శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Sep 09, 2020 , 00:12:18

జగమెరిగిన కాళోజీ

జగమెరిగిన కాళోజీ

జగమెరిగినవాడు కాళోజీ! అయితే జగాన్ని అంటే జనాన్ని ఇంకా బాగా ఎరిగినవాడు కాళోజీ, కాళోజీ శ్వాసా, ధ్యాసా ఒకటే ప్రేమను పంచటం. ప్రశ్నించే వారి కొశ్చన్‌మార్క్‌ కాళోజీ. ఆలోచించేవారి మేధోపార్శ్వం కాళోజీ. దుఃఖించేవారి కన్నీటిచుక్క కాళోజీ. క్రోధపు కన్నులోని ఎర్రజీర కాళోజీ. సముద్ర గంభీరుడు కాదు, కానీ నిరంతర అలల కదలిక కాళోజీ. అలా ఎంతగానో విస్తరించిన సామూహిక బహువచనం కాళోజీ. అంతటి ప్రభావశాలి కొలువైన వరంగల్‌లో ఉద్యోగం చేస్తూ ఓ దశాబ్దం పాటు వారిని సన్నిహితం గా చూసే అవకాశం రావటం ఓ అదృష్టం. వృత్తిపరం గా ఆకాశవాణి స్టూడియోలో, ప్రవృత్తిపరంగా అనేక సభావేదికలపై వ్యాఖ్యాతగా కాళోజీ మూర్తిమత్వాన్ని దర్శించి స్ఫూర్తిపొందాను. ఆయా సందర్భాల్లో నేను విన్న మాటల్లో, ఉన్న సన్నివేశాల్లో కొన్ని వివరించే ప్రయత్నం ఇది.

ఎంత సంక్లిష్టమైన అంశాన్నయినా సరళంగా చెప్పటం కాళోజీకే చేతనవుతుంది. హన్మకొండ సమీపంలోని ఆరెపల్లి గ్రామాన్ని అక్షరపల్లిగా కీర్తిస్తూ సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా అభినందిస్తున్న సందర్భంలోని సభ అది. ఆ సభలో కొందరు వక్తల తర్వాత ముఖ్య అతిథిగా కాళోజీ సందేశం... అక్షరాస్యతకూ అభివృద్ధికీ ఉన్న లంకె గూర్చి ప్రస్తావిస్తూ సాగుతున్న మాటలు. మధ్యన ఓ తూటాలాంటి మాట. ‘మన పల్లెటూళ్ళల్ల బహిర్ధిశకు చెంబు పట్టుకొని పోవుడు అలవాటు. వూరవతలికిపోయి మాటూ చాటూ చూసుకొని బహిర్‌ ప్రదేశంలో పోతుంటారు. ఇది తెలిసి కొందరు మేమే ఆధునికులం, మేమే నాగరికులం అనుకొని అపహాస్యం చేస్తరు విమర్శిస్తరు. విమర్శించెటోళ్లు ఒక చిన్న సంగతి మరచిపోతరు. కుటుంబమంతా తలదాచుకోవటానికి ఇల్లే సరిగ్గా లేనోళ్ళకు మరుగుదొడ్లెక్కడ ఉంటయి? ప్రభుత్వమో, ఈ విమర్శించే పెద్దలో, సలహాలిచ్చే మేధావులో ముందుకువచ్చి ప్రతి ఇంటికీ ఓ పాయిఖానా కట్టించాలె. అప్పుడు ఊరవతలికి చెంబు పట్టుకొని పొమ్మన్నా పోరు వాళ్లకేమన్నా షోకా? సౌకర్యాలు కల్పించితర్వాత అలవాట్ల గూర్చి మాట్లాడాలె సంస్కారం, కల్చర్‌ అంటూ పెద్దపెద్ద మాటలు అప్పుడు చెప్పాలె’ అన్నారు.

ఒక టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథి. అప్పటి చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ యన్‌.విఠల్‌గారు కీలకోపన్యాసకులు. రంగురంగుల విద్యుద్దీపాలతో అట్టహాసంగా అలంకరింపబడిన ఆడిటోరియవ్‌ు, సభాస్థలిలో ఎందరో టెక్నోకార్ట్‌లు, ఫ్యాకల్టీ, విద్యార్థులు. కాళోజీ జ్యోతి వెలిగించి సభను ప్రారంభం చేశారు. తర్వాత వారి సందేశ సమయంలో పలికిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ‘బాగా చదువుకున్న విద్యార్థులనుద్దేశించి నాలాం టి సామాన్యుడు ఏం మాట్లాడతాడు? అయినా పిలిచినప్పుడు ఏదో ఒకటి చెప్పుడు బాధ్యత కదా నాకు తోచింది చెప్త. ఈ హాలునిండా రంగురంగుల కరంటు దీపాలు పెట్టిండ్రు వేదిక మీదనేమో నన్నీ దీపం వెలిగించమన్నరు. కరంటు పోయిందనుకోఇంత జిగేల్‌మనే వెలుగులు ఆరిపోతాయి ఈ చిన్నదీపం మిగులుతది. మీరందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు పెద్ద నౌకర్లే రావచ్చు సుఖాలూ, ఆడంబరాలకు కొదువ ఉండకపోవచ్చు. అయితే ఆ అట్టహాసాలన్నీ ఈ విద్యుత్‌ వెలుగుల వంటివి. సమాజం పట్ల మీ ప్రేమ, బాధ్యత, పట్టించుకునే తత్త్వం.. ఈ దీపం వంటిది. ఎన్ని వెలుగుల ప్రవాహాలు ఉన్నా ఈ మంచితనం అనే దీపం ఆరిపోకుండా చూసుకోవాలె. చదువుల సారం అంతా అదే’ అని చెప్పారు.

కాళోజీ అగ్రజులు ‘షాద్‌' రామేశ్వరరావు స్వర్గస్థులయ్యాక  గద్గదస్వరంలో కాళోజీ మాట విన్నవాళ్ళ కళ్ళకూ నీళ్ళు తెప్పించింది. ‘ఒక మంచం ఖాళీ అయింది’ అన్న ఒక వాక్యం వెనక ఎంత బరువైన గుండె ఏదో అనిపించింది. ఒక సుదీర్ఘ ప్రజాజీవితంలో, అలుపెరుగని సాహిత్య ప్రయాణంలో నిరంతర చైతన్య పథికుడైన కాళోజీ జీవితంలో ఇలాటి సందర్భాలు, సన్నివేశాలు ఎన్నో, ఎన్నెన్నో.  నాగిళ్ల రామశాస్త్రి, పి.ఆర్‌.విద్యార్థి, తెలంగాణ ప్రభాకర్‌ వంటివారిని, ఇంకా మిత్రమండలిని, కాళోజీ దోస్తులను కదిలిస్తే జాలువారే ముచ్చట్లు కాళోజీ మెన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ముద్రింపబడిన పుస్తకాల్లో ఎన్ని జ్ఞాపకాలున్నాయో, కాళోజీ అసంఖ్యాక అభిమానుల హృదయాల్లో అన్ని జ్ఞాపకాల ముద్రలూ ఉన్నా యి. కాళోజీ తన కవితలో చెప్పాడు ‘అతిథి వోలె వుండి వుండి అవని విడిచి వెళతాను’ అని కానీ అవని విడిచివెళ్లినా కాళోజీ ఆత్మీయస్పర్శ అందరి గుండెల్లో అంతే వెచ్చగా ఉంది.

మడిపల్లి దక్షిణామూర్తి


logo