శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Sep 08, 2020 , 00:17:27

ఇదీ తెలంగాణ!

ఇదీ తెలంగాణ!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేండ్ల కాలంలోనే అన్నిరంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థికరంగాల ప్రగతి సూచికల్లో దేశంలోనే అగ్రభాగాన నిలుస్తున్నది. ఆరేడు దశాబ్దాల చరిత్ర కలిగిన రాష్ర్టాలను సైతం తలదన్ని అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం పురోగతి రేటును నమోదు చేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా చెప్పుకొంటున్న కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ర్టాల అభివృద్ధిని అధిగమించి అన్నిరంగాల్లో పోటీపడుతున్నది. అభివృద్ధి సూచీలోనూ, ఉత్పాదకతలోనూ, ఉద్యోగ కల్పనలోనూ అంచనాలకు మించి అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలువటం ముదావహం.

 రాష్ట్రసాధన ఉద్యమ సందర్భంలోనూ, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనూ చిన్న రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించలేదనీ, రాజకీయంగా అస్థిరతతో మనుగడ కష్టమనే వాదనలు వినిపించాయి.  తెలంగాణ భవితవ్యంపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా సిద్ధాంత రాద్ధాంతాలు చేశారు. అవన్నీ తెలంగాణ వ్యతిరేకుల కుయుక్తులని తేటతెల్లమయ్యాయి. ఉద్యమపార్టీ అధికారంలోకి రావడమే కాదు, స్వీయపాలనలో ప్రజల ఆత్మగౌరవమే ప్రతీకగా రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథాన నడిపిస్తున్నది. అభివృద్ధికీ, సుపరిపాలనకూ చిన్న రాష్ట్రమే మార్గదర్శకమని చాటుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ స్థిరత్వంతో సంక్షేమ పాలన అందిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా తెలంగాణ సమాజం పరుగులు తీస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వ్యక్తమయిన అనుమానాలను పటాపంచలు చేస్తూ.. నవ్విన నాపచేను విరగకాసిందన్నట్లు తెలంగాణ నేడు అన్నింటా ఆదర్శంగా నిలువటం గమనార్హం.

ఏ ప్రాంతమైనా, రాష్ట్రమైనా సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే మౌలిక వసతులు, వనరుల కల్పన కీలకం. ప్రధాన జీవనవృత్తులు వికాసం చెందాలి. అప్పుడే సమస్త జీవన రంగాలు విలసిల్లుతాయి. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం స్వీయపాలన అనుభవాలను రుచిచూపిస్తున్నది. వ్యవసాయరంగంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణంగా సిరులు కురిపిస్తున్నది. గత ఏడాది 6.6 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఇప్పుడు 23.7 శాతంగా నమోదయ్యింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం 95వేలు ఉంటే, ప్రస్తుతం రెండు లక్షల 28వేల పైచిలుకుకు చేరుకున్నది. మౌలిక వసతుల కల్పన, టీఎస్‌ ఐ-పాస్‌ విధానంతో పారిశ్రామిక ప్రగతి కూడా పరుగులు తీస్తున్నది. సులభ వాణిజ్య విధానంతో రాష్ర్టానికి దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13.90లక్షల మందికి ఉద్యోగ కల్పన సాధ్యమైంది. సరైన సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే అసాధ్యాలను సహితం సుసాధ్యం చేయవచ్చనడానికి నేటి తెలంగాణే నిదర్శనం.


logo