాలు

సంచార జాతుల సంబురాలు

తెలంగాణ సమాజం ఒక పరిణామక్రమంలో ఉన్నది. ఉన్నవాటిని సరిచేసుకుంటూ కొత్తవాటిని నిర్మించుకుంటూ తెలంగాణ తనకు తాను నిర్మితమవుతున్న దశలో ప్రతి అడుగు ఒక గెలుపే. ప్రతి అభివృద్ధిపని ఒక మలుపే. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోని సంచారజాతులను వారి మూగవేదనలను తెలంగాణ ప్రభుత్వం విన్నది వారి సమస్యలను పరిష్కరించడానికి, వారి జీవన స్థితిగతులను అధ్యయనంచేసి అందుకు పరిష్కారమార్గాలను చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలంచారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటగా సంచారజాతుల స్థితిగతుల అధ్యయనానికి బీసీ కమిషన్‌ను నియమించి ఆ పనిని కమిషన్‌కు అప్పగించి మార్గనిర్దేశం చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లిన బీసీ కమిషన్‌ అనేక విషయాలను తెలుసుకొని సంచారజాతుల, కులాల స్థితిగతులను రికార్డు చేసింది. ఈ పనికి మమ్మల్ని పురమాయించింది కేసీఆరే. సమాజానికి దూరంగా విసిరివేయబడి తరతరాలుగా న్యూనతకు గురైనవారి జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలన్న తలంపునకు అనుగుణంగానే వారి జీవితాలను అధ్యయనం చేసి నివేదికను అందజేయడం జరిగింది. బీసీ కమిషన్‌ ఇచ్చిన నివేదికను, సిఫారసులను పరిశీలించిన రాష్ట్ర క్యాబినెట్‌ అందుకు ఆమోదముద్ర వేసి 17 సంచారకులాలను బీసీ జాబితాలోకి చేర్చుతూ తీర్మానం చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒకరకంగా కేసీఆర్‌ చేసిన సాహసం. ఇది తెలంగాణలోని అట్టడుగున పడి ఉన్న అత్యంత వెనుకబడిన 17 కులాలకు సంబంధించిన ఒక చారిత్రాత్మకమైన తీర్మానం. ఇవి సంచారజాతులకు, సంచారకులాలకు పండుగరోజులు. ఈ పనిచేయించి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసి కేసీఆర్‌ ధన్యుడిగా నిలిచిపోతారు. ఎన్నెన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ పేద సంచారజాతుల హృదయాల పరవశాలు వర్ణించలేనివి. ఇప్పుడు బీసీ కులాల జాబితాలోకి చేర్చుకున్న తర్వాత ఆ నోరు లేని సంచారజాతులవారు అన్ని ప్రభుత్వ రంగాలలో ప్రధానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో హక్కుదారులు కాబోతున్నారు. రోడ్డు వెంట ఫుట్‌పాత్‌లపైనే జీవనం సాగిస్తూ ఆ గుడారాలే తమ నివాసాలుగా భావిస్తున్న బైల్‌కమ్మరుల పిల్లలు తెలంగాణ 33 జిల్లాలలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందగులుగుతారు. తమ పిల్లలను గురుకులాల్లోకి పంపగలుగుతారు. ప్రభుత్వపరంగా బీసీకులాలకు అందాల్సిన అన్ని ప్రభుత్వ పథకాలలో ఈ 17 సంచారకులాలు, సంచారజాతుల వారు హక్కులదారులు కావటం, వాటాదారులు కావటం చారిత్రాత్మకమైనది ఇప్పటిదాకా ఈ సంచారకులాలను గతకాలం విస్మరించింది నిజం. వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి వాళ్లను గుర్తించి నిర్ణయం తీసుకుంది మాత్రం     కేసీఆర్‌ ధైర్యం.

సంఖ్యారీత్యా చూసినా ఈ 17 సంచారజాతుల వాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. కొన్ని కులాలవాళ్లు కొన్ని ఊళ్లకే పరిమితమయ్యారు. కొన్ని కులాలవాళ్లు ఒకటిరెండు జిల్లాల్లో మాత్రమే ఉన్నారు. వీళ్లను గుర్తించి బీసీల్లో చేర్చడాన్ని మొత్తం తెలంగాణ సమాజం హర్షిస్తుంది. దీన్ని ఏ కులసంఘాలు వ్యతిరేకించటం లేదు. తెలంగాణ సమాజం మానవీయ సమాజం.

బీసీ (ఈ) గ్రూపులో ముస్లింలకు 12 శాతం విద్య, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. బీసీ సమాజంలోని అన్ని కులాలకు సమన్యాయం జరుగాలని, అందుకోసం తెలంగాణ సమాజంలో బీసీ జనాభా రీత్యా వాళ్లెంతమంది ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్‌ గట్టిగా చెప్పారు. కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తమిళనాడు రాష్ట్రం 69 శాతం రిజర్వేషన్లు పొందినట్లుగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని కేసీఆర్‌ అసెంబ్లీలోనే తీర్మానించి కేంద్రానికి పంపటం జరిగింది. దీనిపైన తుది నిర్ణయం కేంద్రం చేయాలి. నాలుగున్నరకోట్ల మందిలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కులను కాపాడేందుకు పార్లమెంటులో కేంద్రమే స్పష్టమైన తీర్మానం చేసి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు తెలంగాణకు అందించాలి.  ఈ కోణం లో తెలంగాణ సమాజం మరో లక్ష్యం చేరేందుకు ముందుకుసాగవలసి ఉంది. 17 సంచార కులాలను బీసీ కులాల్లో చేర్చటం తెలంగాణ సమాజం విజయంగానే భావించాలి.


logo