శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 31, 2020 , 23:00:35

అద్వితీయుడు ప్రణబ్‌

అద్వితీయుడు ప్రణబ్‌

పార్టీలకు అతీతంగా అజాత శత్రువుగా, మహా మేధావిగా, స్టేట్స్‌మెన్‌గా, రాజకీయ కురువృద్ధుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రణబ్‌ ముఖర్జీ చేసిన సేవలు అనన్య సామాన్యాలు, అనితర సాధ్యాలు. ప్రణబ్‌కు యావత్‌ భారత జాతి రుణపడి ఉన్నది.

ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు సమర్థవంతంగా చేపట్టి, పేరు ప్రఖ్యాతులు గడించారు. భారత 13వ రాష్ట్రపతిగా (2012-17) దేశానికి సేవలందించిన ‘భారతరత్న’ ప్రణబ్‌ ముఖర్జీ నిబద్ధతగల ఆదర్శ నాయకుడిగా, ప్రజా సేవకుడుగా తనదైన ముద్ర వేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని భీర్‌భం జిల్లాలోని మిరాటిలోని కమద కింకర్‌ ముఖర్జీ-రాజ్యలక్ష్మిలకు 1935, డిసెంబర్‌ 11న జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతి శాస్త్రం, చరిత్రలలో పట్టాలు పొంది, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించటానికి పూర్వం తంతితపాలా కార్యాలయంలో క్లర్క్‌ ఉద్యోగం, కాలేజ్‌లో లెక్చరర్‌, జర్నలిస్ట్‌ బాధ్యతలను స్వల్పకాలం చేపట్టారు. అనంతరం 1969లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.

అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించి అఖిల జాతీయ కాంగ్రెస్‌లో తన విలక్షణ సేవలను అంది స్తూ, 1969లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. 19 75, 1981, 1993, 1999లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. నెహ్రూ కుటుంబానికి నమ్మిన భంటుగా అనేక సందర్భాల్లో జఠిల సమస్యలను సులభంగా పరిష్కరించే మేధావిగానే కాకుండా ‘మ్యాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీజన్స్‌'గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ (1973-74), షిప్పింగ్‌, రవాణా శాఖ (1974), ఆర్థికశాఖ స్టేట్‌ (1974-75), రెవెన్యూ, బ్యాంకింగ్‌ శాఖ (1975-77), కామర్స్‌ స్టీల్‌, మైన్స్‌ శాఖ (1980-82), ఆర్థికశాఖ (1982-84, 2009-12), కామర్స్‌, సైప్లె శాఖ (1984), వాణిజ్యశాఖ (1993-95), విదేశీ వ్యవహారాల శాఖ (1995-96, 2006-09), రక్షణశాఖ (2004-06)లకు మంత్రిగా సేవలు అందించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, లీడర్‌ ఆఫ్‌ రాజ్యసభ, ప్రపంచ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌, ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌, సార్క్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మినిష్టర్స్‌ అధ్యక్షుడిగా, లీడర్‌ ఆఫ్‌ లోకసభ, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ, పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లాంటి వివిధ బాధ్యతలను నిర్వహించిన ధీరుడు ప్రణబ్‌ ముఖర్జీ.

ప్రణబ్‌ విశిష్ఠ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 20 19లో భారతరత్న పురస్కారంతో సన్మానించింది. దీనికి తోడుగా పద్మ విభూషణ్‌ అవార్డు కూడా ప్రణబ్‌ను వరించింది. అంతర్జాతీయ వేదికలో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌ ఆనర్‌ (2013), నేషనల్‌ ఆనర్‌ ఆఫ్‌ ఐవరీ కోస్ట్‌ (2016), సైప్రస్‌ వారందించిన ఆర్డర్‌ ఆఫ్‌ మకారియోస్‌ (2017) పురస్కారాలను పొందారు. ప్రణబ్‌ ప్రతిభను గుర్తించిన 16కు పైగా దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లను అందించాయి. ప్రపంచ ఉత్తమ ఆర్థికశాఖ మంత్రి (1984), ఏషియా ఉత్తమ ఆర్థికశాఖ మంత్రి (2010), దేశ ఉత్తమ ఆర్థిక శాఖామాత్యులు (2010)గా పురస్కారాలను పొంది దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. అపర చాణుక్యు డు, రాజకీయ దురంధరుడు, ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్‌ ముఖర్జీ పలు పుస్తకాలను రచించారు. తన అపూర్వ రాజకీయ సామాజిక అనుభవాలను జోడించి  మిడ్‌టర్మ్‌ పోల్‌, ఛాలెంజెస్‌ బిఫోర్‌ ది నేషన్‌, థాట్స్‌ అండ్‌ రిఫ్లెక్షన్స్‌, ది టర్బ్యులెంట్‌ ఇయర్స్‌, కోలిషన్‌ ఇయర్స్‌ లాంటి గ్రంథాలను తీసుకువచ్చారు.

1984లో ఇందిరా హత్యానంతరం దేశ ప్రధానిగా అనుభవం లేని రాజీవ్‌గాంధీని వ్యతిరేకించిన ప్రణబ్‌కు ప్రాధాన్యం తగ్గడంతో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించి పరాజయం పాలైనారు. 19 89లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, 1991లో రాజీవ్‌ హత్య అనంతరకాలంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో తిరిగి పార్టీ, ప్రభుత్వంలో తన సత్తా చాటుకున్నారు. 1975-77 ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పదుడిగా పలు విమర్శలు ఎదుర్కొన్నారు. 1998లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష్య స్థానంలో సోనియా గాంధీని ఎన్నుకోవడంతో పాటు నమ్మకమైన ముఖ్య సలహాదారుగా  ప్రధాన భూమిక నిర్వహించారు. సోనియా గాంధీని ప్రధాని గా అంగీకరించని సమయంలో ఆ పదవిని ఆశించి విఫలమైనారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రలో 2004లో పశ్చిమబెంగాల్‌ జంగీపూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోకసభ ఎన్నికల్లో గెలుపొందారు. మాజీ రాష్ట్రపతిగా ఆర్‌ఎ స్‌ఎస్‌ సమ్మేళనంలో తన సందేశమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. 1977లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత జనతా ప్రభు త్వ హయాంలో ‘షా కమిషన్‌' దర్యాప్తును ఎదుర్కొని బయటపడ్డారు. 1982-84 మధ్య కేంద్ర ఆర్థిక శాఖామాత్యులుగా ఐఎంఎఫ్‌ చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌  చెల్లించి దేశ ప్రతిష్ఠను పెంచడమే కాకుండా ఆర్‌బీఐ గవర్నర్‌గా మన్మోహన్‌సింగ్‌ను నియమించిన ఘనత ప్రణబ్‌ది. అత్యున్న త ప్రతిభ, అనుభవం, సంక్లిష్ట ముడులు విప్పే చాతుర్యం కలిగిన ప్రణబ్‌ దా ఆదర్శ నేతగా, ప్రధాని హాజరుకాలేని సందర్భం లో కేబినెట్‌ సమావేశాలకు కూడా అధ్యక్షత వహించారు. జనాకర్షణ కలిగిన నేతగా కొంత విఫలమైనా, అపర మేధావిగా పేరొందిన ప్రణబ్‌, ప్రధానిగా తన చిరకాల వాంఛ తీర్చుకోలేకపోయారు. ఇందిరా, రాజీవ్‌ పాలనలో కోర్‌ కమిటీ సభ్యులుగా ప్రణబ్‌, పీవీ, ఆర్‌ వెంకట్రామన్‌ల త్రయం విశిష్ఠ సేవలు అందించారు. వీరిలో పీవీ ప్రధానిగా, మిగిలిన ఇద్దరు రాష్ట్రపతులుగా పనిచేశారు. పార్లమెంటరీ పరిజ్ఞానం, మానవ సంబంధాలు, చతురత, అపార అనుభవం గుర్తించి ప్రణబ్‌ ను భారత ఉత్తమ పరిపాలనాదక్షుడు-2011 ఆవార్డును తీసుకున్నారు. ధర్మపత్ని సువ్రా ముఖర్జీని 1957లో వివాహమాడి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. డెంగ్‌ గ్జియోపింగ్‌తో స్ఫూర్తిని పొందానని చెప్పుకున్న ప్రణబ్‌కు రీడింగ్‌, గార్డెనింగ్‌, సంగీతాలు హాబీలుగా చెప్పుకున్నా రు. 

ఎంతటి క్లిష్ట సమయంలోనైనా నిబ్బరంగా ఉంటూ, సమస్యలను గట్టెక్కించటం ప్రణబ్‌ దాకే సొంతం. కరోనా సోక డంతో ఢిల్లీ ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం బాధాకరం. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షత వహించా రు. పార్టీలకు అతీతంగా అజాత శత్రువుగా, మహా మేధావిగా, స్టేట్స్‌మెన్‌గా, రాజకీయ కురువృద్ధుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రణబ్‌ ముఖర్జీ చేసిన సేవలు అనన్య సామాన్యాలు, అనితర సాధ్యాలు. ప్రణబ్‌ కు యావత్‌ భారత జాతి రుణపడి ఉన్నది. ప్రణబ్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి మనం సమర్పించే ఘన నివాళి.

(మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అక్షర నివాళి)

డాక్టర్‌ బుర్ర

మధుసూదన్‌ రెడ్డి


logo