గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Sep 07, 2020 , 00:18:58

బతుకునిస్తేనే భాషకు గౌరవం

బతుకునిస్తేనే భాషకు గౌరవం

(1973 ఆగస్ట్‌ 8వ తేదీన తెలుగు అకాడమీ పంచవర్షీయోత్సవంలో నూతన గ్రంథాలను ఆవిష్కరిస్తూ అకాడమీ అధ్యక్షులు పీవీ నరసింహారావు చేసిన ప్రసంగంలో కొంత భాగం)

తెలుగు అకాడమీ అధ్యక్షుడి హోదాలో పీవీ తన ప్రసంగంలో భాషా విధానంలో ఉన్న లోపాలను ఏకరువు పెట్టడమే కాదు, ఈ విధానం విజయవంతం కావడానికి ఏమి చేయాలో వివరించారు. మాతృభాషను అమలు చేయడమనేది దేశమంతా అమలు కావాలని, ఒకటీ రెండు రాష్ర్టాలలోనే చేస్తే విఫలమవుతుందని వివరించారు. మన భాషకు మనం తగిన గౌరవం ఇస్తేనే బోధనా భాషగా వికసిస్తుందని స్పష్టం చేశారు. 

ఈరోజు తెలుగు అకాడమీ ఐదు సంవత్సరాలు సేవ చేసి బాలారిష్టాలన్నింటిని దాటి కాస్త గట్టిగా  నిలిచినందుకు మీ అందరితో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవడానికి నాకిచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన దేశంలో పాలసీ నిర్ణయం చేయటం చాలా సులభం. అంతటితో ఊర్కుంటే చాలా హాయి; కాని ఎవడేనా దౌర్భాగ్యుడు - దానిని అమలు చేద్దామని ఒక అడుగు వేశాడంటే మాత్రం ఇక వాడి తిప్పలు దేవుడికి తెలియాలి. ఈ దేశంలో పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడెవ్వడూ వద్దనడు. తీసుకున్న తర్వాత ఏదన్నా చెయ్యబోతే మాత్రం ఇబ్బందులన్నీ వస్తాయి.  

తెలుగు లేక మాతృభాషను గురించిన అనుభవం గూడ అచ్చంగా ఇదే. జాతీయ విధానం అన్నారు. పోనీ ఈ రాష్ట్రంలో మనమేదో చేశాం - తెలివి తక్కువ పని తక్కినవాళ్లు చేయలేదు, అన్నట్టు కాదు. కేంద్ర ప్రభుత్వం వారే మనందరికి చెప్పిన పాలసీ అది; ప్రతి చోట జరుగాలని చెప్పినటువంటిది రాష్ర్టాలకు తాకీదులు పంపించినటువంటిది. దానిని అమలు చేయటంలో మొట్టమొదటి అడుగుననే అన్నీ అడ్డంకులు వస్తున్నాయంటే -  లోపమెక్కడ అనేది ఆలోచించవలసిన సమస్య.  పాలసీ  నిర్ణయం చేసిన్నాడు సరిగ్గా ఆలోచించలేదా? అదైనా అయుండాలె. లేదా  పాలసీ నిర్ణయం చేసినప్పుడు ఇది అమలు జరిగేదా చచ్చేదా అన్న భావంతోనే చేశాము;  లేదా - మూడవది  పాల సీని సీరియస్‌గా తీసుకున్నవాళ్ళు ఎవరేనా ఉండుండాలె- ఉన్మత్తులు, పిచ్చివాళ్ళు. ఈ మూడు నాలుగు రకాల అవకాశాలు కనబడుతున్నాయి. అన్నీ కలిసి ఉన్నాయేమో ఈ సమస్యలో.  తెలుగులో మనం ఉన్నత విద్య ప్రవేశపెట్టాలన్నారు. పాలసీ రాతలు బాగా రాసేశాం.  పెట్టడానికి ప్రారంభమయ్యేప్పుడు ఆచరణ సాధ్యమైనంత త్వరలో అన్నారు. ఆచరణ సాధ్యంతో వచ్చింది బాధ.  ‘ఏమిటండీ! ఏం చేస్తారూ మీరు? ఒక పాఠ్యపుస్తకం లేదు చదవడానికి’. 

నిజమే - పుస్తకం లేనప్పుడు ఎట్లా ప్రవేశపెడ్తాం? అయితే పుస్తకాలు రావాలని ఆదుర్దాతో అన్నమాట కాదది. పుస్తకాలు లేవు కాబట్టి. పాలిసీల వద్దనే మాట. అందుకని తెలుగు అకాడమీకి ఈ ఛాలెంజి వచ్చింది. ‘మీరు ఏమయినా పాలసీ చేసుకోండి; కానీ పుస్తకాలు మాత్రం మేమందిస్తా. ఇహ న్యాయాధీశులేం చెప్తారో తర్వాత చెప్పండి. ప్రజలేం చెప్తారో, ప్రభుత్వం వారేం చెప్తారో మీరు అసెంబ్లీలో ఏం చెప్పుకుంటారో - అది మీ ఇష్టం. కాని మేము మాత్రం మా ఉడుతాభక్తిగా, మీరు లేదన్న ఒకటి మాత్రం సమకూర్చి పెడతాం అన్నది అకాడమీ. దీంతో ఒక సాకు లేకుండా పోయింది. కానీ ఇంకా సాకులున్నాయి. మీ పుస్తకాలెవరికన్నా అర్థమవుతున్నయ్యా? - అనేది రెండవ అభ్యంతరం. ఆ అనేవాడికి ఏదర్థం అయింది గనక. ఇది అర్థం కావాలని? అదొక ఘట్టం, అదొక ప్రహసనం అనుకొని దాన్ని కూడా చూచాం. తెలుగు అకాడమీ పుస్తకాలు అర్థం కావటం లేదనే అభ్యంతరం ఇప్పుడు లేదు. 


మూడవ అభ్యంతరం- ‘అవునండీ! పుస్తకాలు రాయిస్తున్నారు. ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ప్రవేశపెట్టారు. మరి వీళ్ళంతా ఏం కావాలి? ప్రతి సంవత్సరం పది వేల మంది ఇరవై వేల మంది, ఏభై వేల మంది, బీఏలు, బీఎస్సీలు పాసయి-తెలుగులో ఏం చెయ్యాలి వీళ్ళు? వీళ్ళకి ఉద్యోగాలేవి ఆంధ్రప్రదేశ్‌లో? ఏదో ఇంగ్లీష్‌ మీడియం అయితే వాడు కశ్మీరుకు పోతాడు; బొంబాయికి పోతాడు’ అంటే అక్కడ ఎవడికీ ఉద్యోగ అర్హత లేనట్టు! ఇహ మనమే ఎగుమతి చెయ్యాలి ఇక్కణ్ణించి! అంటే విద్యా విధానం నుంచి ఉద్యోగ విధానానికి గంతేస్తున్నమాట నిజమే మరి. ఆ పాలసీకి సమన్వయం లేకపోతే ఒక ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టిననాడు అది ప్రవేశపెట్టకపోతే మరి ఇది: ఫెయిల్‌ అవుతుంది గదా! తెలుగు చదివినవాణ్ణేమో చదివించి, ఉద్యోగమిచ్చినప్పుడేమో నీకు ఇంగ్లీషు బాగా వస్తుందా? అని అడిగితే నీవు చదివించిందేమో తెలుగాయె; నీకు తెలుగొస్తుందా - తెలుగొస్తే నీకేదో ఉద్యోగం దొరుకుతుందని చెప్పడానికయినా వీలు ఉండాలి కదా! పోనీ ఇంగ్లీషొచ్చిన ప్రతి వాడికిస్తున్నామా? ఇవ్వటం లేదనుకోండి. కానీ కనీసం తెలుగొచ్చినవాడికి కూడా ఇస్తాం - లేక ఏమన్నా కాస్తా ప్రాధాన్యం ఇస్తాం అనే పాలసీ  లేకపోతే ఎలా? 

ఇటు చదువులు చెప్పించేది ప్రభుత్వమే; అటు ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వమే! కాబట్టి  రెండు పాలసీలకయినా సమన్వయం లేకపోతే ఇంక ప్రైవేటు వాళ్ళను ఏమడుగుతాం? ముందు మనం చేసేది మనం చేయాలి కదా! అందుకని భాషా విధానం ఎంతదూరం పోతున్నది? కేవలం తెలు గు వరకు కాదు; తెలుగు అకాడమీ వరకు కాదు, ఇది ఇంతింతై-  చివరకు ఎక్కడికి చేరుతుందంటే- మీ ఉద్యోగ విధానం, ఎంపిక విధానం ఏమిటి? మీరక్కడ పెట్టే షరతులేమిటి? ఇంగ్లీష్‌ మీడియం  చదివేవాడితో సరిగా పోటీలో నిలిచి ఉద్యోగం సంపాదించుకొనే సమర్థత తెలుగువారిలో కల్పించటానికి మీరు ఏం చేస్తున్నారు- అని అడగాల్సి వస్తుంది కదా! తల్లిదండ్రులు అడుగుతారు. అందులో మన తల్లిదండ్రులు అడిగేవాళ్ళంతా ఇంగ్లీష్‌ మీడియం వాళ్ళు.  అటువంటివాడు తనకన్న ఎక్కువ తెలుగు వస్తే బాగుండు అని ఎవ్వడూ కోరడు.  మాత్ర పుత్రాదిచ్చేత్‌ పరాజయమ్‌ అనేదే కోరిక. వాడు నాకన్న ఎక్కువ ఇంగ్లీషు చదవాలె,అమెరికా పోవాలె, ఎంతసేపటికి అమెరికా, బ్రిటన్‌ మాటే కాని మన దేశం మాట కాదు. అందులో కూడా న్యాయముంది. 

మన పాలసీ మొదలైన తర్వాత ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. వారెప్పుడూ రైటే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారే రైటు. వ్యాపారంలో కస్టమర్‌ రైట్‌. మనం ఎప్పుడూ జవాబుదారీగా ఉండాలి. జవాబు ఇవ్వాలి. మూర్ఖపు ప్రశ్నలకు కూడా జవాబు ఇవ్వవలసిందే. తప్పదు. అందుకని తెలుగు అకాడమీ తెలుగు పాలసీ అన్నట్లు కాకుండా- ఈ తక్కిన ఆనుషంగిక - ఆనుషంగికం  కూడా కావు; అవి కూడా ఇంతే ప్రధానమైనవి; ఇంతకన్న ఎక్కువ ప్రధానమైనవి; వాటికే ఇది ఆనుషంగికం అనాలి - ఆ సమస్యలకన్నిటికి గూడ మనం పరిష్కారం  కనిపెట్టిన్నాడు, ప్రజల ఎదటికి తీసుకెళ్ళిన్నాడు - ఆనాడు ఇది విజయవంతం అవుతుంది. ఇంతకన్న మరొక పెద్ద సమస్య - మన దగ్గర తెలుగు పట్టభద్రులు వస్తారు. పక్క రాష్ర్టాలలో, యూపీలో, బెంగాల్‌లో ఇంగ్లీష్‌ కొనసాగిస్తూ ఉంటే మన దగ్గర తెలుగువాడు బిక్కమొహం వేస్తాడు. మన తెలుగు పాలసీ కూడా అంతటితో ఆగిపోతుంది. అపఖ్యాతి పాలవుతుంది. ఇంగ్లీష్‌మీడియం కాలేజీలో చదివినవాడికి పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగం దొరికి తెలుగువాడికి దొరక్కపోతే, ఈ ఇద్దరు అన్నదమ్ముల్లోనో, ఇద్దరు కజిన్స్‌లోనో - ఒకడికి దొరక్కపోతే - తెలుగువాడేమో దెబ్బతిన్నాడు ఇంగ్లీష్‌ చదివినవాడేమో బాగుపడ్డాడు అన్నమాట వచ్చేస్తుంది. అందుకని ఈ భాషా విధానాన్ని ఒకటి రెండు రాష్ర్టాలలోనే ప్రవేశ పెట్టకూడదు. అఖిల భారత విధానం ఉండాలి. లేక పోతే ఈ తేడాలు కచ్చితంగా వస్తాయి. భాషా విధానం విఫలమవుతుంది. 

ఇన్నింటితో పాటు మన పరిపాలనా రంగంలో ఏం జరుగుతుంది? తెలుగులో అర్జీ  వ్రాస్తే దానిమీద అసలు విచారణ జరుగుతుందో జరగదో అని ఇంగ్లీషు కొద్దిగా గూడ వ్రాయలేనటు వంటి మనిషి దగ్గరికి వెళ్ళి - ఒక్కొక్క వాక్యానికి పది తప్పులతో అర్జీ వ్రాయించుకుని తీసుకెళ్ళి ఆఫీసర్‌కు ఇస్తున్నాడు. అక్కడ తెలుగు నడవకపోతే ఇక్కడ ఎట్లా నడుస్తుంది? మోజు ఇంగ్లీషుపైన పెరిగింది. మేము దానికొక కమిటీ వేశాం. రామ్మూర్తిగారు మేమంతా  ఊరూరుకి వెళ్ళి అందర్నీ అడిగాం. అడిగితే అధికారులు ఏం చెప్పినారంటే ‘సార్‌! మేం గనక ఇంగ్లీషులో రాయకపోతే మా పెద్దాఫీసర్లు మేం అసమర్థులం అనుకుంటున్నారు అన్నారు. అంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు స్వతంత్ర భారతంలో గూడ ఇంగ్లిష్‌ ఎంత వస్తుందనే దానిపైనే ఒక వ్యక్తి సమర్థతను కొలుస్తున్నారు. ఈ పరిస్థితి మారకపోతే భాషా విధానం ఎట్లా బాగుపడుతుంది!  


బ్రిటిష్‌ కాలంలో తెలుగులో పని జరుగుతూ ఉండే ఆఫీసుల్లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఠకీమని  ఇంగ్లీషులో ప్రారంభించారు. ఈ బాధ్యత ఎవరిది? ఇది  సర్వే సర్వత్ర జరుగుతూ ఉన్న విష వలయం. దీనిని దెబ్బతీస్తే తప్ప ఈ మూడు నాలుగు అంశాల ఎలా గెలుస్తాం? రిక్రూట్‌మెంట్‌, ఇన్‌స్ట్రక్షన్‌, అడ్మినిస్ట్రేషన్‌ - ఇవి మూడే కాకుండా అసలు ఒక హోదా అంటూ మన భాషకు ఇవ్వడానికి ఏమి చెయ్యాలి? ఈ ప్రశ్న పైమూడింటికన్న అతీతమైనది. దీన్ని గురించి ఇంతవరకు ఆలోచించలేదు. మా సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువాళ్ళు మహారాష్ట్రం మాట్లాడటాన్ని ఫ్యాషన్‌ అనుకుంటారు. తెలుగువాళ్ళు తమిళ్‌ మాట్లాడటాన్ని ఫ్యాషన్‌ అనుకుంటారు. చిత్తూరు వాళ్ళనెవరినైనా తమిళ్‌ వాళ్ళు తెలుగు మాట్లాడటాన్ని ఫ్యాషన్‌ అనుకోరు. మహారాష్ర్టులు తెలుగు మాట్లాడటాన్ని ఫ్యాషన్‌ అనుకోరు. ఇచ్చామా మనం - స్టేటస్‌ భాషకు? ఈ స్టేటస్‌ వచ్చిన తరువాత తనంత తానే, ఒక విధమైన శక్తి వస్తుంది భాషకి.

 మన భారతీయు భాషల్లో కూడా స్టేటస్‌ ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని, తక్కువగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. బెంగాలీకి ఉన్నటువంటి స్టేటస్‌ బహుశా హిందీకి కూడా లేదు, ఒక కాలంలో, హిందీదేమో రాజభాషగా తెచ్చుకున్న స్టేటస్‌. అందుకని ఈ స్టేటస్‌కు సంబంధించినటువంటి తారతమ్యాలు కూడా మనం లేకుండ చేసి కనీసం మన భాష అయిన తెలుగుకు ఇతర భాషలతో సమానమైన హోదా - ప్రతిపత్తి కల్పిస్తే అప్పుడు ఆ భాషకు సంబంధించిన పాలసీని అమలు చేసినవాళ్ళమవుతాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. తెలుగు మీడియం స్కూళ్ళలో చదువు చెప్పటానికి తెలుగు మీడియంలో చదివేవాళ్ళకు ఉద్యోగాలిస్తామన్నారు. పెద్ద పాలసీ ఏమీ లేదు. తొమ్మిదో క్లాసుకు తెలుగులో సైన్స్‌ చెప్పాలి. బీఎస్సీ తెలుగులో చదివినవాడికి ప్రిఫరెన్స్‌ ఇస్తామన్నారు. దానిమీదనే పెద్ద దుమారం. ఏమిటో పెద్ద వివక్ష ఏమిటి అన్నారు. రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి హుస్సేన్‌సాగర్లో పడేసినమా అన్నంత ఆర్భాటం చేశారు. ఇతర భాషల వారిది పెద్ద దుమారం. ఉర్దూ వాళ్ళది పెద్ద దుమారం. నా మీద పెద్ద క్రాస్‌ ఎగ్జామినేషన్‌.  

తెలుగు అకాడమీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం తెలుగు పాలసీని అమలుపరచటంలో ఒక ముఖ్యమైన మెట్టుగా, ఒక అంతర్భాగంగా, ఒక ఐటమ్‌గా మాత్రమే మనం తీసుకోవటానికి వీలుంది. దీనివల్ల ఇతర ఐటమ్‌లను గురించి ఆసక్తి చెయ్యాలనే సంకల్పం పెరిగితే ఈ పని చేసినందుకు సంతోషిస్తాం. లేకపోతే ఈ పుస్తకాలన్నీ ఊరికే బీరువాల్లో ఉండిపోతాయి. ఇప్పుడు కొన్ని రాష్ర్టాల్లో మనకన్న ఎక్కువ పుస్తకాలు ప్రచురించారు. వందల పుస్తకాలు ప్రచురించారు. అయినాఆ భాష బోధనా భాషగా అక్కడ అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. 

ఆ విషయంలో కొంత వినమ్రభావంతో, మనం కొంత క్రెడిట్‌ ఈ రాష్ట్రంలో తీసుకోవచ్చు. ఇక్కడ తెలుగు బోధనా భాష గురించి ఆసక్తి బాగానే కనపడింది. తెలుగు పుస్తకాలు గూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. భాషా విధానాన్ని ఒకటి రెండు రాష్ర్టాలలో అమలు చేయలేము. ఒకటి రెండు రాష్ర్టాలు ఉత్సాహంగా చేస్తే, ఆ తరువాత బాధ పడవలసి వస్తుంది. అందుకని ఇది కేంద్ర వ్యవహారం. ఇది యావద్భారత దేశానికి సంబంధించిన కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఒక నాలుగు రాష్ర్టాలు వీటితో కలిస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఒకే పాలసీ సరిగా నడుస్తుంది. కాని ఈ ఐసోలేషన్‌లోనే మాత్రం ఉండలేరు. ఇంకా నలుగురు వెనక నుంచి వచ్చి వారికి బాగా సపోర్టు ఇవ్వాలన్నమాట.  ఇలా నాలుగయిదు సంవత్సరాలలో అంతా ఆవరించుకుపోవాలన్నమాట. దానిక్కూడ పబ్లిక్‌ ఒపీనియన్‌, లెజిస్లేటర్స్‌ ఒపీనియన్‌, లీడర్స్‌ ఒపీనియన్‌ - ఇవన్నీ బాగా ఫామ్‌ అయితే తప్ప  అయ్యే పనికాదు. కనుక  ఐదు సంవత్సరాలలో తెలుగు అకాడమీ సాధించినటువంటి విజయాలు, చేసినటువంటి పనిని మనం ప్రశంసించవలసిన అవసరం ఉన్నది. కాని దాంతో పాటు ఇది మనకు కొత్త కార్యక్రమాల్ని తెచ్చిపెట్టింది. కొత్త నిర్ణయాలను తీసుకోవలసిన బాధ్యతను వేసింది. అవి కూడా మనం మరచిపోరాదని మనవి చేస్తున్నాను.

మన పరిపాలనా రంగంలో ఏం జరుగుతుంది? తెలుగులో అర్జీ  వ్రాస్తే దానిమీద అసలు విచారణ జరుగుతుందో జరగదో అని ఇంగ్లీషు కొద్దిగా గూడ వ్రాయలేనటు వంటి మనిషి దగ్గరికి వెళ్ళి - ఒక్కొక్క వాక్యానికి పది తప్పులతో అర్జీ వ్రాయించుకుని తీసుకెళ్ళి ఆఫీసర్‌కు ఇస్తున్నాడు. అక్కడ తెలుగు నడవకపోతే ఇక్కడ ఎట్లా నడుస్తుంది? 

ఇక్కడ తెలుగు బోధనా భాష గురించి ఆసక్తి బాగానే కనపడింది. తెలుగు పుస్తకాలు గూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. భాషా విధానాన్ని ఒకటి రెండు రాష్ర్టాలలో అమలు చేయలేము. ఒకటి రెండు రాష్ర్టాలు ఉత్సాహంగా చేస్తే, ఆ తరువాత బాధ పడవలసి వస్తుంది. అందుకని ఇది కేంద్ర వ్యవహారం. ఇది యావద్భారత దేశానికి సంబంధించిన కార్యక్రమం.


logo