గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 30, 2020 , 23:19:14

ప్రాచీన పునాదిపై ఆధునిక చింతన

ప్రాచీన పునాదిపై ఆధునిక చింతన

  • ప్రధాని పీవీ ‘ఆంధ్ర జనతా’ పత్రికలో రాసిన వ్యాసం. 

ప్రధాని పీవీ ఏ అంశంపై ప్రసంగించినా, రాసినా భిన్న పార్శాలను స్పర్శిస్తూ నూతన సత్యాలను ఆవిష్కరిస్తారు. దేశ సమైక్యత గురించి రాసిన ఈ వ్యాసంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమైక్యత పటిష్ఠంగా ఉందంటూ అందుకు ఉదాహరణలను ఇచ్చారు. రాజకీయ సమైక్యతను గూర్చి వివరిస్తూ రాజ్యాంగ సవరణలు ఎన్ని జరిగాయనేది సాంఘిక పరిణామ వేగానికి సూచిక అనే కొత్త భావనను ప్రతిపాదించారు. సందర్భం వచ్చినప్పుడు జాతి యావత్తూ విభేదాలను అధిగమించి ఏకతాటిపై నిలుస్తుందనడానికి చైనా దురాక్రమణ సందర్భంలో ప్రజల స్పందనను ప్రస్తావించారు. ‘ఉన్నత పదవులనధిష్టించిన చాలామంది తమ ప్రత్యేక వర్ణానికీ, వర్గానికీ ఏదో రకంగా ఉపకారం చేయాలన్న ధోరణి కలిగి ఉన్నట్లు, నేడు ఒక పర్యాప్తమైన జన సామాన్య విశ్వాసాల్ని నేను నిష్పాక్షికంగా అంగీకరిస్తాను. ఇక స్వప్రయోజనాలు మాత్రమే సాధిస్తున్నారనుకొనబడే వారిని గూర్చి నేనే మీ చెప్పదలచుకోలేదు’ అంటూ నేటి రాజకీయ పోకడలను నిర్మొహమాటంగా తప్పుపట్టారు.  దేశ సమైక్యత విషయంలో ప్రధాన అంశమైన భాషా విధానంపై కూడా విపులంగా చర్చించారు..

భారతదేశపు ఐక్యతను ఎట్లా సుప్రతిష్ఠితం చేయాలన్నది నేటి ప్రధాన సమస్య. ఈ సమస్య బహుముఖాలుగా ఉంది. కానీ, నేను వానిలో ఒకటి రెండు విషయాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. గురుతరమైన అనేక ఆటంకాలను సహించి వేల యేండ్లుగా కొనసాగుతున్న ఈ దేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమైక్యత భవిష్యత్తులో కూడా కొనసాగగలదని నేను నిస్సందేహంగా విశ్వసిస్తున్నాను. స్వాతంత్య్రానంతరం భౌతికాభివృద్ధిని గురించిన శ్రద్ధ ఎక్కువైనా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయములు నిర్లక్ష్యానికి గురైనవని చెప్పేందుకు వీలులేదు. నిజానికి, నేడు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వపు గుర్తింపు మునుపటికన్నా ప్రబలంగా ఉంది. తిరుమల, సోమనాథ ఆలయాలనుండి ఎల్లమ్మ గుడి దాకా దేశపు మూలమూలల నున్న ప్రతి దేవాలయమూ దినదినానికీ ఎక్కువ జన సందోహాన్ని ఆకర్షిస్తున్నది. నిధుల దుర్వినియోగం ఎక్కడో బహు కొన్ని పరిస్థితులలో జరిగినప్పటికీ, దేవాలయ ఆస్తుల నిర్వహణ, ప్రజాశ్రేయస్సుకై వాని వినియోగమూ నేడు పూర్వంకన్నా క్రమబద్ధంగా ఉన్నాయి. మరొక ముఖ్యాంశం - సంస్థాగతంగానూ, వ్యక్తిగతంగానూ దేశమంతటా పర్యటిస్తూ శ్రద్ధాళువులై తమ పోషకభారం వహించిన పెద్ద పెద్ద ప్రజా సమూహాలను తమ ప్రవచనాలకు ఆకర్షించుకోగల స్వాములు, ఆధ్యాత్మిక గురువులూ మనకు ప్రశంసనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ దృక్పథంతో చూసినప్పుడు వర్తమానగతిలో ఈ మత, ఆధ్యాత్మిక చేతనపు గణనీయ ప్రభావం అస్పష్టమే అయినా, అధునాతన భారతీయ హృదయం నాస్తికభావావిష్టం కాగల అవకాశాలు ఎంతమాత్రమూ లేవని నమ్మకంగా చెప్పవచ్చు. కనుక ఈ తర్వాత కూడా భారతదేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమైక్యత నిరంతరాయంగా కొనసాగగలదని నా ప్రగాఢ విశ్వాసం, అందువల్ల, ఐహికమైన రాజకీయ సమైక్యతను మాత్రమే ప్రస్తావించబోతున్నాను.

