శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Aug 31, 2020 , 23:00:34

రాజకీయ పార్శం అక్కర్లేదు

రాజకీయ పార్శం అక్కర్లేదు
  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

కరసేవను, నిర్మాణాన్ని అనుమతించటంతో శ్రీ కల్యాణ్‌సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని న్యాయాధీశులు ఇంకా పరిశీలిస్తూండగానే అచ్చన్‌ రిజ్వీ, మొహమ్మద్‌ అస్లామ్‌ అనే ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది కొత్త ఆదేశాల కోసం కోర్టు ను ఆశ్రయించటం జరిగింది. కరసేవలో పాల్గొనేందుకు 10 లక్షల మంది అయోధ్యకు చేరుకునే అవకాశం ఉందనీ, కనుక దానిని నివారించాలనేది ఆయన అభ్యర్థన. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సందర్భాలను ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ ఫిర్యాదుదారుల మరో న్యాయవాది, కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రిని ఇతరులను కోర్టుకీడ్చేందుకు నియమింపబడిన శ్రీ గోవింద ముఖోటీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే శ్రీ కే.కే.వేణుగోపాల్‌ కోరినవిధంగా కేసును వాయిదా వేసేందుకు సుతరామూ అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలను ఆసరాగా తీసుకొని ఫిర్యాదుదారులకు ‘మొండిచెయ్యి చూపిస్తున్నది’ అన్నారు. అయోధ్యలో సంభవిస్తున్న పరిణామాలకు కోర్టు ఆందోళనను వ్యక్తపరుస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ యన్‌.వెంకటాచలయ్య, జస్టిస్‌ జీ.యన్‌.రేలు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకునేదీ లేనిదీ కే.కే.వేణుగోపాల్‌ను తేల్చి చెప్పమన్నారు. ఆ న్యాయవాది తత్సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని కోర్టుకు నవంబరు 25న తెలియజేస్తామన్నారు.

ఇదిలా ఉండగా వేణుగోపాల్‌ సుప్రీంకోర్టును ఓ విషయం అభ్యర్థించటం జరిగింది. సేకరించిన 2.77 ఎకరాల స్థలం విషయంలో వాదప్రతివాదనల్ని విన్న అలహాబాద్‌ హైకోర్టు బెంచి రిజర్వ్‌ చేసి ఉంచిన తీర్పును త్వరలో వెలువరించమనేదే ఆ అభ్యర్థన. కనీసం హైకోర్టు ఒక డిక్రీ అయినా ఇచ్చి ఉండాల్సిందన్నారాయన. స్థల సేకరణ న్యాయసమ్మతమా కాదా అని తేల్చేతీర్పుకూ, అయోధ్యలో జనం గుమిగూడటానికి సంబంధం లేదని ఆయన మళ్లీ చెప్ప టం జరిగింది. ఆ న్యాయవాది ఇంకా ఏమన్నారంటే ఆ స్థలం రామజన్మభూమి శిలాన్యాస్‌ ట్రస్టుకు సంబంధించినటువంటిది. మందిర నిర్మాణం తప్పక జరిగేట్లు చూసేందుకు ఆ ట్రస్టు స్థాపింపబడింది. సుప్రీంకోర్టు హైకోర్టును ఆ విషయంలో తీర్పును వేగవంతం చేయమని కోరినా, హైకోర్టు అన్ని కేసుల మాదిరే దానిని చూసింది అంటూ తమ విచారాన్ని వెలిబుచ్చారు. శ్రీ కే.కే.వేణుగోపాల్‌. ఈపాటికి హైకోర్టు తీర్పు వెలువడి ఉన్నట్లయితే ‘ఈ రాజకీయ సంక్షోభం ఉండేది కాదు’ అన్నారు ఆ న్యాయవాది. కోర్టుకు న్యాయపరమైన చిక్కులతోనే పనిగాని రాజకీయపరమైన వాటితో కాదని న్యాయమూర్తులు గుర్తుచేశారు.

