ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 30, 2020 , 00:21:37

భీష్ముడి అదృష్టం

భీష్ముడి అదృష్టం

భగవంతుని దర్శనానికి భక్తుడు పరితపించటం, ప్రతీక్షించటం సాధారణం. కాని, మహాశ్చర్యం! ఈ ఘట్టంలో భక్తుని నిర్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భగవంతుడే వేచి ఉన్నాడు. ఉత్సహిస్తూ కాచుకు కూర్చున్నాడు. ఇది అసాధారణ విషయం! ‘సదేవదేవో భగవాన్‌ ప్రతీక్షతాం’- భక్తుడు శాంతనవుడు (భీష్ముడు) సర్వేశ్వరుని అలా శాసించాడు మరి! ‘భక్తిః కిం నకరోతి’- ఆహా! భక్తికి అసాధ్యమేమున్నది? భగవంతుడు భక్తి ప్రియుడు, భక్త పరాధీనుడు. సామాన్య సాధక భక్తులకు ధ్యానయోగంతో మానస దర్శనం మాత్రమే ప్రసాదించు సుదర్శన  భగవానుడు అనన్య భక్తులకు మాత్రం అపరోక్ష దర్శనం అనుగ్రహిస్తాడు. దీనికి ఈ నిర్యాణ నిరీక్షణే నిదర్శనం!

తే. “నాల్గు భుజములు కమలాభనయన యుగము 

నొప్పుగన్నుల ముందట నున్నవాడు,

మానవేశ్వరా! నా భాగ్య మహిమ జూడు

మేమి సేసితినో పుణ్యమితని గూర్చి.

భీష్ముడు ధర్మరాజుతో పలుకుతున్నాడు- ‘ధర్మజా! నా అంత్యకాలంలో ఆనంద స్వరూపుడు అంబుజాక్షుడు అచ్యుతుడు వికసిత ముఖాంబుజంతో, విప్పారిన నేత్ర కమలాలతో చతుర్భుజుడై ఇదిగో- నేను ప్రాణాలు పరిత్యజించు వరకు నా ముందే ఉంటూ నా కనులకు విందు చేయనున్నాడు. పూర్వజన్మల్లో ఎలాంటి పుణ్యాలు చేశానో! మహారాజా, నా భాగ్య మహిమ ఎట్టిదో చూడు.’ అలా అని పరవశిస్తూ శరతల్పశాయి శాంతనవుడు శేషతల్పశాయి శ్రీ కృష్ణుని సన్నిధిలో ధర్మరాజుకు వివిధ ధర్మాలు బోధించాడు. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించగా అది ప్రాణ ఉత్క్రమణకి ఉత్తమంగా నిశ్చయించి, మౌనం వహించి, మనోవృత్తులను నిరోధించి- మనసును ఏకాగ్రపరచి, చూపులను మాధవుని ముఖకమలం పై నిలిపి, స్వామి కారుణ్యవీక్షణాలతో తీక్షణమైన బాణాల బాధ తొలగిపోగా, ‘తృష్ణా హరాయ కృష్ణాయ’- తృష్ణారహితమైన తన బుద్ధిని కృష్ణార్పణం చేసి కురుసింహుడు, ‘కల్మషగజశ్రేణీ హరిన్‌ శ్రీహరిన్‌'- కల్మషా(పాపా)లనే కరి (ఏనుగుల) సమూహాన్ని చీల్చి చెండాడే యదుసింహుని సంతోషంగా ఇలా స్తుతించాడు-

మ. త్రిజగన్మోహన నీలకాంతి దనువుద్దీపింప బ్రాభాత నీ

రజ బంధుప్రభమైన చేలము పయిన్‌ రంజిల్లు నీలాలక

వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడున్‌.

“మూడు లోకాలను మోహింప చేసే నీలవర్ణకాంతితో నిగనిగలాడే దేహంతో, ప్రభాతకాల బాలభాను ప్రభలతో మెరిసిపోయే పసుపుపచ్చని వన్నెగల వస్త్రంతో, నల్లని ముంగురులతో ముద్దులొలికే ముఖారవిందం మిక్కిలి సేవింపతగినదై మరులుగొల్పుచుండగా, మా విజయుని (అర్జునుని) సమీపించే వన్నెకాడు- అందగాడు నా అంతరంగాన్ని నిరంతరం ఆవేశించి- (నా మదిలో ఎప్పటికీ) నిలిచి ఉండుగాక!” ముఖాన్ని కమలంతో పోల్చినందున ముంగురులకు మధుపా(తుమ్మెద)లతో పోలిక. కనుక, ఉపమాలంకార ధ్వని. “మేఘశ్యామం పీతకౌశేయ వాసం”- శ్యామల శరీరం పై పీత(పసుపు పచ్చని) వస్త్రం, ఈ రెంటి కలయిక వల్ల కమనీయమైన మరో కొత్త కలనేత కాంతి! అందుకే ‘వన్నెలాడు’ అన్న పాఠాంతరం ఉంది. ‘నీలకాంతి’కి బదులు ‘శీలకాంతి’ అనేది ప్రాచీన పాఠంగా పెద్దలు చెప్పుతారు. అప్పుడు ‘మూడు లోకాలను మోహపెట్టే స్వభావం కలిగిన కాంతి’- అని అర్థం వస్తుంది.

మూలంలో ‘విజయసఖే’ అని మాత్రమే ఉండగా పోతన ‘మా విజయుం జేరెడు వన్నెకాడు’ అని తెనిగించడంలో పితామహునికి తన పౌత్రుడై పార్ధుని పట్ల ఉన్న మమత, మాలిమి స్పష్టమయ్యాయి. విజయుడు మా వాడైతే విజయ సఖుడూ మావాడేగా! - అన్న ధ్వని కూడా ప్రతిధ్వనిస్తున్నది. కృష్ణార్జునులు నారాయణ, నర రుషులు. నరనారాయణులు జీవ-ఈశ్వరులకు ప్రతీకలు. ఒకే తత్తం రెండుగా భాసిస్తున్నది. ‘వన్నెకాడు’ అన్న తెలుగు పలుకు ఈ పద్యానికే వన్నె తెచ్చిన పసిడి తళుకు! సృష్టిలోని అన్ని రంగుల హంగులకు, అన్ని రసముల పొంగులకు ఆ పరమాత్మేగా మూల స్రోతస్సు (సోర్స్‌)! భాగవతంలో ఉద్ధవుడు విదురునితో ‘విస్మాపనం స్వస్య చ సౌభగర్ధేః పరంపదం భూషణ భూషణాంగం’- అని అంటాడు. శ్రీకృష్ణుల వారి అందచందాలు ఆయననే అబ్బురపరచేవిట! ఆ దివ్య విగ్రహం సౌందర్య సౌభాగ్యాలకు పరాకాష్ఠ. స్వామి అంగాంగాలు ఆభరణాలకే ఆభరణాలు. అనగా, ఆభరణాల వల్ల అవయవ శోభకాదట. అవయవాలను ఆశ్రయించి ఆభరణాలే శోభిస్తున్నాయిట!

సీ. కుప్పించి యెగసిన గుండలంబుల గాంతి

గగన భాగం బెల్ల గప్పి కొనగ!

నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

జగముల వ్రేగున జగతి గదల!

జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

బైనున్న పచ్చని పటము జాఱ!

నమ్మితి నాలావు నగుబాటు సేయక

మన్నింపుమని క్రీడి మరల దిగువ!

తే. గరికి లంఘించు సింహంబు కరణిమెరసి,

నేడు బీష్ముని జంపుదు నిన్నుగాతు

విడువుమర్జున యనుచు మద్విశిఖవృష్టి,

దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.

ఈ సీసం మూలంలోని రెండు శ్లోకాల అర్థానికి అధివాసం. పరమాత్మకి పార్థుని మీద ఎంత ప్రేమో చూద్దామని అనిపించింది పితామహునికి. అర్జునుని చిక్కుల్లో పెడితే కానీ అచ్యుతునికి అతని మీద ఉన్న అనురాగం అభివ్యక్తం కాదు. అందుకని సవ్యసాచి మీద శరపరంపరలు సంధించాడు సురనదీ సూనుడు. అవి పార్థునికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ‘యోగక్షేమం వహామ్యహమ్‌'- భక్తుల యోగక్షేమాల బాధ్యత భగవంతునిదేగా! అంతేగాక, ఆయుధం పట్టనని పరమాత్ముని ప్రతిజ్ఞ. నీచే అస్త్రం పట్టించకపోతే నేను గంగాపుత్రుణ్ణే కాదు- అని భీష్ముని పట్టుదల. ‘భక్తానాం మానవర్ధనః’- భగవంతునికి తనకంటే తన భక్తుని పరువు ప్రతిష్ఠలే ప్రధానం. ఆ సంరంభంలో, తాను నరుని వలె నటించాలి- అనే స్ఫురణ కూడా లేకుండా పోయిందట! “పితామహుని ప్రతిజ్ఞను పరిరక్షింప దలచి రథంలో ఊపిరి బిగబట్టి చివాలున పైకెగిరినప్పుడు ఇటూ-అటూ ఊగుతున్న కర్ణకుండలాల కాంతి ఆకాశమంతా అలుముకుంది. కిందకి దూకినప్పుడు ‘దామోదరుడు’ కనుక ఉదరంలోని భువనాల భారం భరించలేక భూమి కంపించింది. చేతిలో రథచక్రం ధరించి ముందుకు దూసుకువస్తుంటే, ఆ వేగానికి భుజం మీది బంగారు ఉత్తరీయం జారిపోయింది. ‘బావా, ఏమిటిది? నా శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకముంది. నువ్వు చెయ్యి చేసుకోవద్దు. నల్గురిలో నన్ను నవ్వులపాలు చెయ్యొద్దు’ అంటూ విజయుడు వెంటపడి వెనకకు లాగుతున్నా వినిపించుకోకుండా, ‘అర్జునా! నాకు అడ్డురాకు. నన్ను వదలు. ఈనాడు భీష్ముని చంపి నిన్ను కాపాడుతా’ అంటూ కరిపై లంఘించే కేసరిలా నా మీదికి దూకే దేవదేవుడే నాకు దిక్కగుగాక!” అని పితామహుని ప్రార్థన. గుణాతీతుడైన గోవిందునికి ప్రతిజ్ఞా పాలనం, ప్రతిజ్ఞా భంగం- రెండూ సమమే! భక్తవాత్సల్యమే భగవంతుడు అస్త్రం పట్టటానికి కారణం ‘లోకదృష్టిలో అర్జున పక్షపాతి వలె అగుపిస్తున్నా నిజానికి నామీదే అధిక అనుగ్రహం’ అని భావించాడట భీష్ముడు. పద్యంలోని ‘కుప్పించి యెగసిన’ అన్న ప్రథమపంక్తి అమూలకం. ‘నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడువు మర్జున’ అన్న పలుకులు కూడా పోతన పెంపుదలే. ఆకాశమంతా వ్యాపించిన కుండల కాంతి మహాకవి క్రాంత దర్శనం! చరమదశలో పరమాత్మ వచ్చి దర్శనమిచ్చాడని పరవశించి భీష్ముడు దామోదరుని దర్శిస్తూ దేహత్యాగం చేశాడు. అంతశ్శాస నిష్కల పరబ్రహ్మలో శాంతించింది. భక్తుడు విదేహ ముక్తుడయ్యాడు- ‘సుభద్రా పూర్వజో విష్ణుః భీష్మముక్తి ప్రదాయకః’logo