శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 30, 2020 , 23:19:12

యూపీ వైఖరిపై అనుమానం

యూపీ వైఖరిపై అనుమానం

ఏడో అధ్యాయం కొనసాగింపు..

1992 నవంబరు 21 నాటి దిటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక కథనం ఇలా ఉంది:

సంకల్పించిన కరసేవ విషయంలో సంప్రదింపులు రాష్ట్ర ప్రభు త్వం, కేంద్ర ప్రభుత్వం, యింకా ఇతరుల మధ్య కొనసాగుతున్నాయని శ్రీ వేణుగోపాల్‌ బదులు పలికారు. ఆయన యూపీ పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీ అలోక్‌ సిన్హా సమర్పించిన వాంగ్మూలం నుంచి ముఖ్య విషయాలను చదివి వినిపించారు. ఈలోగా సేకరించిన స్థలంలో ఏ విధమైన నిర్మాణం తలపెట్టడం గానీ, డిసెంబరు 6న తలపెట్టిన కరసేవను నిర్వహించటం గానీ చేయరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాల్సిందిగా శ్రీ ఓ.పీ.శర్మ గట్టిగా కోరారు. జస్టిస్‌ వెంకటాచలయ్యగారు కూడా యూపీ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల్ని పాటించేట్లు కన్పించటం లేదని వ్యాఖ్యానించారు. ‘వివాదంలో ఉన్న కట్టడానికి సమీపంలో ఏ నిర్మాణమూ చేపట్టరాదన్న ఉత్తర్వుల్ని అమలుపర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు’ అంటూ జడ్జి గారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై కోర్టు ధిక్కార నేరాన్ని మోపుతూ తగిన చర్య గైకొనవలసిందని కోరిన అచ్చన్‌ రిజ్వీగారి తరఫు న్యాయవాది శ్రీ గోవింద ముఖోటీని మరో వ్యాఖ్య చేసేట్లు చేసింది ఆ జడ్డిగారి వ్యాఖ్యానం. ఆ న్యాయవాది అన్నదేమంటే-‘వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వీహెచ్‌పీ మరి ఇతరులతో చాలా సన్నిహితంగా మెలగుతూంది. కరసేవకు 10 లక్షల ప్రజలు అలా గుమిగూడటాన్ని ప్రభుత్వం అనుమతించరాదనే ఆంక్షల్ని కోర్టు విధించాలని కూడ శ్రీ ముఖోటీ కోరారు.

సరే, వెంకటాచలయ్య గారి నిర్దేశన ప్రకారం ప్రజలు అలా గుమిగూడటాన్ని నిర్మాణాన్ని చేపట్టేందుకు అలా తరలిరావటాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అరికట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి ఆయన గుర్తు చేసిందేమంటే-సేకరించిన స్థలంలో ఎటువంటి నిర్మాణమూ చేపట్టరాదని కోర్టు ఎన్నో పర్యాయాలు ఆదేశాలివ్వటం జరిగిందని. 1992 నవంబరు 20న అన్నిపక్షాల వాదనలు విన్న పిమ్మట వాళ్ల విన్నపాలు ఈ కింది విధంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది. 

ఈ కోర్టు ఉత్తర్వుల్ని పాటించాలనే ఆతురతలో రాష్ట్ర ప్రభుత్వం వేరెవ్వరికీ తీసిపోదని శ్రీ వేణుగోపాల్‌ విన్నవించారు. వివిధ వైరి వర్గాల మధ్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినట్లయితే అది దుష్ఫలితాలకు దారితీస్తుందనేది ఆయన భావనగా పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు చర్చలు ఓ కొలిక్కి రావటమో లేక వాటి తీరు తెన్నుల్ని బేరీజు వేసుకునే అవకాశమో లభిస్తుంది. గనుక కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమ ప్రణాళికను ఆ నెలాఖరులోగా సమర్పించగలదన్నారు...

ఫిర్యాదిదారుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు శ్రీ గోవంద ముఖోటి, శ్రీ శర్మలు చెయ్యిదాటిపోతున్న పరిస్థితుల పట్ల తీవ్రంగా స్పందించారు. 1992 జూలైలో వాయిదాలు కోరినందువల్ల ఏ జరిగిందో గుర్తుచేశారు. గౌరవనీయ న్యాయవాది విషయాన్ని అవగాహన చేసుకొని వ్యక్తపరిచిన తీరు అభినందనీయమే. కానీ వారిని సలహా వైఖరిని వీడి సామాజిక సమతౌల్యం దెబ్బతినకుండా చూచేందుకు కోర్టుకు సాయపడవలసిందిగా కోరుతున్నామన్నారు.