నేడు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వపు గుర్తింపు మునుపటికన్నా ప్రబలంగా ఉంది. తిరుమల, సోమనాథ ఆలయాలనుండి ఎల్లమ్మ గుడి దాకా దేశపు మూలమూలల నున్నప్రతి దేవాలయమూ దినదినానికీ ఎక్కువ జన సందోహాన్ని ఆకర్షిస్తున్నది.

విచక్షణను కోల్పోయి బలగర్వోన్మత్తమైన పొరుగు రాజ్యం భారతదేశంపై దురాక్రమణ జరిపినప్పుడు జాతి అంతా ఒక్క తాటిపై సన్నద్ధమై నిలుచుంది. స్వాతంత్య్రానంతరం ప్రథమ పర్యాయంగా ఒక గొప్ప అప్రమత్తత ప్రజా సమూహాన్నంతా ఆవహించింది. కేరళలోని పల్లె మనిషి, గోవాలోని చేపలు పట్టేవాడు, కాశ్మీర్‌లోని చేతిపనివాడు, బెంగాలులోని చిన్నకారు రైతూ ఒకేరకమైన జాగరూకతను పొందారు. రాష్ట్రీయ, ప్రాంతీయ వర్ణ, మత, వర్గ విభేదాలన్నీ విస్మృతములైనాయి. చైనీయ దురాక్రమణ, ఆ పరిస్థితిలో అంతర్గతమైన భారతీయ ప్రజల సమైక్యత ప్రబలమైన విద్వేష చిహ్నాలనయినా అణిచివేసి భాసింపగలదని సంశయాతీత ధోరణిలో నిరూపించింది.

ఈ విధంగా, ఆధ్మాత్మిక, సాంస్కృతిక రంగాలలో నిగూఢమై ఉన్న దేశ సమైక్యత, ఆత్యయిక పరిస్థితుల్లో స్వస్వరూప భాజనం కావడం దర్శిస్తున్నాము. ఏమైనా, సాధారణ సమయాల్లో ఇది అంతగా ప్రత్యక్షం కావడం లేదు. అయినప్పటికీ చాలా పర్యాయాలు ప్రజలు అపమార్గంలో అనేకత్వాన్ని అనైక్యంగా భ్రమిస్తారని నేను భావిస్తున్నాను. అసంఖ్యాక సందర్భాలలో, భారతీయ విజ్ఞానపు పరమావధి భిన్నత్వంలో ఏకత్వం దర్శించడమేనని చెప్పడం మనము వింటున్నాము. కానీ, భిన్నరూపంలో కనిపిస్తున్న ప్రతి చిన్న అంశాన్నీ అనైక్యతా ప్రతిరూపంగా ద్యోతకం చేసే స్వభావం ఒకటున్నది. అసలు సత్యం భారతదేశం వంటి జన సంఖ్యా, సంకీర్ణతా కలిగిన దేశంలో ఈ ప్రత్యేక విభిన్నత్వమే అంతర్నిహితమైన ఐక్యతకు కారణభూతమైనది. కృత్రిమంగా దీనికి మించిన ఐక్యత కల్పించుకోబూనడం విచ్ఛిన్న వినాశనాలలో పర్యవసింపవచ్చు. 

ఇదంతా ఐక్యతా భావాన్ని గూర్చి. ఇప్పుడు నేను ఐక్యతా సాధకాలను గురించి కొంత పరిశీలింపవచ్చు. అవి - నా భావనలో, (1) రాజ్యాంగం, (2) రాజకీయ సంస్థలు, (3) పరిపాలనా యంత్రాంగము. రాజ్యాంగ సంబంధంగా నేను చెప్పదలచింది అత్యల్పం. ఇది మన అవసరాలకు తగినట్లుగా ఉపకరించిందనే సామాన్య విశ్వాసం. మన మీ రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాము-కొందరి అభిప్రాయంలో మరీ ఎక్కువగానేమో కూడా. ఏమైనా, ఒకసారి నిర్మితమైన రాజ్యాంగం ఎన్ని పర్యాయాలు సవరింపబడుతున్నదన్న విషయం సాంఘిక పరిమాణం ఏ వేగంతో సంభవిస్తున్నదన్న విషయంపై ఆధారపడి ఉంది. 

