శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Sep 03, 2020 , 23:34:49

సహాయం అవసరం లేదు

సహాయం అవసరం లేదు

ఏడో అధ్యాయం కొనసాగింపు..

ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ న్యాయసలహాదారు కే.కే.వేణుగోపాల్‌ ‘అయోధ్యలో నెలకొన్న పరిస్థితిపై సవివరంగా వాంగ్మూలాన్ని ఆ తర్వాత రోజు సమర్పిస్తానని తెలియజేశారు. అది కోర్టు ఉత్తర్వుల్ని అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన చర్యలను కూడా సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో అసంతృప్తిని ప్రకటిస్తూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు అయోధ్యలో సేకరించిన స్థలానికి, వివాదంలో ఉన్న కట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రిసీవర్‌గా నియమించాలని కోరటం జరిగింది. ముగ్గురు న్యాయాధీశులతో కూడిన ధర్మాసనానికి పెద్దగా ఉన్న జస్టిస్‌ వెంకటాచలయ్య వెంటనే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ తర్వాత రోజు రాష్ట్ర ప్రభుత్వం తన వాంగ్మూలాన్ని సమర్పించేవరకు వేచి చూడాలన్నారు.

హియరింగ్‌కు తర్వాతి రోజైన నవంబరు 27న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ పార్టీలను అది సంప్రదిస్తున్నానన్నది. అది సమర్పించిన వాంగ్మూలం ఈ కింది అంశాలతో కూడి ఉంది: వివిధ పార్టీలతో సంప్రదింపుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతిస్పందన సానుకూలంగానే ఉంది. స్థల సేకరణకు సంబంధించిన రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం అది శాశ్వత ప్రాతిపదికన గానీ, తాత్కాలిక ప్రాతిపదికనగానీ ఎటువంటి నిర్మాణమూ జరగదనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విశ్వాసాన్ని కూడగట్టుకుంది. అయితే రామభక్తుల మతపరమైన ఆకాంక్షలను స్నేహభావంతో స్వీకరించి, కరసేవ, నిర్మాణ కార్యక్రమానికి భిన్నంగా నిర్వహింపబడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులకు భంగం వాటిల్లకుండా కరసేవను అనుమతిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతూ బీజేపీ పార్లమెంటు సభ్యుడు వీహెచ్‌పీ కార్యనిర్వాహకుడు స్వామి చిన్మయానం రాసిన జాబును రాష్ట్ర ప్రభుత్వ వాంగ్మూలానికి  జతచేయటం జరిగింది. అయోధ్యలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వజూపే బలగాల సహాయం అవసరంలేదు. శాంతిభద్రతలను కాపాడటంలో, మతసామరస్యాన్ని నిలబెట్టటంలో యూపీ ప్రభుత్వానికి ఆపేక్షణీయ ప్రమాణాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాంగ్మూ లంలో ఇంకా యిలా పేర్కొంది: ‘రామజన్మభూమి కట్టడాన్ని రక్షించేందుకు తాను కృతనిశ్చయంతో ఉంది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేట్లు చూచేందుకు మరో సంస్థ అవసరం అక్కర్లేదు. ఒకవేళ ఏ సంస్థకయినా అలా అప్పగించటం జరిగితే అది కొనసాగుతున్న చర్చలకు, అనునయ కార్యక్రమానికి అంతరాయం కలిగించటమేగాక అనవసర బలప్రయోగానికి దారితీయవచ్చు. అంటూ కోర్టు ఆందోళన తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది.

