సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Sep 02, 2020 , 10:03:16

పాలకుల దక్షతకు పరీక్ష

పాలకుల దక్షతకు పరీక్ష
  • ఏడో అధ్యాయం కొనసాగింపు..


రామజన్మభూమి- బాబ్రీమసీదు విషయంలో కోర్టులు చెప్పిన విషయాల పట్ల రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవటం వివాదంలో అడుగడుగునా కనిపిస్తుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కరసేవ ప్రారంభిస్తామన్న హిందుత్వవాదుల ప్రకటనలూ జోరందుకున్నాయి. నవంబరు 24న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావటంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా కరసేవ పునఃప్రారంభం కావాలనే బెదిరింపు వల్ల ఉత్పన్నం కానున్న ఘర్షణ విషయం తొలిరోజునే పార్లమెంటు దృష్టికి తీసుకురాబడింది. లోక్‌సభలో బీజేపీ స్పష్టం చేసిందేమంటే.. వివాదంలో ఉన్న కట్టడం విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన 2.77 ఎకరాల స్థలంలో మందిర నిర్మాణంతో ముడిపెట్టరాదన్నారు. అయినా సీపీఎం, సీపీఐ, జనతాదళ్‌, సమాజ్‌వాదీ జనతాపార్టీ వంటి ప్రధాన ప్రతిపక్షాలన్ని దాని వైఖరిని పునరాలోచించుకోవలసిందిగా కోరాయి.

బీజేపీ మందిరం విషయంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటుందనీ అప్పటివరకు ఆ కట్టడం జోలికి పోబోమనీ, ఆ విధంగా సమస్య శాంతియుతంగా పరిష్కరింపబడేందుకు సహకరిస్తామనే స్పష్టమైన హామీని బీజేపీ నుంచి గతంలో ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్‌ (యస్‌జేపీ) కోరారు. సమస్యను ఇంకా జటిలం చేసేట్లయితే దేశం ఎంతో మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. అప్పుడు యల్‌.కే. అద్వానీగారు ‘ఆ కట్టడానికి భద్రత కల్పిస్తాం’ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి యిచ్చిన రెండు రోజుల గడువు ముగిసిన తరువాత నవంబరు 25న తిరిగి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార ఆరోపణపై వాదనలు వినసాగింది. భారత అటార్నీ జనరల్‌ మిలన్‌ బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు వాయిదా వేసినందుకు అభ్యంతరాన్ని తెలియజేశారు. అయోధ్యలో పరిస్థితి కుతకుతలాడే దశకు చేరుకున్నదని, కోర్టులో కూడా ఎడతెగకుండా నడిచే వ్యవహారం దృష్ట్యా కరసేవను నిలిపివేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఉండాల్సిందన్నారు. గూఢచారి శాఖ నివేదికలవైపు దృష్టి మరల్చి అయోధ్యలో పరిస్థితి గరిష్ఠ స్థాయికి చేరుకుందని ఒక్కరోజు వాయిదా కూడా తీరని నష్టాన్ని కల్గించే ప్రమాదం ఉందని హెచ్చరించటం జరిగింది. కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వానికి కేంద్రం చేయగలిగిన సాయమంతా చేస్తుంది; కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోబోదుగాని కోర్టు ఉత్తర్వులు అమలయ్యేట్లు చూచేందుకు రాజ్యాంగ విధుల్ని పాటించేందుకు వెనుకాడబోదు అని కూడా ఆయన ప్రకటించారు. యూపీ హోంశాఖ స్పెషల్‌ సెక్రటరీ శేఖర్‌ అగర్వాల్‌ తమ వాంగ్మూలంలో ఒకవైపు కోర్టు ఉత్తర్వుల్ని శిరసావహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుందని తెలియజేస్తూనే కరసేవను ఆపేందుకు బలగాలను వాడటం తగిన పద్ధతి కాదనటాన్ని కూడ ఆయన ఎత్తిచూపారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం కోర్టు అన్ని పక్షాల వాదనలను దృష్టిలో ఉంచుకొని సమగ్రమైన ఈ క్రింది ఉత్తర్వులు జారీచేసింది: సమాధానంగా వేణుగోపాల్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ హోంశాఖ స్పెషల్‌ సెక్రటరీతో ఒక వాంగ్మూలం సమర్పింపజేయటం జరిగింది. అది ఈ విధంగా ఉంది: సేకరించిన స్థలంలో కరసేవ పునఃప్రారంభానికి పిలుపునివ్వటంతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను గూర్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆతురతను కనబర్చుతున్నది. కోర్టు ఆజ్ఞల ఉల్లంఘనలను అడ్డుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. అది తన బాధ్యతగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది.

అటు పిమ్మట కొన్ని సున్నిత, సూక్ష్మగ్రాహ్య అంశాలుగా పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిగణించే విషయాలలో బలగాలను ఉపయోగించాలనే నిర్ణయం మరింత దారుణమైన పరిస్థితికి దారితీయవచ్చుననీ, సరిదిద్దలేని విపరీత పరిణామాలకు దారితీయవచ్చుననే భావనతో ఆ వాంగ్మూలంలో ఇంకా ఇలా చెప్పబడింది. ‘కనుక యూపీ రాష్ట్ర ప్రభుత్వం వీహెచ్‌పీ నాయకులతోనూ, ధర్మసంసద్‌ నేతలతోనూ సరాసరి చర్చలు చేపట్టదలచింది. కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించకుండా మతపరమైన కోర్కెల సాధనకు మార్గాన్ని అన్వేషింపజూస్తుంది. ఇదంతా ఫలితాన్ని కోర్టుకు నివేదించేందుకు ప్రభుత్వానికి కనీసం ఒక వారం సమయం పట్టవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోర్టు ఉత్తర్వుల్ని కట్టుదిట్టంగా అమలుపరిచేందుకు హామీ లభించనట్లయితే సరయిన పద్ధతిలో వారినుంచి విధేయతను ఆశించటమేగాకుండా బలవంతంగా విధేయతను పొందటం కూడ రాజ్యాంగం మాకు సంక్రమింపజేసిన బాధ్యత. ఈ రకమైన చర్య రాజ్యాంగపరమైన సంస్థల ప్రయోజనాన్నీ, ఐక్యతాభావాన్ని వాటి మధ్యగల పరస్పర సంబంధాలను పటిష్టపరచటం ద్వారా రాజ్యాంగబద్ధంగా భారత ప్రజలు మనగలిగేందుకు తగిన అవకాశాన్ని కల్గించగలదని మా భావన.

వేణుగోపాల్‌ మా ఆందోళనలో భాగస్వామై తమ ఆశాభావాల్ని- ఆయన ఆ తరుణంలో అంతకుమించి చేయగలిగింది లేక- వెల్లడించడం జరిగింది. ఒక వారం గడువిస్తే ప్రభుత్వం మత సంస్థలతో చర్చించి, ఘర్షణను నిలువరించేందుకు వారిని ఒప్పించి పరిస్థితిని సహేతుకంగా అర్థంచేసుకునేట్లు చేయగలదు అన్నారు. మా కోరికపై కోర్టులో హాజరైన ప్రజ్ఞాశాలి అటార్నీ జనరల్‌, పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలియజేసిన ప్రకారం పరిస్థితి అప్పటికే చేయిదాటిపోతున్నదనీ ఇంకేమాత్రం జాప్యంచేసినా దాన్ని అదుపు చేయటం కుదరదని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఏ చర్య ఉచితమూ, ఆమోదయోగ్యమయినది అని తోచినట్లయితే ఆ విధమైన చర్య చేపట్టే స్వేచ్ఛ దానికున్నది. శ్రీ వేణుగోపాల్‌ విన్నపాలలో పరిస్థితి మనోద్వేగాలతో దట్టించబడివున్నదనే విషయాన్ని మేము గ్రహించాం; ఇటువంటి సమయాల్లోనే పాలనాపగ్గాలను చేబూనినవారి దక్షత పరీక్షకు నిలిచేది. వాళ్ళు రాజనీతిజ్ఞతను ప్రదర్శించి వ్యవహారం రాజ్యాంగపరమైన సంస్థల విధ్వంసానికి దారితీయకుండా సామాజిక భాగస్వామ్యం దెబ్బతినకుండా చూడవలసి ఉంటుంది. ఏదిఏమయినా శ్రీ వేణుగోపాల్‌కు వివరించి చెప్పదలిచిందేమంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆజ్ఞలను ఉల్లంఘించే పరిస్థితులను అనుమతించబోమనే వైఖరితో కోర్టుకు తిరిగి హామీనివ్వలేకపోతే మేము 1ఎ నం.5 లోని విన్నపాలను పరిశీలించి రిసీవరును నియమించటమో లేక కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఉత్తర్వులు అమలయ్యేట్లు చూడమని కోరటమో చేయవలసి ఉంటుంది. కనుక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం కోర్టుకు మార్గాంతరం లేక ఆ విధమైన నిర్ణయం తీసుకునేట్లు చేయదనే విశ్వసిస్తున్నాం.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo