ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 31, 2020 , 23:00:36

సంక్షోభ నిర్వాహకుడు

సంక్షోభ నిర్వాహకుడు

మాజీ రాష్ట్రపతి, సుదీర్ఘ అనుభవం గల రాజకీయవేత్త, పరిపాలనాదక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ మరణం అత్యంత విచారకరం. క్యాబినెట్‌ మంత్రులుగా దీర్ఘకాలం సమర్థతను నిరూపించుకొని అత్యున్నత  శ్రేణికి ఎదిగిన, రాజకీయవేత్తలలో ఒకరు పీవీ నరసింహారావు అయితే, మరొకరు ప్రణబ్‌ ముఖర్జీ. రాజకీయ దురంధరుడైన ప్రణబ్‌ చిన్న వయసులోనే ప్రపంచంలోని ఉత్తమ ఆర్థికమంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. రక్షణ, ఆర్థికం, విదేశాంగం వంటి ఏ శాఖ అయినా ఎంతో బాధ్యతతో, సమర్థతతో నిర్వహించారాయన. ఎన్ని విభేదాలున్నా, పీవీ వలెనే రాజకీయ విభేదాల కు అతీతంగా మన్ననలు పొందిన ప్రణబ్‌ దేశ విధాన రూపకల్పనలో కొన్ని దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారు.

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణబ్‌ నిర్వహించిన పాత్ర మరింత విస్తృతమైనది. సోనియాగాంధీ తెరచాటు నుంచి సర్వం శాసిస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా పాలనా నిర్వహణ సాధ్యం కాదు. మన్మోహన్‌ ఆర్థికవేత్త అనే అర్హతతో ప్రధాని అయ్యారే తప్ప పరిపాలన అనుభవం లేదు. దీంతో ప్రణబ్‌పైనే పాలన భారం పడింది. ప్రధాని కాకున్నా లోక్‌సభలో సభానాయకుడు ఆయనే. ఏ సంక్షోభం వచ్చినా ఆయనకే అప్పగించేవారు. దీంతో ఆయనకు సంక్షోభ నిర్వాహకుడిగా గుర్తింపు వచ్చింది. ఒక దశలో ఆయన 95 మంత్రివర్గ కమిటీలకు సారథ్యం వహించారం టే ఎంత భారం మోయవలసి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2009లో మళ్ళీ యూపీఏ అధికారానికి వచ్చినప్పుడు ఆయనకు ప్రధాని పదవి దక్కుతుందని ఆశించారు. కానీ కారణాలేవైనా మళ్ళీ మన్మోహన్‌సింగ్‌జీనే కొనసాగారు. దీంతో ఈ విశేష పాలనాదక్షుడికి న్యాయం జరగాలంటే రాష్ట్రపతి పదవే మిగిలింది!

తెలంగాణ ఏర్పాటు కమిటీకి కూడా ప్రణబ్‌ సారథ్యం వహించారు. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగా కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. ఉద్యమ వేడిలో ఉన్న తెలంగాణ సమాజంలో ఇది కొంత అసంతృప్తిని కలిగించింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడే పరిపాలకుడు కావడాన్ని నిండు హృదయంతో ప్రణబ్‌ హర్షించారు. కేంద్ర మం త్రివర్గంలో చేరినప్పుడు కేసీఆర్‌ తెలంగాణ కోసం పడిన ఆరాటా న్ని ఆయన నిష్పాక్షిక వ్యాఖ్యానంలో చూడవచ్చు. భిన్న రాజకీయ భావజాలాలకు చెందిన వారు ప్రణబ్‌ ముఖర్జీని అభిమానిస్తుంటారు. కానీ ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు హాజరుకావడం వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాలనే విధానంగా దీనిని చూడవచ్చు. ఆయన నిర్ణయం వెనుకున్న అప్పటి రాజకీయ పరిస్థితులు భవిష్యత్తులో చర్చానీయాంశాలు అవుతాయి. ప్రణబ్‌ రాజకీయ జీవనయానం రాజకీయవేత్తలకు ఒక అధ్యయనాంశం!   


logo