జస్టిస్‌ వెంకటాచలయ్య ఆ సందర్భంగా వ్యాఖ్యానించిందేమంటే ఏవిధమైన పండుగ, సందర్భమూ లేకుండా అలా లక్షలాదిమంది అయోధ్యలో గుమిగూడటం ‘మా మనసుల్లో ఆందోళన కల్గించే విషయం’ జూలై మాసంలో కరసేవ ముసుగులో ఎంతో నిర్మాణ కార్యక్రమం వివాదంలో ఉన్న కట్టడం వద్ద చేపట్టటం జరిగిందని ఆయన అన్నారు. లక్షలాదిమంది పోగై, నిర్మాణ కార్యక్రమం చేపడితే అప్పుడు దాన్ని నిలువరించటం కష్టమవుతుందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై కోర్టులో ఓ అంగీకార పత్రాన్ని సమర్పించింది: ‘సేకరించిన స్థలంలోకి నిర్మాణ యంత్రాలుగాని, నిర్మాణ సామగ్రిగాని తరలించబడవు; హైకోర్టులోని మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటూ భూ సేకరణ విషయంలో రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నంతకాలం ఏ విధమైన నిర్మాణ కార్యక్రమం జరగదు, చేపట్టబడదు. 1992 నవంబర్‌ 28 నాటి ఉత్తర్వులలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆ అంగీకార పత్రాన్నేగాక మళ్లీ ఇచ్చిన ఈ హామీని కూడా పరిగణనలోకి తీసుకుంది :‘కరసేవ పేరుతో ఎటువంటి నిర్మాణ కార్యక్రమమూ సేకరించిన స్థలంలో శాశ్వత ప్రాతిపదికనగానీ, తాత్కాలిక ప్రాతిపదికనగానీ నిర్వహింపబడదు; నిర్వహించేందుకు అనుమతించబడదు. ‘కరసేవ కేవలం ప్రతీకాత్మకంగానే భక్తుల భావోద్వేగాలను శాంతింపజేసేందుకు కొన్ని మతపరమైన కార్యకలాపాలకే పరిమితమై ఉంటుంది. అది ఏ నిర్మాణ కార్యక్రమం ప్రతీకాత్మకంగా గానీ, మరోవిధంగా గానీ చేపట్టేందుకు వినియోగించబడదు. కోర్టు ఇంకా ఏమి గ్రహించిందంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢసంకల్పంతో, అంగీకార పత్రం తో ముందుకువచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్ని శిరసావహించి అమలుపరుస్తుంది. సేకరించిన స్థలంలో నిర్మాణం జరుగబోదు; నిర్మాణం జరిపేందుకు ఏ సంస్థనైనా సరే అనుమతించబోదు. తన ఉత్తర్వులు సజావుగా కొనసాగేట్లు చూచేందుకు, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఉన్నత న్యాయాధికారిని పరిశీలకునిగా నియమించింది. అప్పటి మొరాదాబాద్‌ జిల్లా జడ్జిగా ఉన్న తజి శంకర్‌ అయోధ్యలో ఉండి సేకరించిన స్థలంలో తలెత్తే పరిణామాలను నిరంతరం గమనిస్తూ వాటిని సుప్రీంకోర్టుకు నివేదిస్తూ మరీ ముఖ్యంగా జరగగూడని పరిణామం సంభవించినపుడో, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరుగనున్నదని భావించబడినప్పుడో, జాప్యం జరుగకుండా వెంటనే సుప్రీంకోర్టుకు నేరుగా తెలియజేయవలసి ఉంది.

అయోధ్యలో డిసెంబరు 6న ప్రారంభం కానున్న కరసేవ స్వరూప స్వభావాలు ఉండబోతాయనే విషయంలో బీజేపీ, వీహెచ్‌పీ నాయకత్వంలోని కొందరిలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నంగా సుప్రీంకోర్టు నవంబరు 29న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కె.కే.వేణుగోపాల్‌ను సంబంధిత అధికారులకు కరసేవ అంటే నిర్మాణ కార్యక్రమం కాదని తెలిసివచ్చే విధంగా వివరణను ప్రకటించవలసిందిగా సలహానివ్వమని చెప్పటం జరిగింది. పరిస్థితిని సమీక్షించేందుకు ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబరు 30న కోర్టు తిరిగి సమావేశమయ్యింది. అది కోర్టు పరిశీలకుని టెలిఫోన్‌ నివేదికను చర్చించింది. తర్వాత నవంబరు 28 నాటి ఉత్తర్వులను పురస్కరించుకొని డిసెంబరు 6న ప్రారంభించే కరసేవను అనుమతిస్తూ అది ఏవిధంగా నిర్వహింపబడాలనే విషయంలో చేయవలసిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అంగీకార పత్రంలోని విషయాలు సక్రమంగా అమలయ్యేట్లు చూచేందుకుగాను 1992 డిసెంబరు 6న తలపెట్టిన కరసేవలో ఎటువంటి నిర్మాణ కార్యక్రమానికి తావుండరాదని, సేకరించిన స్థలంలో నిర్మాణ సామగ్రిని తరలించరాదని ప్రభుత్వం తగిన ప్రచారాన్ని చేయటం సహజమూ, శ్రేయోదాయకమూ కాగలవు, అటువంటి ప్రచారం సంబంధించిన వారందరికి చేరేట్లయితే వాళ్లక్కడ సమావేశం అయ్యేందుకు ఏదైనా ప్రయోజనాన్ని ఆశిస్తే దాని పరిమితులేవో వారికి తెలియవస్తుంది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo