ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Sep 03, 2020 , 23:34:46

కుంచించిన ఆర్థికం

కుంచించిన ఆర్థికం

మన దేశ జీడీపీ వృద్ధి ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో 23.9 శాతం కుంచించుకుపోయిందనేది భయం గొలుపుతున్నది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోకెల్లా మనది అతి వేగంగా దిగజారిపోతున్నది. సమీప భవిష్యత్తులో కూడా పుంజుకునే సూచనలు కనబడటం లేదు. అవ్యవస్థీకృత రంగపు గణాంకాలు బయటకు వచ్చినప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా కనపడుతున్నది. ఈసారి మొత్తం ఆర్థిక సంవత్సరంలోనే ప్రతికూల వృద్ధి ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే వ్యవసాయరంగం ఒక్కటే మెరుగ్గా ఉన్నది. కరోనా గండం గట్టెక్కినా ఆ తరువాత ఆర్థిక పరిస్థితి ఏమిటనే ఆందోళన ఎంతో కాలంగా వ్యక్తమవుతున్నది. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమి చేయదలుచుకున్నదనేది ప్రశ్నార్థకం. 

లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రాంతాలలో అత్యధికం దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలే. దేశంలోని డబ్భు శాతం ఉత్పత్తి, వినియోగం లాక్‌డౌన్‌ ప్రాంతాలలో జరిగేదే. అందువల్ల కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థికవ్యవస్థపై తీవ్రంగా పడింది. భారత ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం- దేశంలో దాదాపు కోటీ తొమ్మిది లక్షల మంది వేతన ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పలు రంగాల్లో మూసివేతలు, తొలగింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఆర్థికరంగ చోదకశక్తుల్లో దాని పరిస్థితీ ఆశాజనకంగా లేదు. దేశంలో వినియోగం 27 శాతం అంటే 5,31,803 కోట్ల రూపాయల మేర పడిపోయింది. వ్యాపార రంగ పెట్టుబడులు 5,33,003 కోట్ల మేర పడిపోయాయి. ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వరంగ పెట్టుబడుల మీద ఆశ ఉండటం సహజం. కానీ ప్రభుత్వ వ్యయం పదహారు శాతం అంటే దాదాపుగా 68,387 కోట్లు మాత్రమే పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు ఏ మాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతున్నది. 

ఆర్థికవ్యవస్థను నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం మొదలు నుంచీ తడబడుతున్నది. లాక్‌డౌన్‌ మొదలు కాకముందే మన ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం ఆర్థికవ్యవస్థపై పడిన పెద్ద దెబ్బ. ఆ తరువాత జీఎస్టీ అమలు ప్రతికూల ప్రభావం చూపింది. ఈలోగా కరోనా వైరస్‌ దాపురించింది. రాబోయే విపత్కర పరిస్థితిని గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెలికాప్టర్‌ మనీని ప్రతిపాదించారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ అనుభవాల నేపథ్యంలోనే కేసీఆర్‌ ఈ సూచన చేశారు. కేసీఆర్‌ తెలంగాణలో భారీ ఎత్తున మౌలిక వసతుల పథకాలు చేపట్టారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలను సమాజంలోకి ప్రవహింపజేశారు. కేసీఆర్‌ వేగంగా స్పందించి ఈ చర్యలు చేపట్టకపోతే రాష్ట్రం పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇప్పటికైనా కేసీఆర్‌ సూచనలను ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకుంటే దేశం బాగుపడుతుంది. 


logo