సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Sep 09, 2020 , 00:11:57

భారత్‌కు మరో రక్షాకవచం

భారత్‌కు మరో రక్షాకవచం

భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) మరో ఘన విజయాన్ని సాధించింది. ధ్వనిని తలదన్ని క్షిపణుల వేగాన్ని ఆరురెట్లు ఎక్కువ చేసే స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. హైపర్‌ సానిక్‌ టెక్నాలజీ రంగంలో 15 ఏండ్లుగా చేస్తున్న కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశలో ముందడుగు వేసినట్లయ్యింది. ఇప్పటిదాకా ఈ టెక్నాలజీ రష్యా, అమెరికా, చైనా దేశాల దగ్గరే ఉండటంతో రక్షణ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ఆ దేశాలు ముందంజలో ఉన్నాయి. నేడు భారత్‌ కూడా ఆ దేశాల సరసన సగర్వంగా నిలువటం హర్షణీయం.

హైపర్‌సానిక్‌ టెక్నాలజీ క్లబ్‌లో చేరికకు భారత్‌ గత పదిహేనేండ్లుగా నిర్విరామంగా కృషిచేస్తున్నది. ఇజ్రాయెల్‌, రష్యా సాయంతో 2004లోనే హైపర్‌సానిక్‌ టెస్ట్‌ డెమాన్‌స్ట్రేషన్‌ వెహికిల్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)కి రూపకల్పన చేశారు. మొదటి దశలో భాగంగా బెంగళూరులోని నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబోరేటరీలో విండ్‌ టన్నెల్‌ ప్రయోగం నిర్వహించారు. హైదరాబాద్‌లోని మిసైల్‌ కాంప్లెక్స్‌లో 400 కోట్లతో హైపర్‌సానిక్‌ టన్నెల్‌ను ప్రారంభిస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. మన రక్షణ రంగ నిపుణులు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఒడిశా బాలాసోర్‌లోని ఏపీజే అబ్దుల్‌ కలాం టెస్టింగ్‌ రేంజ్‌ (వీలర్‌ దీవి) నుంచి విజయవంతంగా పరీక్షించి చారిత్రక విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం క్షిపణుల్లో వాడుతున్న రామ్‌జెట్‌ సాంకేతికతకు బదులుగా స్క్రామ్‌జెట్‌ పరిజ్ఞానం అందుబాటులోకి రావటం విశేషం. రామ్‌జెట్‌ ఇంజిన్‌తో మ్యాక్‌-3 వేగం మాత్రమే సాధ్యం. స్క్రామ్‌జెట్‌ సాంకేతికత కారణంగా మ్యాక్‌-6 సాధించటం విప్లవాత్మకం.

హైపర్‌ సానిక్‌ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలున్నాయి. సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో స్క్రామ్‌జెట్‌ రెప్పపాటులో సుదూర లక్ష్యాలకు చేరుతుంది. శత్రుదేశ రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా క్షిపణులను మోసుకెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధిస్తుంది. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. రాకెట్లలో వాడే టర్బొజెట్ల అవసరం ఉండదు కాబట్టి వీటి తయారీ కూడా సులువు. ఇకముందు అంతరిక్ష పరిశోధనలు, కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ప్రయోగాలు కూడా సులభం కానుండటంతో బహుళ ప్రయోజనాలు నెరవేరుతాయి. దేశాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతున్న వేళ అత్యాధునిక రక్షణ రంగ సాంకేతికతలకు ప్రాధాన్యం ఏర్పడింది. పొరుగుదేశాలతో భారత్‌ సరిహద్దు సమస్యలు తీవ్రమవటమే కాదు, ఉద్రిక్తతలు నెలకొంటున్న సందర్భంలో హెచ్‌ఎస్‌టీడీవీ స్క్రామ్‌జెట్‌ పరీక్ష సఫలం కావటం కొండంత బలాన్నీ, ఆత్మైస్థెర్యాన్ని పెంచింది. దీనికి హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న డీఆర్‌డీవో వేదిక కావటం రాష్ర్టానికీ, దేశానికీ గర్వకారణం.


logo