ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Sep 02, 2020 , 23:56:48

కరసేవకులపై బలప్రయోగం చేయం

కరసేవకులపై బలప్రయోగం చేయం

ఏడో అధ్యాయం కొనసాగింపు..

యూపీ అటార్నీ జనరల్‌  వేణుగోపాల్‌కు కోర్టు వివరించిందేమంటే.. కోర్టు ఆజ్ఞలను ఉల్లంఘించే పరిస్థితులను అనుమతించబోమని హామీ పడాలని. ఆ నేపథ్యంలోనే.. తరువాత కోర్టు ఈ విధమైన ఉత్తర్వును జారీచేసింది:

ప్రజ్ఞాశాలి అటార్నీ జనరల్‌ పరిస్థితిలోని తీవ్రతను మా దృష్టికి తెచ్చిన రీత్యా, రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు మంజూరు చేయటం సమంజసం కాదు. కోర్టు ఉత్తర్వులకు భంగం వాటిల్లే విధంగా వాస్తవాలను తారుమారు చేయకుండా మత సముదాయాలతో చర్చలు ప్రభుత్వం జరుపుతుందనే ఖచ్చితమైన హామీని, లక్ష్యంలోని నిజాయితీని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవహారాన్ని శుక్రవారం సాయంత్రం 2 గంటల వరకు వాయిదా వేయటం సమంజసంగా ఉంటుందనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మత సంఘాలను సంప్రదించి హైకోర్టు ఉత్తర్వులు యిచ్చేంతవరకుగాని లేదా భవిష్యత్తులో ఓ హేతుబద్ధ సమయం వరకుగాని కరసేవను నిలిపివేయవలసిందిగా నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తుందని శ్రీ వేణుగోపాల్‌ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదయినా నిర్మాణాత్మక ప్రతిస్పందన లభించే పక్షంలో రాష్ట్రప్రభుత్వం మతవర్గాలను సంబాళించటంలో తగిన మద్దతునివ్వవలసి వచ్చే పక్షంలో హైకోర్టుకు ఆ వ్యవహారంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోమని కోరే విషయాన్ని పరిశీలించవచ్చును.

అదేరోజు నవంబరు 26న కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. నవంబరు 27, 28 తేదీలలో అయోధ్యకు కరసేవకులను పెద్ద సంఖ్యలో తరలిరమ్మని వీహెచ్‌పీ పిలుపునివ్వటంతో, సుప్రీంకోర్టు ఆ విషయంలో జోక్యం చేసుకోబోవటంతో మందిరం వ్యవహారం ఒక ‘కీలక దశకు చేరుకుందని నేను చెప్పాను. కరసేవ ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు; రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కోర్టు జోక్యాన్ని జాప్యం చేసి, వివాదం శాంతియుతంగా పరిష్కారమయ్యే పద్ధతిని ధ్వంసం చేసేట్లుగా కన్పిస్తుంద’ని నేను ఆ సమావేశంలో చెప్పటం జరిగింది.

ఆ తరువాత రోజు నవంబరు 27న ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ను ఇంట ర్వ్యూ చేసి ప్రచురించింది. అందులో ‘అయోధ్య వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే కేంద్రం పారా మిలటరీ బలగాలను పంపి, విషయాన్ని మరింత జటిలం చేసింది’ అంటూ ఆయన దుయ్యబట్టారు.

‘అవసరం లేని సందర్భంలో అంత పెద్ద ఎత్తున బలగాలను పంపటంలోని తొందరపాటును నేను అర్థంచేసుకోలేకపోతున్నాను. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఇది వాతావరణాన్ని ఖరాబు చేసింది’ అని ఆయన అన్నారు. కేంద్రం ఎత్తుగడ దాని ప్రతిఘటనా ధోరణిని సూచిస్తుంది. ఆ ప్రతిఘటన కేవలం యూపీ, రాష్ట్ర ప్రభుత్వాల పట్లనేగాదు; రాజ్యాంగపు ఫెడరల్‌ స్వభావం పట్ల, ప్రజాస్వామిక సంస్థలపట్ల, దేశపు ప్రజల పట్ల కూడ’ అని కల్యాణ్‌సింగ్‌ వక్కాణించారు. ఆయన ప్రభుత్వాన్ని రద్దుచేసే అవకాశం ఏమయినా ఉందా అని అడిగినప్పుడు ‘లేనే లేదు’ అన్నారు. ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఏమయినా ఉంటే అది కేంద్రానికి ఆత్మహత్యాసదృశం కాగలదన్నారు.

తమ వాదనను సమర్థించుకుంటూ ఆయన తమ ప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు తగిన కారణం లేదన్నారు. అది ప్రజాస్వామిక పద్ధతిన ఎన్నుకోబడిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా విధులను నిర్వహిస్తున్నది. ప్రజా సంక్షేమానికి అది తన శాయశక్తులా కృషిచేస్తుంది. శాంతిభద్రతల పరిస్థితి సహజంగానే ఉంది. కనుక ఎటునుంచి చూసినా ప్రభుత్వానికి వంకబెట్టే వీలులేదు. పారా మిలటరీ దళాల్ని పంపినందువల్ల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.. అని అన్నారాయన. కేంద్రం సైన్యాన్ని కూడ అప్రమత్తం చేసింది. పంజాబ్‌, ఢిల్లీ, అస్సాంల నుంచి 75 కంపెనీల కేంద్ర రిజర్వు పోలీసు దళాలను తరలించేందుకు ఆదేశాలు జారీచేయటమేగాక సరిహద్దు భద్రత దళాలను కూడ స్వల్పకాలిక ఆదేశాలపై తరలివెళ్ళేందుకు సిద్ధం చేసింది. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మీరట్‌లోని తన ప్రధాన కార్యాలయం వద్ద సిద్ధంగా ఉంది. కేంద్ర బలగాలకు చెందిన 15మంది ఉన్నత అధికారులు కొద్ది రోజుల క్రితం వ్యూహ రచనకై సమావేశమయ్యారన్న సమాచారాన్ని కల్యాణ్‌సింగ్‌ బయల్పరిచారు. కేంద్రం 300కు పైగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సులను కేంద్ర రక్షక దళాలకు చెందిన వారిని చేరవేసేందుకు అద్దెకు తీసుకోవటం జరిగిందని నమ్మబలికారు.

వివాదంలో ఉన్న కట్టడానికి రక్షణ కల్పిస్తామనే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి అయోధ్యలో రక్షణ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టటం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను గౌరవించేందుకు కట్టుబడి వున్నా డిసెంబరు 6న ప్రారంభం కానున్న కరసేవను నిలువరించేందుకు బలప్రయోగానికి సిద్ధంగా లేదన్నారు. అలా చేసినట్లయితే దేశమంతటా శాంతిభద్రతల సమస్య తలెత్తగలదనే కారణాన్ని చూపెట్టారు. సమస్య చాలా ఉద్రిక్తపూరితంగా ఉంది. దానికి పరిష్కారం సహకారం ద్వారా లభించాల్సిందేగాని సిగపట్ల ద్వారా కాదన్నారు. హైకోర్టు వ్యవహారాన్ని విమర్శిస్తూ కల్యాణ్‌సింగ్‌ చెప్పిందేమంటే రాష్ట్ర ప్రభుత్వ కృషి కారణంగా సమస్యకు పరిష్కారం లభించబోతున్నది. అయితే కేసు పరిష్కారంలో అలహాబాద్‌ హైకోర్టు జాప్యం చేసినందువల్ల ప్రతిష్టంభనకు దారితీసిందని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు హియరింగ్‌కు చివరి రోజుగా నవంబరు 27ను ఖరారుచేసినా పిటిషనర్లు నవంబరు 26న నిర్బంధ ఉత్తర్వులు కోరటం జరిగింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు గోవింద ముఖోటీ, ఓ.పీ.శర్మలు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రికలో తొలి పేజీలో ప్రచురింపబడిన వీహెచ్‌పీ నాయకులు పి.యన్‌.సింగ్‌తో ఇంటర్వ్యూను కోర్టు దృష్టికి తెచ్చారు. అందులో వీహెచ్‌పీ కరసేవకుల్ని అయోధ్య పంపటాన్ని ప్రారంభించినట్లున్నూ కరసేవ కార్యక్రమం ముందుకు జరిగే అవకాశం ఉన్నట్లున్నూ తెలియజేయబడింది. హిందూస్థాన్‌ టైమ్స్‌లో బీజేపీ ఉపాధ్యక్షులు క్రిషన్‌ లాల్‌ శర్మ ఎట్టి పరిస్థితులలోనూ కరసేవను ఆపటం జరగదని చెప్పినట్లు వార్త ప్రచురించబడింది. దానిని కూడా కోర్టు దృష్టికి తీసుకురావటం జరిగింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo