శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Sep 02, 2020 , 23:56:47

బాలింతలకు బలం

బాలింతలకు బలం

పథకాలతోపాటు సంస్కరణలు చేపట్టడంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. తెలంగాణ ప్రభుత్వం కాన్పుల నిర్వహణలో అనుభవం కోసం నర్సులకు ప్రత్యేక ప్రసూతి వైద్య సహాయక విజ్ఞాన శిక్షణ ఇప్పించింది. ఏఎన్‌ఎంలు గ్రామస్థాయిలో పెద్ద ఆపరేషన్లు కాకుండా సాధారణ పద్ధతిలో ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రసూతి మరణాల సంఖ్య తగ్గించుకోవడానికి తమిళనాడుకు 15 ఏండ్లు పట్టింది, కానీ తెలంగాణ ఈ సమస్యను 15 నెలల్లోనే అధిగమించింది. త్వరలోనే అతి తక్కువ బాలింత మరణాలలో రాష్ట్రం మొదటి ర్యాంకులో ఉండనున్నదనడంలో అనుమానం అవసరం లేదు.

మాతాశిశు ఆరోగ్య సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆదర్శవంతంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో, సంకల్పబలంతో అనుసరిస్తున్న విధానాలు ఫలితమిస్తున్నాయి. ఇందుకు బాలింత మరణాల కట్టడి అంశం మరో తాజా ఉదాహరణ. బాలింతల మృత్యువాత అనేది ఒకప్పుడు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఒకటి. ఇప్పుడు బాలింత మరణాల కట్టడిలో తెలంగాణకు నాలుగో ర్యాంకు అనే వార్తను చూస్తున్నాం. ఈ పరిణామానికి కారణం ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, చేపట్టిన పథకాలే అనేది సుస్పష్టం. తెలంగాణ రాష్ట్రం సుస్థిరమైన అభివృద్ధి దిశగా ఐక్యరాజ్యసమితి పెట్టిన లక్ష్యాలను విజయవంతంగా సాధించింది. బాలింతల మరణాల రేటును ప్రతి లక్ష జననాలకు 70 లోపు ఉండే ప్రయత్నం చేయాలని సూచించగా, రాష్ట్రం 2014లో 92 నుంచి ఇప్పుడు 63కు తీసుకురావడం గర్వించదగ్గ విషయం. బాలింతల మరణాలు సున్నాకు రావాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని త్వరలోనే సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరు ప్రభావం, మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, మెరుగుపడుతున్న ఆరోగ్య వ్యవస్థ వల్లనే ఇలాంటి ఫలితాలొస్తున్నాయి.

బాలింతల మరణాలకు ప్రధాన కారణాలుగా చిన్న వయసులో వివాహం, పౌష్టిక ఆహారం దొరకకపోవడం ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సమీక్ష సమావేశాల్లో ఆహారభద్రతను సాధించడం గురించి మాట్లాడినప్పుడు పౌష్టిక ఆహార అవసరాల గురించి నొక్కి చెప్తున్నారు. నియంత్రిత సాగు కూడా పౌష్టిక ఆహార లభ్యతను కల్పిస్తుందని పలుమార్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచకపోయినా ప్రభుత్వం 2 అక్టోబర్‌ 2014న 18 ఏండ్లు దాటిన అమ్మాయిల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలులోకి తెచ్చింది. మొదట 51వేలు ఆర్థిక సహాయం చేయగా, ఆ తర్వాత దానిని 75116కు పెంచింది. 2018 నుంచి లక్షా నూటపదహార్లు ఇస్తున్నది. దీనితో తల్లిదండ్రులు 18 ఏండ్లలోపు బిడ్డలకు పెండ్లి చేయడం ఆపేశారు. అలా చిన్న వయసులో వివాహాలు తగ్గడం కూడా బాలింతల మరణాల సంఖ్య తక్కువ కావడానికి దోహదపడుతున్నది. 

మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. పుట్టిన శిశువు రోగనిరోధకతకు, పోలియో నివారణకు గత నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం 275 కోట్లు ఖర్చు పెట్టింది. ‘అమ్మ ఒడి’, ‘కేసీఆర్‌ కిట్‌' పథకాలను ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించే తల్లులకు 2100 విలువగల అవసరమైన వస్తువులు ఇస్తున్నారు. ఇంతేకాకుండా ప్రభుత్వం మూడు విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. అబ్బాయి పుడితే 12000, అమ్మాయి పుడితే 13000 రూపాయలు. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యేవరకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం, కాన్పు అయ్యాక తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు అమ్మ ఒడి పథకంలో నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి 561 కోట్లు కేటాయించారు. ఈ పథకం పరిశీలనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్‌ రాష్ట్రం కూడా తన వైద్యబృందాన్ని తెలంగాణకు పంపించింది. గుజరాత్‌ రాష్ట్ర ఆరోగ్య సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉపేంద్రగాంధీ.. కేసీఆర్‌ కిట్‌ అద్భుతమని, తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు భేష్‌ అని కితాబిచ్చారు.

నీతిఆయోగ్‌ జిల్లాలవారీ దేశవ్యాప్త సర్వే రిపోర్టులో ఏజెన్సీ ఏరియా అయినటువంటి భద్రాద్రి- కొత్తగూడెంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాలను అభినందించింది. కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ .. కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ అన్నారు. ఒకప్పుడు సర్కారు దవాఖానలకు పోము అన్నరోజులున్నాయి. ఈరోజు ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరుగడం కనిపిస్తున్నది. వీటికితోడు బస్తీ దవాఖానలకు కూడా విశిష్ట ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం 197 బస్తీ దవాఖానాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటి సంఖ్యను 300కు పెంచుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవలే ప్రకటించారు.

పథకాలతోపాటు సంస్కరణలు చేపట్టడంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. దేశంలో ఎప్పటినుంచో ఏఎన్‌ఎం వ్యవస్థ ఉన్నా, అంతగా శిక్షణ లేదు. తెలంగాణ ప్రభుత్వం కాన్పుల నిర్వహణలో అనుభవం కోసం నర్సులకు ప్రత్యేక ప్రసూతి వైద్య సహాయక విజ్ఞాన శిక్షణ ఇప్పించింది. ఏఎన్‌ఎంలు గ్రామస్థాయిలో పెద్ద ఆపరేషన్లు కాకుండా సాధారణ పద్ధతిలో ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రసూతి మరణాల సంఖ్య తగ్గించుకోవడానికి తమిళనాడుకు 15 ఏండ్లు పట్టింది, కానీ కేసీఆర్‌ దృఢ సంకల్పం వల్ల తెలంగాణ ఈ సమస్యను 15 నెలల్లోనే అధిగమించింది. ఇదే విధంగా త్వరలోనే అతి తక్కువ బాలింత మరణాల రాష్ట్రంలో మొదటి ర్యాంకులో ఉండనున్నదనడంలో అనుమానం అవసరం లేదు.

(వ్యాసకర్త: సోషల్‌ మీడియా కన్వీనర్‌, టీఆర్‌ఎస్‌)


logo