ఉభయపక్షాల వాదనలు విన్న పిమ్మట కోర్టు ఇంకా ఈ విధంగా ఆదేశించింది; ‘ఈ కోర్టు గతంలో యిచ్చిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలుపరిచేందుకు యింకేవిధమైన ఉత్తర్వులు జారీ చేయాలా అనే అంశంలో కేంద్రం సాయం కూడా అవసరమవుతుంది. గనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది. కనుక మేము అటార్నీ జనరల్‌ను గానీ, సొలిసిటర్‌ జనరల్‌ను గానీ 1992 నవంబరు 23 (అదేరోజు) సాయంత్రం రెండు గంటలకు కోర్టులో హాజరుకావలసిందిగా ఆదేశిస్తున్నాం’ బహుశా ఆనాటి కోర్టు వ్యవహారంలో న్యాయస్థానం పరిశీలనలోని అంశాల ఆధారంగానే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నవంబరు 21న ఈ విధంగా రాసింది. ‘సుప్రీంకోర్టు ఈ రోజు భారత సొలిసిటర్‌ జనరల్‌కు ఒక నోటీసు పంపుతూ ఆయన్ని సోమవారం కోర్టుకు హాజరై అయోధ్యలో వివాదంలో ఉన్న కట్టడం వద్దగల 2.77 ఎకరాల సేకరించిన స్థలాన్ని రిసీవర్ని నియమించి స్వాధీనం చేసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయమన్నది. ఓ.పీ.శర్మ విన్నపం మీద ఇచ్చినటువంటి ఆదేశం ఇది. శ్రీ ఓ.పీ.శర్మ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారనే ఓ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది. డిసెంబరు 6న నిర్వహించతలపెట్టిన కరసేవకు తరలివచ్చే లక్షలాది మంది రాకుండా చూడవలసిందిగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వెంటనే ఆదేశించవలసిందిగా ఆయన విజ్ఞప్తిచేయటం జరిగింది. 

నవంబరు 23న తిరిగి కేసును చేపట్టిన సుప్రీంకోర్టు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని డిసెంబరు 6న తలపెట్టిన కరసేవ విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ, అయోధ్యలో వివాదంలో ఉన్న కట్టడం వద్ద సేకరించిన స్థలంలో నిర్మాణం జరపరాదని కోర్టు ఆదేశించిన మేరకు తీసుకోదలచిన చర్యల్ని, నవంబరు 25లోగా తెలియజేయమంది. పై ఉత్తర్వుల్ని కోర్టు భారత సొలిసిటర్‌ జనరల్‌ శ్రీ దీపాంకర్‌ గుప్తా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెలిబుచ్చిన తరువాత జారీ చేయటం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే అయినా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అందించగలిగిన మేరకు సాయాన్ని తప్పక అందిస్తుందని శ్రీ గుప్తా తెలియజేశారు. ఈ హామీని యిస్తూనే ఆయన డిసెంబరు 6న జరపతలపెట్టిన కరసేవలో పాల్గొనేందుకు కరసేవకులు నవంబరు 27 నుండే వెల్లువలా వచ్చిపడతారనే పత్రికలలోని వార్తలను కోర్టు దృష్టికి తీసుకురావటం జరిగింది. కోర్టులో జరిగినదంతా విపులంగా రాస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వెల్లడించిందేమంటే- సుప్రీంకోర్టు యూపీ ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్‌సింగ్‌కు, రాష్ట్ర అధికారయంత్రాంగానికీ సేకరించిన స్థలంలో ఎటువంటి నిర్మాణాన్ని అనుమతించవద్దని, కరసేవకులు అలా చేయటాన్నివారించమని గతంలో పలుమార్లు ఆదేశాలు జారీచేసింది. అయితే అవి అలా ఉండగానే జూలైలో కరసేవ నిర్వహింపబడింది. కరసేవకులు ఒక కాంక్రీటు అరుగును నిర్మించారు. అదే వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌, అటువంటి ఆలోచనలు గల మరికొన్ని సంస్థలు నిర్మింపతలపెట్టిన కోట్లాది రూపాయల విలువ చేసే దేవళానికి సింహద్వారమవుతుందని ఆ పత్రిక గుర్తుచేసింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo