శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Sep 05, 2020 , 04:02:39

కరసేవ లాంఛనమేనా?

కరసేవ లాంఛనమేనా?

ఏడో అధ్యాయం కొనసాగింపు..

మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించేదేమంటే వాళ్లు ఏ మాధ్యమం ద్వారా దానిని ప్రచారం చేయాలనుకుంటే దాని ద్వారా దూరదర్శన్‌, ఆకాశవాణితో సహా- ప్రచారాన్ని చేపట్టాలి. అది వెనువెంటనే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్ల సమీక్ష టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా డిసెంబరు 1న ప్రచురించింది. అయోధ్యలో నెలకొన్న సాధారణ పరిస్థితిని ఆ పత్రిక  ఇలా పేర్కొంది: రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు కరసేవ కేవలం లాంఛనప్రాయమేనని మాట ఇవ్వటాన్ని అక్కడ పట్టించుకున్నవాళ్లు ఎక్కువ మంది కనిపించటం లేదు. ఏది ఏమైనా ఈ విషయంలో తుది నిర్ణయం అయోధ్యలో 4వ తేదీన జరిగే సాధువుల సమావేశం, దేవాలయ జీర్ణోద్ధరణ కమిటీ సమావేశాల్లో తీసుకోబడుతుంది. ఆ కమిటీ కన్వీనర్‌ స్వామివామదేవ్‌, రామ జన్మభూమి న్యాస్‌ అధ్యక్షులు మహంత్‌ రామచంద్ర పరమహంస, అయోధ్యలో వీహెచ్‌పీకి మూలస్తంభంగా నిలిచే మహంత్‌ నృత్య గోపాలదాసలు విడివిడిగా ఇచ్చిన ప్రకటనలో తెలియజేసినదేమంటే ఢిల్లీలోని ధర్మసంసద్‌ ఆమోదాన్ని పొందిన కేంద్రీయ మార్గదర్శక మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా రాజమాత విజయరాజే సింధియా ఎటువంటి హామీని ఇచ్చివుండవలసింది కాదని.

అయోధ్య నుంచి అటువంటి వార్తలతో కలతచెందిన బాబ్రీ మసీదు పోరాట కమిటీ, బాబ్రీమసీదులోకి ప్రవేశాన్ని కట్టడిచేయాలని కోరింది. 2వ తేదీన ప్రకటితమైన కథనం ప్రకారం- ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులలోని లాంఛనప్రాయమైన కరసేవకు తప్పుడు భాష్యం చెప్పి, ఆర్‌ఎస్‌ఎస్‌- వీహెచ్‌పీ- బీజేపీ కూటమి దానిని దుర్వినియోగపరిచే అవకాశం ఉందిగనుక అయోధ్యలో వివాదంలో ఉన్న స్థలానికి భద్రతా వలయాన్ని కల్పించి కరసేవకులు అందులోకి ప్రవేశించ వీలులేకుండా చేయాలని బాబ్రీ మసీదు మూవ్‌మెంట్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (బీఎంసీసీ) కోరింది. ఆ విషయంపై మరింత వివరణ ఇస్తూ బీఎంసీసీ కన్వీనరు సయ్యద్‌ షాహబుద్దీన్‌ నొక్కివక్కాణించిందేమంటే- ‘వివాదంలో ఉన్న స్థలంలోకి కరసేవకుల ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులలో ఏమీ ఆంక్షలు లేనందున అధికారులు క్లిష్ట పరిస్థితుల్లో లాంఛనప్రాయమైన కరసేవకు వ్యతిరేకంగా చేపట్టే చర్యల్ని అదుపుచేయలేమంటూ అశక్తతను ప్రదర్శించటమో, అందుకోసం బల ప్రయోగాన్ని చేయలేకపోవటమో జరిగే అవకాశం ఉన్నది’ 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo