శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Sep 05, 2020 , 04:03:17

బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

రెంటాల గోపాలకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా బహుగ్రంథకర్తగా, అనువాదకుడిగా, పాత్రికేయుడిగా, జీవితచరిత్రల రచయితగా, బాల సాహితీవేత్తగా, సినీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. అభ్యుదయకవిగా, నయాగరా కవుల గుంపులో ఒకరిగా గుర్తింపు పొందిన రెంటాల వారేమిటో కవిగా సర్పయాగం, సంఘర్షణ, శివధనువు సంపుటాలు తెలియజేస్తాయి. రాజ్యశ్రీ అనే చారిత్రక నవలతోపాటు ఎన్నో కథలను కూడా రాశారు. ఆయన చేసిన అనువాదాలు అసంఖ్యాకం. రామాయణ, భారత, భాగవతాదులను కలిపి, విడివిడిగానూ వచన రూపంలో సరళంగా పాఠకులకు అందించారు. పురాణాలను- ప్రబంధాలను, సంస్కృత కావ్యాలను తేట తెలుగులో అనువదించారు. వాత్స్యాయన కామసూత్రాలు, అనంగరంగం లాంటి కామశాస్త్ర గ్రంథాలు కూడా ఇందులో ఉన్నాయి. టాల్‌స్టాయ్‌ విరచిత  అనా కెరినీనా, యుద్ధం- శాంతి నవలలు, అలెగ్జాండర్‌ కుప్రిన్‌ రాసిన ‘యమకూపం’ మంచి అనువాద నవలలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. సుభాషిత రత్నావళి (సంస్కృతంలోని సూక్తులకు తెలుగు అనువాదం), జాతీయాలు- పుట్టు పూర్వోత్తరాలు, ‘సంస్కృత వ్యాసాలు రెఫరెన్స్‌ పుస్తకాలుగా గుర్తింపునొందాయి. 

ఆంధ్రప్రభలో సినిమా విశేషాల అనుబంధం చిత్రభూమిలో రెంటాల సంపాదక బాధ్యతలు నిర్వహించారు. చలనచిత్ర నిర్మాణ ప్రక్రియలు మెలకువలు తెలుపుతూ ఫిల్మ్‌ టెక్నిక్‌ పేరిట ఎన్నో వ్యాసాలు రాశారు. పంచకళ్యాణి- దొంగల రాణి, కథానాయకురాలు లాంటి సినిమాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చారు. నటుడిగా, నాటకకర్తగా రెంటాల గోపాలకృష్ణ  బహుముఖ ప్రజ్ఞకు ఆయన నాటక ప్రదర్శనలు, నాటక రచనలు అద్దం పడుతాయి. ఆడం మూకాభినయ నాటిక రెంటాల రంగస్థల ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాలలో పుట్టిన రెంటాల గోపాలకృష్ణ తన జన్మ భూమ్మీద అభిమానంతో పల్నాటి భారత గాథను పల్నాటి వీర చరిత్రగా గ్రంథస్థం చేశారు. దీంతోబాటు ప్రసిద్ధ నవలా రచయిత నోరి నరసింహశాస్త్రి గారి రుద్రమదేవి నవలను శ్రవ్య నాటకంగా మలచడంలో మంచి నేర్పును కనబరిచారు. రెంటాల మంచి నాటకకర్తే కాక మంచి నటుడు కూడా. అనిశెట్టి సుబ్బారావుగారి గాలిమేడలు, ఆత్రేయగారి విశ్వశాంతి, పులుగుండ రామకృష్ణయ్యగారి తుఫానులాంటి రంగస్థల నాటకాలతోపాటు ఆకాశవాణి నాటకాలలో కూడా విభిన్న పాత్రలను పోషించారు.

 కేపీ అశోక్‌కుమార్‌ ,(వ్యాసకర్త:  రెంటాల స్మరణోత్సవ సంఘం అధ్యక్షులు)


logo