శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Sep 07, 2020 , 00:18:50

సన్నగిల్లిన రక్షణ ఏర్పాట్లు

సన్నగిల్లిన రక్షణ ఏర్పాట్లు

ఆయన ఇంకా అన్నదేమంటే- ‘ఒక్కరాత్రిలో మందిరం నిర్మింపబడకపోయినా ఏ మాత్రం నిర్మాణం జరిగినా అలహాబాద్‌ హైకోర్టు టైటి ల్‌ రావాలో ఉన్న స్థితిని కొనసాగించమన్న ఉత్తర్వులను ఉల్లంఘించినట్లే అవుతుంది.’

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌లను వాళ్ల స్వచ్ఛంద సేవకులు లాంఛనప్రాయమైన కరసేవకు మించిన కార్యకలాపాలకు దిగరనే వాంగ్మూలాన్ని సమర్పించాలంటూ సుప్రీంకోర్టును కోరవలసి ఉందని కూడా షాహాబుద్దీన్‌ సలహా ఇచ్చారు. వివాదగ్రస్థమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు కట్టడపు రక్షణ తొలినుంచి కేంద్రం తీవ్రంగా పరిగణించే అంశమయ్యింది. ఆ కట్టడపు భద్రత, రక్షణల హామీని నెరవేర్చాల్చిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ పలుమార్లు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక వేదికల నుంచి ఆ కట్టడాన్ని కాపాడి తీరుతామని ప్రకటించింది. 1991 నవంబరు 2న జరిగిన జాతీయ సమైక్యతామండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆ మేరకు హామీనివ్వటం జరిగింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.

ఇదిలా ఉండగా మరోవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా రామజన్మభూమి-బాబ్రీ మసీదు కాంప్లెక్స్‌లో రక్షణ ఏర్పాట్లు సన్నగిల్లినట్లయ్యింది. అమలులో  ఉన్న పలు రక్షణ చర్యలు క్రమేపీ ఉపసంహరించబడినాయి. ఉదాహరణకు రోడ్ల అవరోధాలు, ఇనుపగొట్టాల అడ్డంకులు తొలగించటం, కాంప్లెక్సులో ప్రవేశించే ముందు నిర్వహించే సోదాలు వంటివి నిలిపివేయటమేగాక పోలీసు కంట్రోల్‌ రూంను కొత్త తావుకు మార్చటం వం టివి అందులో కొన్ని. ఆ కట్టడమూ, సేకరించిన స్థలం చుట్టూ దాదాపుగా దీర్ఘచతురస్రాకారంలో ఒక ప్రహరీ గోడను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ నిపుణుల సంఘం సలహా మేరకు నిర్మించిన రక్షణకుడ్యం అదేనంది. ఆ సంఘం సూచించిన రక్షణ లక్షణాలేవీ ఆ గోడకు లేవు.

ఈ విధమైన పరిణామాల వల్లనూ, ప్రహరీలోకి సోదాలు లేకుండా సందర్శ కులకు ప్రవేశం కల్పించటం వల్లనూ, నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూండ టం వల్లనూ, రకరకాల భవన నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు అక్కడ వున్నందువల్ల వివాదంలో వున్న కట్టడపు రక్షణ విషయంలో చిక్కులేర్పడే అవ కాశం పెరిగింది. స్థలాకృతిలోని మార్పు కారణంగానూ, ప్రమాద సంకేతాల కారణంగానూ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భవన సముదాయ రక్షణ పథకాన్ని తిరిగి సమగ్రంగా సమీక్షించమని హోం మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరింది. ఏర్పాట్లను సమీక్షించే జట్టులో కేంద్ర సంస్థల ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం ఉండేట్లు చూడమని సూచించటం జరిగింది. సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన నిర్దుష్ట మైన సలహాలను కొన్నింటిని అమలుపరచటం జరిగిందనీ, కొన్నింటి అవసరం లేనేలేదని తెలియపరిచింది. కట్టడాన్ని కాపాడటం శాంతి భద్రతల్ని పరిర క్షిం చటం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

1992 నవంబరు 25న, డిసెంబర్‌ 2న వ్రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కట్టడం భద్రత విషయంలో కట్టుబడి ఉన్నట్లుగానూ, ప్రతిపాదిత కరసేవ దృష్ట్యా రక్షణ ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం గావించబడినాయని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించటం జరిగింది. 15  అదనపు పీఏసీ కంపెనీలను నియోగించనున్నందున కేంద్ర దళాల అవసరం లేదని సూచించటం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కట్టడం రక్షణ విషయంలో పట్టించుకుంటూనే ఉంది. 1992 డిసెంబరు 1న హోంమంత్రి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి జాబు వ్రాస్తూ ఆయన దృష్టికి ఈ విషయాలు తెచ్చారు. ప్రతిపాదిత కరసేవ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గైకొన్న భద్రతా చర్యలు సరిపోతాయో లేదోనని, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కరసేవకులు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినా లేక చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకుంటే వాళ్లు హింసకు దిగితే ప్రభుత్వం చేపట్టే అత్యవసర పథకాలు సిద్ధంగా ఉన్నాయో లేదోననే సందేహాలు వెలిబుచ్చటం జరిగింది.

సుప్రీంకోర్టు వాద ప్రతివాదాల్లో కూడా కట్టడపు రక్షణ విషయం చోటు చేసుకుంది. అమలులో ఉన్న భద్రతా చర్యలలోని లోపాలను కేంద్రం ఎత్తి చూపిన విషయాన్ని కోర్టు గమనంలోకి తీసుకొని వాటిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి క్రియాశీలంగా నడుచుకునేట్లు చూడవలసిందిగా వాళ్ల న్యాయ వాదికి చెప్పింది. ఆ సలహాలు అప్పటికప్పుడే కోర్టులో న్యాయవాదికి అందిం చటం జరిగింది. 1992 డిసెంబర్‌ 2న హోంశాఖా మాత్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆ సలహాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు గైకొనగలదనే ఆశాభావాన్ని వెల్లడించటం జరిగింది.

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో శాంతిభద్రతల వ్యవహా రం ఎప్పుడూ ఆందోళనకరంగానే ఉండేది. మతపరమైన ఉద్రిక్తతలను సజీవంగా ఉంచుతూ దేశంలో అనేక ప్రాంతాల్లో మత కల్లోలాలను రెచ్చగొట్టే ఎడతెగని అంశంగా అది ఉంటూ వచ్చింది. శిలాన్యాస్‌ ఉత్సవానికి ముందు 1989లో శిలా పూజలు/ మహా యజ్ఞాల సందర్భంగా దేశమంతటా మతో ద్రేకం అట్టుడికింది- మరీ ముఖ్యంగా బీహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఈ వివాదానికి సంబంధించి 79 మత కల్లోలాల సంఘటనలు 10 రాష్ర్టాల్లో చోటుచేసుకోగా 505 మంది ప్రాణాలు కోల్పోయారు; మరో 768 మంది గాయపడ్డారు. అటువంటి మత పరమైన ఉద్రిక్తతే 1990లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన రథయాత్ర సందర్భంగా బహిర్గతమైంది. శ్రీ యల్‌.కే.అద్వానీని అదుపులోకి తీసుకున్న వెంటనే ఒళ్లు తెలియని మతావేశం పెల్లుబుకింది. ఆ సమయంలో 312 ఘట నలు సంభంవించగా 483 మంది మరణించారు. 2,066 మంది గాయప డ్డారు. అప్పటి నివేదికల ప్రకారం 210 మసీదులు, 35 మందిరాలు ధ్వంసం చేయబడటమో, అపవిత్రం కావించబడటమో జరిగింది. (వివరాలకు అనుబంధం 1 చూడండి.)

ఆ రకమైన మత కలహాలు 1991-92 మధ్యకాలంలో జరగలేదు. అయినా మతపరమైన వాతావరణం అధ్వాన్నంగానే ఉంది.  

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo