మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Sep 06, 2020 , 00:38:22

అతడు...

అతడు...

ఒక చిచ్చు రేపిన పిడుగై 

ఒక అలజడి రేగిన సంద్రమై

ఒక తిరుగుబాటు ఎగరేసిన బావుటాయై

ఒక ఆందోళన నిర్వహించిన కలకలమై

నిరసన గళమెత్తిన వీరుడతడు


అవనిలో అవకతవకలకు

చెమ్మగిల్లిన నయనమతడు

పదవుల మీద, పైసల మీద 

మోజు లేని విరాగి అతడు

దౌర్జన్యాలను అన్యాయాలను

వ్యతిరేకించిన ప్రజాస్వామిక ఆక్రోశమతడు

అవినీతి చీకట్లను పారదోలేందుకు

ధిక్కారం ప్రజ్జ్వలించిన సూర్యుడతడు


నిరంకుశుల గుండెల్లో 

మార్మోగిన సింహనాదమతడు

వైవిధ్యాలు, వైరుధ్యాలు లేని

ప్రత్యేక తెలంగాణ లక్ష్యమతడు


జీవనదికున్నంత గుండెతడి

అమ్మనుడికున్నంత పలుకుబడి 

కంఠీరవాన్ని మించిన కంఠధ్వని

కలబోసిన తెలుగుతేజమతడు.


logo