శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Sep 09, 2020 , 00:12:19

వాడుక భాష జీవధాతువు

వాడుక భాష జీవధాతువు

తెలంగాణ వాడుక భాషను నా గొడవలో తన భాషగా మాత్రమే కాకుండా ప్రజల భాషగా మలచి గర్వంగా తలెత్తుకొని నిలిచేలా చేసినవాడు, ప్రజల భాషను బతికించిన మహనీయుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని పరభాష వ్యామోహంతో పడిపోతున్న తెలుగువారిని నాడే ప్రశ్నించారు. అవసరానికి అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మన మాతృభాష తప్పకుండా నేర్చుకో అని అన్నారు. మనం మాట్లాడుకునే భాషలో రాయడం చాలా సులువు. అలా అయితే భావం చెడిపోకుండా మనం అనుకున్న విషయాలు అందులో రాయగలుగుతారు. లేకపోతే మనం అన్య భాష మోజులో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే అసలైన అర్థం చెడిపోతుందన్నారు.

న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న కాళోజీ 1958లో హైకోర్టుకు పోయినప్పుడు జరిగిన ఘటన ఒకటి ఆసక్తిదాయకం. కాళోజీ ఆంధ్ర న్యాయవాదుల పక్కనుంచి నడుస్తుంటే ‘ఈ మధ్య తెలంగాణ న్యాయవాదులు కూడా తెలుగు భాష నేర్చుకుంటున్నారు. వాళ్లు మామూలు తెలుగు మాట్లాడుతున్నారు. పర్వాలేదు’ అని ఒక ఆంధ్ర న్యాయవాది అన్నారు. ఆ మాట వింటూనే కాళోజీకి చాలా కోపం వచ్చింది. నిగ్రహించుకొని వెనక్కి తిరిగివచ్చి చెప్పిండు- ‘మీరు మమ్మల్ని వెక్కిరించే మీ తెలుగులో ‘మామూలు’, ‘పరవాలేదు’ ఉర్దూ పదాలే తెలుసా అన్నారు. అలాగే మీరు దరఖాస్తు చేశాము అంటారు. అది కూడా ఉర్దూ పదమే అని చెప్పారు. తెలంగాణలోనే కాదు అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయని వివరించారు. అప్పుడు ఆశ్చర్యపోవడం ఆంధ్ర వకీలు వంతయింది. ఇది మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు వేలు ఉంటాయి. 

ఇక వాడుక భాష గురించి కాళోజీ మాటల్లో చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. గ్రాంథికభాష కేవలం పుస్తకాల్లో మాత్రమే కనబడుతుంది. కానీ వాడుకభాష మనిషి రక్తంలో కలిసిపోయి ఉంటుందంటారు కాళోజీ. గ్రాంథిక భాషకు నిఘంటువులలో అర్థాలు దొరుకుతాయి. వాడుక భాషకు నిఘంటువులో అర్థాలు దొరకవు. కానీ వాడుక భాష మన అమ్మ భాష. జీవితంలో ఆ భాష అర్థం అవుతుంది. గ్రాంథిక భాష నేర్చుకోవడానికి కష్టపడాలి. అవసరమైతే కంఠస్థం చేయాలి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మొదలుకొని విశ్వనాథ సత్యనారాయణ వరకు, బిరుదురాజు  రామరాజు తదితర ప్రముఖులందరికీ గ్రాంథిక భాష ఉగ్గుపాలతో రాలేదు. నేర్చుకుంటేనే వచ్చింది. తెలుగు అకాడమీ ఏర్పడినాక వాడుక భాష మీద మరికొంత కృషి జరిగింది. నాడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో వాడుక భాషతో కొన్ని వాచకాలు తయారుచేద్దామని ప్రతిపాదన చేశారు. కానీ ఎవరి భాష ఎవరి వాడుక భాష పుస్తకాలు పెడతారు అని నాడే కాళోజీ ప్రశ్నించారు. కృష్ణా గుంటూరు జిల్లాల భాషను వాడుక భాషగా తీసుకుంటే వరంగల్‌ పోరడికి ఎలా అర్థమవుతుం దన్నారు. నాటి పత్రిక భాష టీవీ సినిమాలలో మాట్లాడే భాష కేవలం ఆ రెండున్నర జిల్లాల భాష అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భాషా సంస్కృతులను వెక్కిరించే వారిమీద తన రచనలతో దాడి చేశారు. నిష్కర్షగా అలాంటివారిని విమర్శించారు. నిజమైన భాషను బతికించే ప్రాణనాడులు మాండలికాలు మాత్రమే అని కాళోజీ అంటాడు. భాషాశాస్త్ర ప్రకారం చూస్తే ఏ భాషకైనా జీవ ధాతువు మాండలికమే. మాండలికంలో తేడాలు యాసల వ్యత్యాసాలు ఉండటమే భాషకు జీవలక్షణం. ఈ సంగతి మనం మరచిపోయి కొన్ని మాండలికాలను కొన్ని యాసలను తొక్కివేస్తున్నాం. వెక్కిరిస్తున్నాం. దానితో భాష మొస మరలకుండా ఊపిరి వదిలే పెడతది అన్నాడు కాళోజీ.

తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా మరొకసారి కాళోజీ భాష అభిమానాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు మన తెలుగు భాషను సంస్కృతిని ముఖ్యంగా వాడుక భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం చేయూతనందించి ఇంకా విస్తృతంగా తెలంగాణ భాష పదాలను వెలికితీయాలి. నిఘంటువులు ప్రచురించాలి. రాష్ట్ర పరిపాలనలో తెలుగు భాష ప్రాముఖ్యం గుర్తించాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. మన భాషకు గౌరవం ఇనుమడిస్తేనే కాళోజీకి అసలైన నివాళి అర్పించినట్లవుతుంది.

(నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం)


బండారు రామ్మోహనరావు


logo