శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Sep 05, 2020 , 04:01:49

ఏమని అడుగుతారు..?

ఏమని అడుగుతారు..?

ప్రజాస్వామ్యంలో శాసనసభే ప్రజాసమస్యల పరిష్కార అత్యున్నత వేదిక. ప్రజలందరికీ పరిపాలన ఫలాలను అందించేందుకు చట్టాలు, శాసనాలను రూపొందించుకోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ పద్దులను పెట్టుకొని చర్చించుకోవడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రజాగొంతుకగా ఉండటం- ఒకరకంగా చెప్పాలంటే భిన్నమైన గొంతుల సమష్టి ప్రజాస్వామిక వేదిక అసెంబ్లీ. కానీ తెలంగాణ ప్రతిపక్షాలు మాత్రం ఈ సంగతిని ఎప్పుడో మరిచిపోయినట్టున్నయి. పాలనలో ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను ఎత్తిచూపి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేయాల్సిన ప్రతిపక్షాలు, ప్రజల సమస్యలను విడిచి సొంత సమస్యలనే ప్రజాసమస్యలుగా అసెంబ్లీ వేదికగా మాట్లాడటం నిజంగా బాధాకరం. ఇది నాణానికి ఒకవైపే. రెండో వైపు కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పాలనలో తెస్తున్న సంస్కరణలు వీరికి ఎక్కువ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణలో ప్రతిపక్షాల పరిస్థితి యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు తయారైంది. 

తెలంగాణ వచ్చేదాక కరెంటు, సాగునీళ్లు, తాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధరలు, హాస్టళ్లో దొడ్డు బియ్యం, ఆకలియాత్రలు, రైతు ఆత్మహత్యలు, మన్యం పడకేసింది అనుకుంట కాలం వెళ్లదీసేటోళ్లు. అసెంబ్లీ లాబీల్లో హల్చల్‌ చేసేటోళ్లు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు వచ్చినా.. ఆ పది పదిహేను ఎవర్‌ గ్రీన్‌ సమస్యలతో ఆకలి తీర్చుకునెటోళ్లు. ఆ సమస్యలనే ఏకరువుపెడుతూ.. తెగ యాక్టింగ్‌ చేసేటోళ్లు. కానీ, యేమంట తెలంగాణ వచ్చిందో.. కేసీఆర్‌ పుణ్యమా అని అరవై ఏండ్లపాటు పీడించిన సాగునీళ్లు, తాగునీళ్లు, రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతల్లాంటి నిత్యనినాదాలకు తెరబడ్డది. ఇగ ఇప్పుడెట్లా..? అప్పుడంటే ప్రభుత్వం అసెంబ్లీ పెట్టడానికి మీనమేషాలు లెక్కించేది. అదే అదనుగా వీళ్లు మీడియా ముందట సవాళ్లు చేసేటోళ్లు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిపాయే.. కేసీఆర్‌ వద్దన్నా అసెంబ్లీ పెట్టవట్టే. మీరు ఎంతసేపు ప్రజాసమస్యల మీద మాట్లాడతరో, ఎన్ని రోజులు మాట్లాడతరో మాట్లాడుండ్రి నేను రెడీ అనవట్టే. ప్రతిపక్ష నాయకులకు ఇప్పుడిదొక పెద్ద టాస్క్‌. కానీ ప్రతిపక్షనాయకులు అప్‌డేట్‌ కావడం లేదు. తెలంగాణలో బుద్ధిజీవుల పేరిట ప్రజలను బురిడి కొట్టించాలని చూస్తున్న మేధావులు ఇటువైపు ఎందుకు ఆలోచించడంలేదు. ప్రజలెప్పుడు ప్రభుత్వాన్నే చూడాలా..? ప్రతిపక్షం తన పాత్ర పోషించొద్దా..? గత ఆరున్నరేండ్లుగా ప్రతిపక్షాల పాత్ర ఏమిటన్న చర్చ ఎక్కడైనా వచ్చిందా..? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా..? నడిపించేవాడు నాయకుడు.. కానీ పర్యవేక్షించాల్సినవాడు పరిరక్షకుడన్న నీతిని మరిచిపోదామా..? 

వ్యూహమేది - పోరాట రూపమేది ?

