సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Sep 06, 2020 , 00:38:25

కవిత్వానికి ఆసనం.. కుందమాంబ శాసనం!

కవిత్వానికి ఆసనం.. కుందమాంబ శాసనం!

కాకతీయులు తమ పరిపాలనా వ్యవస్థను సువ్యవస్థితం చేయడానికి సామంత మాండలికులతో వివాహ సంబంధాలను కలుపుకున్నారు. ఆ క్రమంలో కాకతి గణపతి దేవుని తండ్రి మహాదేవుడు తన ఇద్దరు కుమార్తెలు మైలమాంబ, కుందమాంబలకు నతవాడి వంశీయులతో వివాహం చేశాడు. మైలమ, కుందమ ఇద్దరూ నతవాడి వంశ కీర్తి ప్రతిష్ఠలను తమ సత్ప్రవర్తనతో, దాన ధర్మాలతో ఇనుమడింపచేశారు.

ఈవారం మనం చర్చించుకునే శాసనాలు కుందమాంబ వేయించిన ఆదిలాబాదు చెన్నూరులోని కుందవరం శాసనం, జనగామ జిల్లాలోని నిడిగొండ, కుందవరం శాసనాలు.నిడిగొండ శాసనకాలం క్రీ.శ. 1212. ఈ శాసనంలో కుందమాంబ తన భర్త రుద్రరాజు, తండ్రి మహాదేవుడు, సోదరుడు గణపతిదేవుల పేర్ల మీదుగా లింగాలను ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించింది. ఆ ఆలయాల పూజాదికాలకు కుందవరంలోని కొంత భాగాన్ని, మరికొంత భాగాన్ని బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చి శాసనం వేయించింది. ఈమె కాళేశ్వరంలో, జీడికల్లులోని హిడింబాచలంపై, శ్రీశైలంలో, మంత్రకూటంలోను శివాలయాలను నిర్మించినట్లు... ఆదిలాబాదు చెన్నూరు దగ్గరి కుందపురం, జనగామ తాలూకాలోని కుందపురంలోని అనేక భూములను అగ్రహారంగా దానం చేసినట్లు తెలుస్తోంది.

ఇక జనగామలోని కుందవరం శాసనంలో కాకతీయ వంశానుక్రమం, నతవాడి వంశానుక్రమం ఉన్నాయి. మహాదేవుడు గణపతిదేవుని తరువాత జన్మించిన కుందమాంబకు వివాహం చేయాలనుకునే సమయంలో... నతవాడి వంశీయులే కాకతీయులకు సరియైనవారని, కుందమాంబకు వారితో వివాహం జరిపిస్తే బంగారంలో మణి అతికినట్లు ఉంటుందని పేర్కొన్నారు. నతవాడి బుద్ధరాజు కొడుకుల్లో జ్యేష్ఠుడైన రుద్రరాజు దొడ్డప్పాడరి గండభైరవుడుగా ప్రసిద్ధి పొందాడు. కుందమాంబను అతనికిచ్చి పెండ్లి చేశారు. ఆ వివాహం పాణిగ్రహణ సమయంలో వేములతొండ గ్రామాన్ని కుందమాంబ పేరుమీదుగా  కుందపురం అని మార్చి కూతురుకు ఇచ్చాడు మహాదేవుడు. కుందమాంబ ఆ గ్రామాన్ని దేవునికి, బ్రాహ్మణులకు అగ్రహారంగా దానం చేసింది. చెన్నూరులోని కుందవరం శాసనంలోనూ ఇంచుమించు ఇలాంటి సమాచారమే కనిపిస్తుంది.

ఈ మూడు శాసనాల రచయిత బాలభారతి అనే కవి. అతను కుందమాంబను... సుగుణాలనే మంచిదారాలతో, సూక్తులనే ముత్యాలతో ఓ హారంలా మారి భూదేవికి హృదయభాగంలో ధరించే విధంగా ఉన్నదని వర్ణించాడు. ఈమె గణపతిదేవుని తర్వాత ఎట్లా జన్మించిందంటే చంచల స్వభావం గల లక్ష్మీదేవి స్థిర స్వభావం కలిగి పుట్టినట్లుగా ఉందని పేర్కొన్నాడు. ఇంకా ఆమె కీర్తిని వర్ణిస్తూ “ప్రశాంతమైన పాల తరంగ కాంతులను జయించిన ఆమె కీర్తి అన్ని దిక్కులకు వ్యాపించింది. క్షీరసముద్రగర్భంలో ఉండే గొప్ప అవకాశం ఒక్క పురుషోత్తముడికే కాదు... కుందమాంబ కీర్తికాంతుల వల్ల జగత్తులో ఉన్న సమస్త జనులందరూ క్షీరసాగరంలోనే ఉన్నట్లు సాధ్యమయ్యింది” అంటాడు. మరో శ్లోకంలో  స్త్రీలందరిలో మిక్కిలి సౌందర్యం కలిగి ఉన్నది కుందలదేవి. ఆమె పాదాలకు సామంతరాజుల పత్నులు మొక్కగా, ఆమె రెండు పాదాల నుండి వెలువడే కాంతులు వారి సీమాన్తములందున్న (పాపిడ చివరిభాగం) సిందూరపు శోభను ఇనుమడింపచేస్తుంది. ఇంకా కల్ప మహీజ పల్లవాలతో, చింతామణి శ్రేణులతో కూడి అలంకరించబడిన నూతన శిరోభూషణంగా ప్రకాశిస్తుంది.

ఇక ఆమె కుందపురంలో త్రవ్వించిన కుంద సముద్రం(పెద్ద చెరువు) క్షీరసాగరం కంటే గొప్పదని తేలుస్తాడు బాలభారతి. ఎందుకంటే...  క్షీరసాగరమథనంలో సముద్రం నుండి పుట్టిన చంద్రుడు క్షయం పొందుతాడు (శుక్ల, కృష్ణపక్షాలు), ఇంకా కళంకం ఉన్నవాడు. కానీ ఈ కుంద సముద్రంలో పుట్టిన కీర్తిచంద్రునికి ఆ రెండు దోషాలు లేవు! ఆమె కుందపురం అగ్రహారాన్ని దానం చేయడం ఎలా ఉందంటే...  అక్కడి విద్వన్మణులతో సరస్వతీదేవికి హారంగా ఏర్పడుతుందని విద్వాంసుల ప్రజ్ఞ పొగడబడింది. ఇలా కుందమాంబ చేసిన ధర్మకార్యాలన్నీ వర్ణించటానికి సహస్రఫణుడైన శేషుడే సమర్థుడట. నిండుచంద్రునిలాగా ప్రకాశించే ఆమె సత్కీర్తిని పొగడితే ఆ శేషుడు తన సహజమైన విషాన్ని పోగొట్టుకొని అమృతత్వాన్ని పొందుతాడు. ఒకవేళ ఆవిధంగా జరగకపోతే విషంతో కూడిన నాలుకలతో శేషుడు ఆమె చేసే ధర్మకార్యాలను గుర్తించడం అనుచితమని అతిశయోక్తిగా చెప్పారు. నిడిగొండలో కుందమాంబ నిర్మించిన త్రికూటాలయాలను (కుందేశ్వరాలయం, విష్ణువు ఆలయం, భాస్కరుని ఆలయం కైలాసం, అమృత సముద్రం, మేరువులాగ ప్రకాశిస్తూ శోభిస్తున్నాయని పేర్కొంటాడు.

కుందమాంబ విశిష్ట వ్యక్తిత్వం ఈ శాసనాల ద్వారా స్పష్టమౌతుంది. ఇన్ని అద్భుతమైన వర్ణనలతో కుందమాంబ వేయించిన ఈ శాసనాలు కాకతీయుల కాలంలో పండితుల ప్రజ్ఞను, రాజులు వారిపై చూపిన ఆదరాభిమానాలను తెలుపుతున్నాయి.

- డా. భిన్నూరి మనోహరి ,9347971177


logo