మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Sep 05, 2020 , 04:01:51

ప్రగతి పథాన పల్లెలు

ప్రగతి పథాన పల్లెలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభించిన పల్లె ప్రగతి పథకం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో అద్భుత ఫలితాలనిస్తున్నది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పథకం ఉపయోగపడేవిధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో మూడుసార్లు కాలానుగుణంగా సీజన్లను బట్టి ప్రత్యేక అవసరాలను బట్టి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందించుకోవాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పంచాయతీలలో అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పమిది. తాగునీరు, రోడ్లు, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలన్నింటిపై ఈ పథకం వల్ల ప్రత్యేక శ్రద్ధ కొనసాగుతున్నది. 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వరంగల్‌ జిల్లాలోని గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతిని అమలుపరుస్తున్నది. ఈ పథకం ద్వారా పల్లెలు అన్నిరకాల అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుకున్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వినియోగంలోలేని ఎన్నో భవనాలు ఇప్పుడు కొత్త రూపును, ఊపును సంతరించుకున్నాయి. ప్రతి గ్రామంలో పరిశుభ్రత కోసం పిచ్చిమొక్కలు తీసేసి, చెత్తాచెదారంతో నిండి ఉన్న డ్రైనేజీ కాల్వలను శుభ్రపరచుకుంటున్నారు. కాలుష్యంతో నిండిపోతూ, పర్యావరణానికి దూరమవుతున్న ప్రకృతిని చక్కదిద్దిడం కోసం పథకంలో భాగంగా ప్రతి గ్రామాన పచ్చటి చెట్లతో హరితవనాలను తలపించేలా చేస్తున్నారు. నర్సరీలు, డంపు యార్డులకు చాలా గ్రామాల్లో స్థలాలను గుర్తించి ఏర్పాటు చేశారు. శ్మశానవాటికల కోసం ప్రభుత్వ భూమిని ఏ శాఖ పరిధిలో ఉన్నా సరే గుర్తించి, దాన్ని సామాజిక అవసరాల కోసం వాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 

తెలంగాణ ప్రగతి కోసం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. బంగారు తెలంగాణ దిశగా పయనించడానికి పల్లె ప్రగతి వంటి పథకాలు గ్రామాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2019 సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు ప్రతి జిల్లాలో అట్టహాసంగా మొదటి విడుత పల్లె ప్రగతి పథకం చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలిచ్చింది. ప్రజాప్రతినిధులకు, యువ నేతలకు, ఔత్సాహికులకు ఇది సరయిన వేదిక అవుతుందన్న ముఖ్యమంత్రి మాటలు ప్రభావాన్ని చూపించాయి. చాలామంది తమ నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ముందుకొచ్చారు. గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర వర్గాలు భాగస్వాములవడంతో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ తదితర ఉన్నత రాజకీయ నాయకత్వం చాలావరకు గ్రామస్థాయి నుంచే వచ్చిందన్న వాస్తవాన్ని గుర్తెరిగితే యువతలో, ప్రజలలో ఇలాంటి పనుల్లో భాగస్వామ్యం పట్ల ఆసక్తి పెంపొందడం సహజం. 

పల్లె ప్రగతి రెండో విడుతను 2020 ఆరంభంలోనే జనవరి 2న వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. పల్లె ప్రగతి మూడో విడుతను జూన్‌ 1 నుంచి వారంపాటు 141 మున్సిపాల్టీలలో, 12751 గ్రామపంచాయతీలలో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా డ్రైనేజీ, దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో జరిగిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకుని పచ్చదనం కోసం గ్రామాలకు కేటాయించిన నిధులలో పది శాతం కేటాయించారు. 

పల్లె ప్రగతి ఇప్పటికి పలు దశల్లో ఆశావహ ఫలితాలను సాధించింది. పచ్చదనం, పరిశుభ్రత, శ్మశానవాటికలు, డంపుయార్డులు, నర్సరీ ఏర్పాట్లు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్లు, చెత్త సేకరణకోసం ట్రాలీలు ప్రాధాన్య అంశాల్లో భాగమయ్యాయి. విద్యుత్తుశాఖ పవర్‌వీక్‌ కార్యక్రమంలో తుప్పుపట్టిన, వంగిన స్తంభాలను గుర్తించి, వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసింది. వైర్లు వేలాడకుండా సరిచేసి ఎలాంటి ప్రమాదాలు కాకుండా నివారణ చర్యలు చేపట్టింది. కొత్త మీటర్లు వచ్చాయి. ఇలా పలు మౌలిక సదుపాయాలు పల్లె ప్రగతి పథకంతో సాధ్యమయ్యాయి. ముఖ్యమంత్రి కోరుకున్న విధంగా ప్రజలు స్పందించారు. అభివృద్ధి క్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించుకున్నాక అభివృద్ధిని చూస్తూ ఎంతగా మారిపోయిందో అని సంతోషపడ్డారు. పల్లె ప్రగతి పథకంలో భాగంగా గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణ ఎప్పటికీ ఇదే స్ఫూర్తితో కొనసాగాలి. గంగదేవిపల్లి గ్రామం ఆదర్శంగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ముందుకు సాగితే బంగారు తెలంగాణ సుసాధ్యమే.

(వ్యాసకర్త: డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌ జర్నలిజం విభాగాధిపతి, కేయూ)


logo