అయోధ్యలో జూలై నాటి సంఘటనలు పునరావృతం కారాదని సొలిసిటర్‌ జనరల్‌ స్పష్టం చేశారు. సేకరించిన స్థలంలో జనసమీకరణ గానీ, నిర్మాణ కార్యక్రమం గానీ నిర్వహించబడరాదన్నది కేంద్ర ప్రభుత్వ కృత నిశ్చయం అని ఆయన ప్రకటించారు. అయోధ్యలోని వివాదంలో ఉన్న కట్టడం వద్దకు కట్టుబడి సామగ్రిని యంత్రాలనుగాని చేర్చేందుకు అనుమతినివ్వరాదని ఆయన కోర్టుకు విన్నవించారు. ‘వ్యవహారం రోజురోజుకూ ముదిరి పాకాన బడుతున్నది’ అని కోర్టుకు సమాచారాన్నందిస్తూ ఆక్షేపణకరమైన పరిస్థితి తలెత్తకుండా జరూరుగా తగిన ఉత్తర్వులివ్వవలసిందిగా కోరటం జరిగింది. తను ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్న విషయాన్ని అంగీకరించక న్యాయాధీశులు పేర్కొన్నదేమంటే- ‘రాజకీయ పక్షాలు ఎంతటి శక్తివంతమైనవయినా ఇటువంటి దానిని జరగనిస్తే మనం నిష్ప్రయోజకులమైనట్లే’ జస్టిస్‌ వెంకటాచలయ్య కే.కే.వేణుగోపాల్‌నుద్దేశించి ఇలా అన్నారు. ఇప్పుడు గణించేందుకు సమయం ఆసన్నమయ్యింది. ‘రాజకీయపార్టీల అలక్ష్యం ప్రజాస్వామిక వ్యవస్థను బలహీనపరుస్తుందని మీరు భావించరా? జరిగింది చాలు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక  జారీచేశారు.

రాష్ట్ర ప్రభుత్వపు అలక్ష్యతవైపు దృష్టిసారిస్తూ ‘మేము రాజకీయ పార్శం జోలికి పోము. రాజకీయపార్టీలు ఏం చేయాలనుకుంటే అది చేస్తాయి. మా ఉత్తర్వుల్ని పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గైకొన్న చర్యలేమిటనేదానితోనే మాకు పని. ఇది ఒక జాతీయ సమస్య అని పేర్కొంటూ కే.కే.వేణుగోపాల్‌ ఈ విధమైన వివాదం రంగం పైకి అసలు రావల్సింది కాదన్నారు. జన సమీకరణ విషయంలోగాని మందిర నిర్మాణం విషయంలోగాని ఈ ఫిర్యాదుదారులకు కోర్టు ఉత్తర్వులు పొందేందుకుగాని అసలు జోక్యం చేసుకునేందుకుగాని హక్కు లేదన్నారు. జస్టిస్‌ వెంకటాచలయ్య మళ్లీ ఆయనతో న్యాయపరమైన నిర్వహణాక్రమమేదీ ఏవిధమైన ఒత్తిడితోనూ బంధింపబడజాలదని అన్నారు. న్యాయవాది అందుకు కోర్టు జూలై 15న ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ గావించటం వంటి సాధారణ విషయంపై దేశం అలా ఉత్తేజాన్ని పొందవలసిన అవసరం లేదని ప్రకటిస్తూ కోర్టు అంతకుముందు జారీచేసిన ఆదేశాలను పునఃపరిశీలించవలసినదిగా కోరుతూ పిటీషను దాఖలు చేసినట్లు తెలియజేశారు.

అయోధ్యలో రామాలయం నిర్మించాలా లేదా అన్న విషయంలో కోర్టు ప్రమేయం లేదు. కోర్టు దాని హూందాతనం విషయంలో ఆందోళన చెందవలసి వస్తున్నది. ఆ సమస్యను పరిష్కరించమని ఎవ్వరూ కోర్టును కోరలేదన్నా రు జస్టిస్‌ వెంకటాచలయ్య. 

కేంద్ర ప్రభుత్వ వైఖరి విషయంలో ప్రశ్నకు బదులు పలుకుతూ కేంద్రం యూపీ ప్రభుత్వంతో కూర్చొని చర్చించి దానికేం సాయం కావాలో తెలుసుకుంటుందన్నారు శ్రీ దీపాంకర్‌ గుప్తా. సుప్రీంకోర్టుపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ శ్రీ దీపాంకర్‌ గుప్తా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని అందరూ గౌరవించి తీరాలనేదే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతోగాని వేరొక సంస్థతోగాని ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయనటంలో వాస్తవం లేదన్నారు. బాబ్రీ మసీదు పోరాట కమిటీ, విశ్వహిందూ పరిషత్‌ మధ్య చర్చలు ఇదివరకే విఫలమైనవిగదా అని ఆయన అన్నారు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo