సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Sep 09, 2020 , 00:11:55

రైతన్న భూమికి భరోసా

రైతన్న భూమికి భరోసా

‘తెలంగాణలో భూ సంబంధమైన కిరికిరి ఒక్కటి కూడా లేకుండా చూస్తాం. అతిత్వరలోనే అద్భుతమైన చట్టం తేబోతున్నాం. ఒక్క ఎకరం కూడా భూ వివాద ఇబ్బంది లేకుండా చూసే జిమ్మెదారి నాది. రెవెన్యూ శాఖ పేరును సైతం మారుస్తాం. విప్లవాత్మకమైన కంక్లూజివ్‌ రెవెన్యూ చట్టం తరహాలో చట్టం తీసుకువస్తాం. రెవెన్యూ శాఖ అనడమే బేఖార్‌ ముచ్చట. ఇప్పుడు శిస్తు వసూలే లేదు. ఇక రెవెన్యూ శాఖ అనడం అర్థరహితం..’ అని గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ఆయన మరోసారి తన మాట నిలబెట్టుకోబోతున్నారు. తరతరాలుగా రాష్ట్రంలోని దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ,భూ దస్తావేజుల విషయంలో ఎదుర్కొన్న సమస్యలకు నేటితో చరమగీతం పాడబోతున్నారు.

తెలంగాణ చరిత్రలో ఇదో చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోనున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందన్నవారి నోళ్లను మరోసారి మూయించే రీతిలో, ప్రజల కష్టాలను తీర్చి, పారదర్శకత పాలనకు పెద్దపీట వేసే చట్టం ఈ రోజు తెలంగాణ శాసనసభ సాక్షిగా మన ముందుకు రాబోతున్నది. 

రాష్ట్ర పాలనలో అత్యంత కీలకంగా రెవెన్యూ చట్టం రూపాంతరం చెందనున్నదనడంలో సందే హం లేదు. యావత్‌ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించ బోతున్న రెవెన్యూ చట్టం నమునాపై అంతటా ఆసక్తి నెలకొన్నది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా కంక్లూజివ్‌ టైటిల్‌ చట్టం తరహాలో చట్టం తీసుకురాలేదు. కేవలం రైతులు, భూ యజమానులను తాత్కాలిక సంతృప్తిపరిచే రెవెన్యూ చట్టాలే ఇప్పటివరకు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రెవెన్యూ సంస్కరణను తెలంగాణ అందించబోతున్నది. ఇప్పటిదాకా దేశంలో భూ రికార్డులన్నీ ప్రిజంటీవ్‌ టైటిల్స్‌ మాత్రమే. పైగా రికార్డులన్నీ ఒకే దగ్గర ఉండవు. రెవెన్యూశాఖలో ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌), మ్యుటేషన్లకు సంబంధించిన దస్ర్తాలుంటే.. రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, ఎన్‌కంబరెన్స్‌; సర్వే సెటిల్‌మెంట్‌ శాఖలో ఆస్తులకు సంబంధించిన నక్షాలు, మ్యాప్‌లు; మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో నివాసయోగ్యమైన ఇండ్లు, ప్లాట్ల వివరాలుండేవి. వీటితోపాటు వక్ఫ్‌, అర్బన్‌లాండ్‌ సీలింగ్‌, భూదాన్‌బోర్డు, అటవీశాఖ, దేవాదాయ శాఖల వద్ద కూడా భూములకు సంబంధించిన దస్ర్తాలున్నాయి. చాలా సందర్భాల్లో ఈ విభాగాల మధ్య సమన్వ య లోపం దళారులకు ఉపయోగపడేలా, నిజమైన హక్కుదారులకు శాపంగా పరిణమించేది. 

వేధింపులకు ఇక చెల్లుచీటే: రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక 2019 ఏప్రిల్‌లో భూ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నవారికి చేయూతను అందించేందుకు, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నించింది. తొలుత ఒకట్రెండు రోజులు భూ సమస్యలపై వార్తలను అందించింది. అసలు దీని అంతూ ఆది తెలుసుకుందామని 2019 ఏప్రిల్‌ నుంచి వరుసగా బాధితులతో మాట్లాడు తూ కథనాలు ఇచ్చింది. ‘ధర్మగంట’ పేరుతో ఏడాదికిపైగా ప్రతిరోజూ కథనాలు రావడం అనూ హ్యం. ప్రతిరోజూ ‘నమస్తే తెలంగాణ’ కార్యాల యం ముందు ఉదయం ఆరుగంటల నుంచి అర్ధరాత్రి వరకు రైతులు బారులు తీరారు. వేల మంది కన్నీటి వ్యథలు రికార్డయ్యాయి. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగులను వాడుకొని అక్రమార్కులు పేద రైతులను వేపుకుతింటున్న తీరు ప్రజల దృష్టికి వచ్చింది. 

వ్యవస్థలోని అందరు దుర్మార్గులని అనలేం. అంతటా అన్ని రకాల వాళ్ళుంటారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడేడటం,వాళ్లు, ప్రజలను ఇబ్బందులపాలు చేయ టానికి అవకాశం ఎక్కువ. లేని భూ సమస్యను సృష్టించి వాళ్లే దళారుల అవతారం ఎత్తి దాని పరిష్కారానికి పీడించే రెవెన్యూ సిబ్బంది ఉదంతాలు తెలిసిందే. ‘నమస్తే తెలంగాణ’ ఈ సమస్యను చేపట్టేసరికి ప్రజల నుంచి విపరీత స్పందన వచ్చింది. ప్రధాన పత్రికలో కథనాలు ఇవ్వడం సరిపోవడం లేదని, ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ లీలలపై ధర్మగంట పేరుతో కథనాలు కొనసాగాయి. ప్రభుత్వం కూడా ధర్మగంట కథనాలపై స్పందించి బాధితులకు న్యాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే, ఇది ఏమాత్రం సరిపోలేదని, రెవెన్యూ ప్రక్షాళనే మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించినట్టున్నారు. అందుకే ఇక కీలెరిగి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనడంలో సందేహం లేదు. 

సుపరిపాలనకు సరైన మార్గం: వాస్తవానికి టైటిల్‌ గ్యారెంటీపై మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు డీసీ వాద్వా కమిటీ వేశారు. ముసాయిదా సిద్ధమైన తర్వాత పార్లమెంట్‌లో పెట్టలేదు. దేశంలో 1980 నుంచి భూ రికార్డుల ఆధునీకరణ చేపట్టారు. దీంట్లో అనేక లోపాలున్నాయి. తర్వాత ప్రయోగాత్మకంగా 2005-06లో ‘భూ భారతి’ ప్రాజెక్టు చేపట్టారు. ఇవన్నీ తుది దశకు చేరకుండానే అటకెక్కాయి. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే సంపూర్ణ భూ రికార్డుల ప్రక్షాళనను కేవలం వంద రోజుల్లో పూర్తిచేసిన ఘనత కూడా కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. భూపరిపాలన బాగుంటేనే పెట్టుబుడులు వస్తాయి. ఇక దేశంలో జరుగుతున్న నేరాల్లో 60 శాతం భూసంబంధమైనవేనని,  హత్యల్లో 14 శాతం భూసంబంధమైనవేనని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో చెప్తున్నది. సివిల్‌ కేసుల్లో 66 శాతం భూవివాదాలకు సంబంధించినవే. కొత్త చట్టంతో ఇలాంటివన్నీ ఖచ్చితంగా దూరమవు తాయి. సీఎం కేసీఆర్‌కు పట్టువదలని విక్రమార్కుడన్న పేరున్నది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చారు. దీనికి కేబినెట్‌ ఆమోదముద్రపడింది. ఇక నేడు శాసనసభ వేదికగా ప్రజల ముందుకు రానున్న ది. ముమ్మాటికి ఇది తెలంగాణ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖిస్తూ, దేశానికి ఒక కొత్త మార్గా న్ని చూపుతుందనటంలో సందే హం లేదు.  


logo