నేను బాజాప్తా అసెంబ్లీ పెడతా.. మీరు అడుగుండ్రి నేను చెప్తా అంటున్నడు కేసీఆర్‌. ఇక్కడివరకు క్లియర్‌. మరి ప్రతిపక్షాల సంగతేంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం కూర్చొని ప్రజల సమస్యలను చర్చించే దేవాలయం అసెంబ్లీ. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం సిద్ధమంటూ ప్రతిపక్షానికి సవాల్‌ విసురుతున్నది. పెన్షన్‌ నుంచి కరోనా టెన్షన్‌ దాక అన్నింటిని సవివరంగా చెప్తా అంటున్నది. కానీ ప్రతిపక్షనాయకులు మాత్రం వర్షం వచ్చింది రేపటి పంటలకు రైతులకు ఉపయోగపడతదనే పాజిటివ్‌ కోణమే మరిచిపోయి.. వర్షం రావడమే ఆలస్యం చెరువులు తెగినయి, ప్రాజెక్టులకు గండిపడిందనే పాటందుకున్నయి. వాగుల్లో, నదిలో చిక్కుకుపోయిన రైతులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో, హెలికాప్టర్లతో కాపాడిన ప్రభుత్వ చొరవ గురించి మాట్లాడేందుకు మాటలు రాని నాయకులకు, కుంభవృష్టి వల్ల తెగిన కొన్ని చెరువుల విషయం గుర్తుకురావడం బాధాకరం. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం వివరాలు బయటికి రాకమునుపే ప్రభుత్వం కుట్రచేసి కావాలనే ప్రమాదం జరిపించిందని ముట్టడికెళ్లిన దౌర్భాగ్యమైన రాజకీయం. వాడకో కొట్లాట, ఊరికో పంచాయితీ, ప్లాటుకో సెటిల్‌మెంటు, ఖాళీ జాగ కనిపిస్తే ఖతం చేస్తున్న కబ్జాసురుల ఆగడాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం కొన్ని నెలలపాటు చర్చలు జరిపి కొత్త రెవెన్యూ చట్టం తేవాలని ప్రయత్నిస్తుంటే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి.. కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీ భూములను కబ్జాచేసేందుకే ఈ చట్టం అంటూ నీతిమాలిన ఆరోపణలు. ఒకపక్క కరోనా దెబ్బ, మరోపక్క జీఎస్టీతో కేంద్రం రాష్ట్ర సంపదను ఊడ్చుకుపోతున్నదని గొంతెత్తి రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడితే.. వినాయకుడి పండుగను అడ్డంపెట్టి వింత వేషాలు. ప్రజలు పండించిన పంటలన్ని ఒక్కటే ఉంటే గిట్టుబాటుకాక.. కల్లాల దగ్గరే పంటలు ఎండకెండి, వానకు తడిసి రైతులు ఆగమవుతున్నరని పెద్దమనసుతో పంటల్ని కొని, మల్లోసారి అలా కాకుండా ఉండేందుకు వ్యవసాయ నిపుణులందరితో చర్చలు జరిపి.. నియంత్రత సాగు విధానం తీసుకొస్తే కేసీఆర్‌ నియంతృత్వానికి పరాకాష్ఠ అంటూ పిచ్చి ప్రేలాపనలు. ఇంత నికృష్టంగా ఆలోచిస్తున్న ప్రతిపక్ష నాయకులు రేపు అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడతరని ఎట్లనుకుంటం. ప్రజలుగా మనమంత ఆలోచించాల్సిన అవసరం ఉంది.

బార్‌ బార్‌ బోలుంగా - హజార్‌ బార్‌ బోలుంగా:

కేసీఆర్‌ వైఖరి కూడా ఇట్లనే ఉన్నది. నేను అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. నా వైఖరి తప్పన్ననాడు ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటా. ఇదే నా మాట, ఇదే నా బాట అంటున్నడు. మరీ ప్రతిపక్షాలేం చేస్తున్నయి. ఎక్కడో ఒక పిల్లోడు తెలిసీ తెలియక, కాంట్రాక్టర్‌ వైఫల్యమని తప్పుడు వీడియో తీస్తే, ఎగిరెగిరి దుంకిన ప్రతిపక్షాలు.. అంతటా అలాగే జరుగుతున్నయని ఎందుకు నిరూపించలేకపోతున్నయి. అంటే, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో ఎక్కడా వైఫల్యం లేదన్నట్టే కదా..? ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లే కాదు 24 గంటల కరెంటు ఇస్తమన్ననాడు ఇలాగే ఆరోపణలు చేసిండ్రు. కానీ ఇవ్వాల 24 గంటల కరెంట్‌ రైతన్నను రాజును చేస్తున్నది. మిషన్‌ కాకతీయ కింద పునర్నిర్మించిన 45 వేల చెరువులు ఇయ్యాల అలుగుదుంకుతుంటే ఎదురెక్కిన చేపలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నరు ఆనాడు విమర్శించిన నాయకులు. అంతేకాదు.. రికార్డు టైంలో ప్రపంచమే ఔరా అనే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఇక రైతన్నల ఆత్మగౌరవ పతాక రైతుబంధు పథకం. ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.5000 చొప్పున పంట సాయం చేస్తే అందరికి ఎందుకిస్తున్నరని ఆరోపించిన్రు. ఇలా ఆరోపించినోళ్లే క్యూలో నిలబడి చెక్కులు తీసుకొని చెక్కేసిండ్రు. ఇక రుణమాఫీ. రైతు ఆత్మహత్యలు తగ్గించాలి, అప్పుల ఊబినుంచి అన్నదాతను కాపాడాలని అంటూ వట్టి మాటలు మాట్లాడిండ్రు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసీఆర్‌ రైతుల కోసం రుణమాఫీ చేసి తానే రైతుబంధువునని నిరూపించుకున్నడు. ఇక ఇంటికి పెద్దదిక్కయిన రైతు చనిపోతే రైతు కుటుంబం ఆగమైతదని రైతుబీమా పథకం తెచ్చి, రైతు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల తక్షణ సాయం చేస్తుంటే అదే పసలేని ఆరోపణలు చేసిండ్రు. ఇలా ఒక్కటని కాదు.. రాష్ట్రమంత అందినప్పటికీ.. ఎక్కడో ఒక్కరికి విత్తనం బస్తా, యూరియా అందకపోయినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసింది. కానీ అనునిత్యం రైతుల కోసం కష్టించిన కృషికి నిదర్శనమా అన్నట్టు, నిన్నగాక మొన్న విడుదల చేసిన నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో రిపోర్టు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినయని తేల్చేసింది. ఇవన్నీ ప్రతిపక్షాల అజ్ఞానానికి, కేసీఆర్‌ విజ్ఞానానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 

అసెంబ్లీకి కొత్త అర్థం ఇప్పుడైనా దొరికేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలంటే ప్రభుత్వం ఎత్తులు, ప్రతిపక్షాల పైఎత్తులు, రాజకీయ జెండాలు, వ్యక్తిగత ఎజెండాలు, హోరాహోరీ వాగ్యుద్ధాలు, కట్టుతప్పే నాలుకలపై స్పీకర్‌ కత్తెర్లు, మాటమాటకు కెమెరాలకు కండలు చూపించే మార్షళ్లు, విరిగిపడే మైకులు, రికార్డుల నుంచి తొలగించబడే డైలాగులు. ఇది ప్రజాస్వామ్యమా అన్నట్టుగా వాతావరణం. ప్రజల సమస్యల సాధనకు, ప్రజానేతలకు వేదికగా ఉండే అసెంబ్లీలో గతకాలపు చేదు జ్ఞాపకాలివి. కానీ తెలంగాణ వచ్చినంక సీన్‌ రివర్స్‌ అయ్యింది. ప్రజలే ప్రభుత్వంగా ఏర్పడ్డరు. స్వరాష్ట్రం కోసం పిడికిళ్లెత్తిన చేతులే మైకులు పట్టుకున్నయి. జై తెలంగాణ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తిన గళాలే.. అధ్యక్షా అంటూ తన కార్యాచరణను వివరిస్తున్నప్పుడు ప్రతిక్షణం ప్రజల పక్షం కాకుండా ఉంటుందా? కానీ, తెలంగాణ వచ్చేదాక అధికారం ఆస్తిగా భావించిన నాయకగణం సడెన్‌గా ప్రతిపక్షంలో కూర్చోవడం వల్ల వచ్చిన ఉక్కపోతలు తెలంగాణకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నయి. 

ఒక ఇంజినీర్‌ తాను ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో తానే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేసుకుంటున్నట్టు, కౌలు చేసిన పొలాన్ని రెక్కల కష్టంతో కొనుక్కొని ఎవుసం చేసుకుంటున్నట్టు.. ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో కేసీఆర్‌ అండ్‌ టీం తెలంగాణ నవనిర్మాణానికి పూనుకుంటుంటే ప్రతిపక్షనాయకులు మాత్రం ఇంకా దుందుడుకు రాజకీయాలే చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ జనమంతా జాగృతమై ఉన్నారు. ఏది తప్పు, ఏది ఒప్పో తెలుసుకునే విజ్ఞానంతో ఉన్నరు. ఏది న్యాయమో, ఏది ధర్మమో నిర్ణయించి ఆచరించే చైతన్యంతో ఉన్నరు. కాబట్టి ప్రజలను బ్లఫ్‌ చేయడం కుదరదిక.. ఏం అడగాల్నో ప్రతిపక్షాలు పరిశోధించి నిర్ణయించుకోవాల్సిందే. ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిపోయి దిగజారి చేసే విమర్శలను ప్రజలు సహించే స్థితిలో లేరన్న సత్యం వారు తెలుసుకుంటే మంచిది. ఒక పక్క ముఖ్యమంత్రి సద్విమర్శలను సహృదయంతో ఆహ్వానిస్తాం, అమలు చేస్తామని నిండు అసెంబ్లీలోనే చెప్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వాటి సహజవైఖరి నుంచి బయటకు రాలేకపోతున్నాయి. ప్రజలు తమ నుంచి ఏం ఆశిస్తున్నారన్న విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహిస్తే బాగుండేది. ఒకపక్క ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం తెస్తే అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రజలముందుంచరు, మున్సిపల్‌ చట్టం తెచ్చినప్పుడు మాట్లాడరు, రెవెన్యూ చట్టం అమల్లోకి తెస్తామంటే ప్రజలకు పనికొచ్చే సలహాలు ఇవ్వరు. కానీ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్నా.. కేసీఆర్‌ ప్రభుత్వం దోపిడి చేస్తున్నది, దోచుకుంటున్నదనే రెండు మాటలతో కాలం వెళ్లదీస్తుంటరు. కనీసం ఈ అసెంబ్లీలోనైనా ప్రతిపక్షాలు ప్రజలకు, లేదంటే తమ అంతరాత్మకు జవాబు చెప్పడం కోసమైనా వ్యక్తిగత రాజకీయాలు మాని నిజమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే దిశగా అడుగులు వేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.

తాజావార్తలు


logo