మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Sep 06, 2020 , 00:38:24

రైతే కథానాయకుడు

రైతే కథానాయకుడు

రైతు జీవనం... శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. ఆ అడుగుజాడలలోని మట్టిపరిమళాలకు సాహితీ సొబగులు దిద్ది, వారి గళాన్ని కలం బాణితో వినిపించిన ఘనత మనకవులు, రచయితలది. అలాంటి రచనల విహంగ వీక్షణమే ఈ వ్యాసం. దేశానికి వెన్నెముకగా నిలిచే ఆ రైతు ప్రస్తావన రుగ్వేదకాలం నుంచే ఉంది. “మా స్తుతులతో పొలం సస్యశ్యామలంగా ఉండుగాక, పండిన సస్యముల వద్దకు కొడవళ్లు చేరుగాక” అని అక్కడ వినిపిస్తుంది. హాలుని గాథాసప్తశతిలో “చక్కగా దంచిన సన్నబియ్యపు వంటి వెన్నెలను, తాను కోరుకొనిన దానికంటే కొల్లగా పండిన పైరును ఒక పల్లె రైతు చూచి ఆనందంతో ఇచ్చవచ్చినట్లు పాడుకొనెను” అని రైతు ప్రస్తావన కనిపిస్తుంది.

ప్రాచీన తెలుగు సాహిత్యంలోని జానపదవాఙ్మయంలో దంపుడు పాటలు... పోలి, ఏల వంటి పదాలు కనిపిస్తాయి. నన్నయ భారతంలో “హీనులకు కర్షకులకును/ భూనుతధాన్యంబు బీజములు వణిజులకున్‌/ మానుగ శతైక వృద్ధి న/నూనముగ ఋణములితె ్తయుత్తమ బుద్దిన్‌” అంటూ నారద ధర్మజుల సంభాషణ ద్వారా నాటి కర్షకుల పరిస్థితి వివరిస్తారు. హాలికుడైన భక్తకవి పోతన ‘సత్కవుల్‌ హాలికులైననేమి’ అంటూ ఏకంగా హాలికకవులకు మార్గదర్శనం చేస్తాడు. వివిధ ప్రక్రియల సింగిడిగా వెలుగొందుతున్న ఆధునిక తెలుగు సాహిత్యంలో హాలిక, హాలికేతర కవులు, రచయితలు రైతు జీవితంలోని వివిధ పార్శాలను వైవిధ్యమైన దృష్టికోణంలో అక్షరసేద్యం చేశారు. 1919లో దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’ కావ్యం, కర్షక వాఙ్మయ వికాసానికి బాటలు వేసింది. కవి స్వయాన కర్షకుడు కావడం వల్ల కృషీవలుర జీవితాన్ని సహజసిద్ధంగా రచించారు. “సైరికా నీవు భారతక్ష్మా/ తలాత్మ గౌరవ పవిత్రమూర్తివి/ శూరమణివి, ధారుణీపతి పాలనదండ/ మెపుడు నీ హలంబుకన్నను ప్రార్థనీయంబగునె” అంటూ ‘రాజపాలన దండంకన్న రైతు హలము మిన్న’గా పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో కర్షక జీవితాన్ని చిత్రించిన తొలి లఘుకావ్యమిది. రైతు జీవిత నేపథ్యంతో పింగళి కాటూరి ‘తొలకరి’ రైతు ప్రాశస్త్యాన్ని తెలిపే ఖండకావ్యం రమణీయ శైలిలో అందించారు. అభినవ తిక్కన బిరుదాంకితుడు తుమ్మల సీతారామమూర్తి ‘పఱిగిపంట’, ‘పెద్దకాపు’ వంటి రచనల ద్వారా రైతు జీవనానికి కావ్య గౌరవం కల్పించారు. 1937లో వ్యవసాయదారుడైన గంగుల శాయిరెడ్డి రచన ‘రైతుబిడ్డ’ మరో వ్యవసాయ కావ్యం. దీని ద్వారా రైతు సద్గుణ సంపన్నతను వర్ణిస్తూ- “కుటిల నటనము, గర్వము, కొంటెతనము/ వన్నెచిన్నెలు లేని సద్వర్తనుడవు/ ఈగియందనురాగివో యోగిచంద్ర” అంటూ మానవీయ విలువలకు పెన్నిధిగా రైతు యోగిని చిత్రించిన తీరు కవి ఆత్మానుభూతిని వెల్లడిస్తుంది. అలాగే కవిబ్రహ్మగా ప్రసిద్ధి పొందిన కర్షక మహాకవి ఏటుకూరి వేంకటనర్సయ్య 1938లో 27 పద్యాలతో వెలువరించిన “క్షేత్రలక్ష్మి”లో “రారమ్మోయి కవీశ్వరా, హృదయనుర్మక్షేత్రముందున్ని సం/ స్కారంబైన ఫలంబునందుటకు స్వర్గస్థానమందుండెరా/ వారే రైతులు విశ్వజీవన కళా పారంగతుల్‌ నీ కవి/ త్వారంభమునకిద్ది స్వర్ణయుగమన్నా నాటికీ నేటికిన్‌” అంటూ రైతుల గురించి రాయడం వల్ల, కవులకు స్వర్ణయుగమవుతుందనే సందేశాన్నందించారు.

విశ్వనాథ ‘ఋతుసంహారం’లో “పంటకాపు” జీవితంలోని కొన్ని ఘట్టాలు వర్ణించారు. 1932-33లో కొండవీటి వేంకటకవి ‘కర్షకా’ అను మకుటంతో కర్షకుని వేదనామయ జీవితాన్ని శతకరూపంగా మలిచారు. అలాగే అమ్మిశెట్టి లక్ష్మయ్య ‘రైతు కళ్యాణము’లో ‘నోరుజారి పరుల నిందింపని, పలికి బొంకి భంగపాటు గాని మెఱుగనట్టి’ కృషీవలుని జీవితాన్ని కళ్లకు కట్టారు. ఇక కన్నెగంటి వీరభద్రాచార్యులు ‘పేదకాపు’ కావ్యం పేరులోనే కావ్యవస్తువును స్ఫురింపచేస్తుంది. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు ‘రైతురాజు’ గేయనాటికలో “మాకు పాడిపంటలొసంగి భారతావని నేల, రావోయి ఓ రైతు రాజా” అంటూనే ‘విప్రలబ్ద’ అనే గేయవాక్యాన్ని 54 గేయాలతో కథాత్మకంగా రచించారు. ఈ కావ్యాలలో రైతు కార్యకలాపాలను, వర్షాది వర్ణనలను వర్ణించారు. 1980లో వానమామలై జగన్నాథాచార్యులు ప్రజల భాషలో రాసిన ‘రైతు రామాయణం’... ‘దున్నినవానిదే పొలము అతనిదే తత్ఫలము” అంటూ రైతు జీవితాన్ని రామాయణ కథాత్మకంగా నవరసభరితంగా చిత్రించిన సుదీర్ఘకావ్యం. ఇక మిక్కిలినేని భగవంతరావు “ఓ పల్లెటూరి పేద రైతా పిల్లామేకా చల్లంగున్నారా?’ అంటూ ‘కుశలప్రశ్న’ వేశారు. భైరవరెడ్డి నారాయణరెడ్డి ‘రాయలసీమ రైతు’, ఇనగంటి పున్నయ్య చౌదరి ‘రైతుకన్నీరు’ వంటి రచనలు రైతు జీవన పార్శాలను స్పృశించాయి.

ఇలా రైతుకు సంబంధించి వివిధ ప్రక్రియల్లో రచనలు వెలువడటం హర్షణీయం. నార్లవేంకటేశ్వర్రావు ‘పైపంట’ (నాటిక), సింగమనేని నారాయణ ‘జూదం’ (కథ), పాపినేని శివశంకర్‌ ‘రైతు కవిత’ (సంకలనం), కొల్లా కృష్ణారావు ‘కర్షక సాహిత్యం’ వంటి రచనలు రైతుల స్థితిగతులను చిత్రించాయి. కె.పి.లక్ష్మీ నరసింహ ‘కుట్రచేస్తున్న కాలం’ (2014). ‘ఆరుతున్న మెతుకు దీపం’ (2016) కవితా సంకలనాలను వెలువరించారు. రాచరిక వ్యవస్థ నుంచి నేటి వరకు ‘రైతేరాజు’ అనేది నినాదంగానే ఉండిపోయిందనేది వాస్తవం. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపి, అన్నదాతకు అండగా నిలబడి, రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచే దిశగా, రైతును కావ్యనాయకున్ని చేసే రచనలు వెలువడటం ద్వారా తెలుగు సాహితీపీఠంపై రైతన్నకు సుస్థిరస్థానాన్ని అందించిన వారమవుతాం.


logo