ఇక రాజకీయ సంస్థల గురించి. అందరితోపాటు నేనూ అవి దుస్థితిలో ఉన్నాయని అనుకోకుండా ఉండలేకపోతున్నాను. అట్టి సంస్థలు అవకాశవాదంలో మాత్రమే నమ్మకం కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాజకీయపక్షాలననుసరించే దేశంలోని ప్రజాభావన పురోగమించడం వల్ల, ఈ పక్షాల సంయోగం దేశ సమైక్యత దృష్ట్యా అతి ముఖ్యమైంది. రాజకీయపక్షాల మార్గదర్శకత్వం అనైక్యతలై ఉన్నప్పుడు, దేశ సమైక్యత భద్రపడుతుందనుకోవడం వ్యర్థమైన ఆశ. జాతి అవసరాల కోసం సంకుచిత తత్వాలను త్యాగం చేయగల ధీరగుణంతో కూడిన రాజకీయ ప్రతినిధులు పార్లమెంటులో కానీ, రాష్ట్ర శాసనసభలో కాని ఎందరున్నారు అన్నదే అసలు ప్రశ్న. విభిన్న రాష్ర్టాలకూ, మండలాలకు చెంది ఉన్నా, కలిసికట్టుగా ఉన్నప్పుడైనా తమ ప్రాంతీయ దృక్పథాలను విడిచిపెట్టి, అఖిల భారత దర్శనం ఇవ్వగలిగిన నాయకుల సంఘటనను దేశం నేడు కాంక్షిస్తున్నది. ఉన్నత పదవుల నధిష్టించిన చాలామంది తమ ప్రత్యేక వర్ణానికీ, వర్గానికీ ఏదోరకంగా ఉపకారం చేయాలన్న ధోరణి కలిగి ఉన్నట్లు, నేడు ఒక పర్యాప్తమైన జన సామాన్య విశ్వాసాల్ని నేను నిష్పాక్షికంగా అంగీకరిస్తాను. ఇక స్వప్రయోజనాలు మాత్రమే సాధిస్తున్నారనుకొనబడేవారిని గూర్చి నేనే మీ చెప్పదలచుకోలేదు. స్పష్టంగా ఈ రకమైన అపనమ్మకానికి గురైన వ్యక్తులు నిజమైన సంఘటన’కు బద్ధులు కాలేరు. కనుక, రాజకీయపక్షాలు శాసనసభలకూ, పార్లమెంటుకూ తమ ప్రతినిధులనెన్నుకొనే విధానం పూర్తిగా పునర్విమర్శించుకోవడం అతి ప్రధానమైనదని భావిస్తున్నాను.

పార్లమెంటుకు మూడు రకాలైన వ్యక్తులు ఎన్నుకోబడతారని జనసామాన్యం విశ్వసిస్తుంది- వారు (1) అటు నిర్లక్ష్యం చేసి వదలిపెట్టేందుకు వీలులేని ప్రాముఖ్యమూ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంచేందుకు వీలులేని అసమ్మతి కలిగినవారు, (2) యథాస్థితి కొనసాగేందుకు పార్లమెంటులో తప్పనిసరిగా స్థానం పొందవలసినవారు, (3) పార్లమెంటులో స్థానం పొందేందుకు అవసరమైనయోగ్యతలు కలవా రు. ఈ మూడవ రకానికి చెందినవారు చాలా తక్కువమందని భావించవచ్చు. కానీ ఈ వర్గం ద్వారానే నిజమైన దేశీయ సమైక్యత ఒనగూరుతుంది. ఈ ఉపయోగాన్ననుసరించి కూడా, రాజకీయ ప్రతినిధుల నెన్నుకునే ధానాలను పునర్వ్యవస్థీకరించడంలో కష్టం కనిపించదు.

రాజ్యాంగ సంబంధంగా నేను చెప్పదలచింది అత్యల్పం. ఇది మన అవసరాలకు తగినట్లుగా ఉపకరించిందనే సామాన్య విశ్వాసం. మన మీ రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాము-కొందరి అభిప్రాయంలో మరీ ఎక్కువగానేమో కూడా. ఏమైనా, ఒకసారి నిర్మితమైన రాజ్యాంగం ఎన్ని పర్యాయాలు సవరింపబడుతున్నదన్న విషయం సాంఘిక పరిమాణం ఏ వేగంతో సంభవిస్తున్నదన్న విషయంపై ఆధారపడి ఉంది.

ఇక పరిపాలనా యంత్రాంగాన్ని గురించి. సమైక్యత బాహ్యావసరాలను పూర్తిచేసేది ఈ యంత్రాంగం నడవడియే. ప్రభుత్వ స్థాయిలో విధానాల మార్పుల చేత ఎక్కువగా ప్రభావితమయ్యేది కూడా ఈ యం త్రాంగమే. ప్రత్యేకంగా, అధికార భాషను గూర్చిన నిర్ణయాలు ఈ యంత్రాంగం భవితవ్యంపై మిక్కుటమైన ప్రభావం చూపుతాయి. పరిపాలనకు సంబంధించినంతవరకు ఒక్క భాషకాని లేదా ఏ కొన్ని భాషలు కానీ స్వయం గమ్యాలు కావు- అంటే, వానివల్ల సాధించవలసిన లక్ష్యం వేరే ఉంది. ఏ భాషనైనా దేశ సమైక్యత అన్న కొలబద్దననుసరించి పరిశీలించాలి. ఇంతవరకు, అన్ని స్థాయిలలోనూ ఆంగ్లాన్నే మన అధికార భాషగా అంగీకరించి ఉన్నాము. ఇప్పుడు రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో ఉదహరించిన భాషలన్నీ విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా భాషలుగానూ, యు.పి.ఎస్‌.సి. పరీక్షల కొరకున్నూ ఉపయోగించేందుకు ప్రతిపాదనలు చేయబడినాయి. యు.పి. యస్‌.సి పరీక్షలు ప్రాంతీయ భాషలలో జరగడమన్నది ఈ భాషలను విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా భాషలుగా ప్రవేశపెట్టడంతో ముడివేసుకొని ఉందని చెప్పనవసరంలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుభవాన్ని బట్టి, మన ప్రాంతీయ భాష విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా భాషగా పరిణతి చెందేందుకు కనీసం 20 సంవత్సరములు అవసరమౌతుందని స్పష్టమయ్యింది. పైగా, యు.పి.ఎస్‌.సి సర్వీసులలో చేర్చుకొనబడినవారు అఖిల భారతస్థాయిలో సమర్థతతో పనిచేయగలి ఉండాలి. ఈ పరీక్షలకు హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరి పేపర్లుగా నిర్ణయిస్తారని అంటున్నారు. ఏమైనా అనుబంధ భాషలుగా నేర్చుకోగలిగిన దానికన్నా,


ఇంగ్లీషు, హిందీ భాషలలో చాలా ఎక్కువగా నేర్చుకొనవలసి ఉంటుందన్నది అఖిల భారత ఉద్యోగాలలో సామర్థ్యం పరిరక్షించేందుకు ఒప్పుకోవలసిన సత్యం. మరొక వైపున రాష్ర్టాలలో ప్రాంతీయ భాషలు కావడం వల్ల, ప్రధానంగా రాష్ట్రీయ ఉద్యోగాలలో ఆయా భాషలు అభ్యసింపకుండా పనిచేయడం సాధ్యం కాదు. కాబట్టి, కొంచెం వెనుకాముందుగా భారతీయ పరిస్థితులకు తగినరీతిలో విశ్వవిద్యాలయ స్థాయిలో అవలంబింపవలసిన ఒక బోధనా భాష, ఒక అనుబంధ బోధనా భాషను గూర్చిన సరియైన విధానం రూపొందించుకోవాలి. మన ఉద్యోగులందరూ రాష్ట్ర భాషలోనూ, అనుబంధ భాషలోనూ ఇంచుమించు సమాన ప్రావీణ్యం కలిగి ఉన్నారన్నది నిర్ధారించుకోవలసి ఉంటుంది. సహజంగానే ఇది దేనిని కానీ తప్పనిసరిగా నేర్చుకోవలసిన రెండవ భాషగా విధించడం వల్ల సాధ్యం కాదు. ఈ రెండు భాషలకూ సమానమైన ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా మన విధానం మారాలి. ఇది ద్విభాషా విధానానికి ఎంతవరకు సమన్వయిస్తుందో నేను చెప్పలేను. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం భాషా విషయికమైన ఇబ్బందులను అధిగమించేందుకు ఈ విధానం మాత్రమే యుక్తమైనదిగా భావిస్తున్నాను. 

వెనుకబడిన ఆర్థికవ్యవస్థ, పరిణితి చెందని రాజకీయ సంస్థలూ, త్వరితగతి పరిణామం చెందుతున్న సంఘానికీ, శతాబ్దాల బానిసత్వంతో జడమైపోయిన దృక్పథానికీ మధ్య పీడిత సాంఘిక వ్యవస్థా - ఇవన్నీ మనకు వారసత్వంగా లభ్యమైనాయి. ప్రాథమిక దశలో ఏ జాతి అయినా ఎదుర్కొనవలసిన సమస్యలన్నిటికన్నా ఇది ప్రబలమైన సమస్య. 

గత కొన్ని సంవత్సరాలలో మన అధీనంలో లేని అనేక క్లిష్ట సందర్భాలను ఎదుర్కోవలసి వచ్చిందన్న విషయం ఎవరూ తిరస్కరించలేరు. వెనుకబడిన ఆర్థికవ్యవస్థ, పరిణితి చెందని రాజకీయ సంస్థలూ, త్వరితగతి పరిణామం చెందుతున్న సంఘానికీ, శతాబ్దాల బానిసత్వంతో జడమైపోయిన దృక్పథానికీ మధ్య పీడిత సాంఘిక వ్యవస్థా - ఇవన్నీ మనకు వారసత్వంగా లభ్యమైనాయి. ప్రాథమిక దశలో ఏ జాతి అయినా ఎదుర్కొనవలసిన సమస్యలన్నిటికన్నా ఇది ప్రబలమైన సమస్య. మన మీ సవాలును స్వీకరించాము - ఇక దీనిని జయించే ప్రయత్నం చేయాల్సి ఉంది. మన నాయకులు దర్శించిన జాతి భవితవ్యం, వారు పునాది వేసిన ఆదర్శవాదమూ, వారు నిర్మించిన విధాన దృక్పథం - ఇవన్నీ చాలాకాలం వరకు మనగలవనడంలో నాకెట్టి అపనమ్మకమూ లేదు. అవి ఉపయోగ రహితాలు కాకుండా కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. మన ఋషులూ, మన నాయకులూ అనుక్షణమూ ఏ లక్ష్యం కొరకైతే ప్రబోధించారో ఆ లక్ష్యం ఇముడ్చుకొన్న ఈ సమస్య చాలా ప్రధానమైంది. వారు వర్తమానానికీ, గతానికి మధ్యన ఉన్న సంబంధం శిశువుకూ, మాతకూ ఉన్న సంబంధం వంటిదన్న సత్యాన్ని సమర్థించారు. తల్లి శిశువు రూపంలో భవిష్యత్తులో అడుగు పెట్టినప్పటికీ, శిశువు తనకు తానై ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించుకొంటుంది. అధునాతన భారతీయ తాత్విక చింతన కూడా ఈ విధంగానే ఉండాలనుకొంటున్నాను - ఈ చింతన భూత వర్తమానాల మధ్య, ఒక సమగ్ర సమన్వయానికి దారి తీసేదిగా ఉండాలి. ఇది సరియైన దారి.

తుదిని ప్రస్తావింపవలసిన మరొక ముఖ్యాంశం ఉంది. ఏది చేయాలన్నా - ప్రజల అంగీకారం అవసరమైన ప్రజాస్వామ్యంలో మనము వర్తిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైంది వ్యక్తి అభిప్రా యం. వ్యక్తిగతాభిప్రాయం స్వచ్ఛంగా వ్యక్తం కాలేనిచోట ప్రజాస్వామ్యం వర్తించదు. దోషదూషితాలైన అభిప్రాయాల ననుసరించి మొత్తం జాతే ప్రమాదాన్ని కోరి తెచ్చుకొనే సందర్భాలు లేకపోలేదు. కాని తుదిని ఈ అభిప్రాయాలలో జాగృతమైన ఒక వివేచన మొత్తం పరిస్థితులను కుదుటబరుస్తుంది. కనుక, ప్రజాస్వామ్యంలో ఒక జాతియందు వర్తిస్తున్న అసంఖ్యాక ఆలోచనా స్రవంతులు, మరిన్ని జాతీయ అంతర్జాతీయ సంఘటనలకు చలించి కొత్త భావాలకు తావివ్వగల ప్రతిస్పందనా ఆ జాతి యొక్క వాస్తవమైన జీవానికి సంకేతాలు. 

logo