సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Sep 10, 2020 , 00:25:27

..పారామిలటరీ దళాలు

..పారామిలటరీ దళాలు

ఏడో అధ్యాయం కొనసాగింపు..

అటార్నీ జనరల్‌ మిలాన్‌ బెనర్జీ కేంద్ర ప్రభుత్వం వివాదంలో ఉన్న కట్టడపు భద్రతను గూర్చి చెపుతూ... మతపరమైన కల్లోలాల్ని సృష్టించేందుకు కృషి జరుగుతున్నదని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. పరిస్థితి ఏ క్షణంలో ఏమైనా జరిగే స్థితికి చేరుకున్నదని తెలియజేస్తూ అటువంటి స్థితి విషమించి విరుచుకుపడటం జరిగితే అది పూర్తిగా చికాకు కల్గించేదిగా, మనకు ఊహకు అందనిదిగా తయారవుతుందని ఆయన హెచ్చరించారు.

అయోధ్యకు పారామిలటరీ దళాలను కేంద్రం తరలించటానికి రాష్ట్ర ప్రభు త్వ అభ్యంతరాలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ రాసిన రెండు జాబులను అటార్నీ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. అటువంటి వైఖరి రాజ్యాంగపు ఫెడరల్‌ వ్యవస్థ వ్యవహారశైలికే విరుద్ధమని ఆయన అన్నారు. ఐదు మాసాల క్రితం కోర్టు ఆదేశాలను పాటించటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలియజేస్తూ అప్పటి కొన్ని హింసాత్మక ఘటనలను ఉదహరించారు. ఈ వ్యవహారంలో వాదుల తరపు న్యాయవాదులు ఓపీ శర్మ గోవింద ముఖోటీ, ఆర్‌కే గార్గ్‌లు వార్తా పత్రికలలోని వార్తలను ఉటం కిస్తూ బీజేపీ దాని మిత్రవర్గాలు కలిసి డిసెంబర్‌ 6 నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృతనిశ్చయులై ఉన్నారని తెలియజేయగా కేకే వేణుగో పాల్‌ మాత్రం దానిని ఖండించేందుకు పూనుకున్నారు. అంతా కోర్టుకు ప్రతికూ లాభిప్రాయం కలుగజేసేవిధంగా వాళ్లకు అనుకూలంగా వార్తల్ని ప్రచురించే పత్రికలలో వచ్చిన వార్తల్ని మాత్రమే వాళ్లు కోర్టుకు నివేధిస్తున్నారన్నారు. ఆ వాదన అంతా కూడా బాగా ప్రచారాన్ని పొందే వ్యవహారంగా ఉందనేది  ఆయన వాదన. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ లబ్ధి పొందజూస్తున్నదని ఆయన అభియోగం. అయితే జస్టిస్‌ వెంకటాచలయ్య వార్తా పత్రికలలోని వార్తల ఆధారంగా నిజస్థితిని తెలుసుకోవటం కష్టమంటూ వాటిని పరిగణనలోనికి తీసుకొనలే దు. అయోధ్యలోని పరిణామాలు కోర్టు పరిశీలకుని ద్వారా తెలుసుకోవలసి ఉందన్నారు. అవసరమైతే పరిశీలకుని నివేదిక ఆధారంగా కోర్టు తగిన ఆదేశా లను జారీచేస్తుందన్నారు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo