మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Aug 30, 2020 , 00:21:37

శిలలపై శృంగార కావ్యం

శిలలపై శృంగార కావ్యం

కాకతీయుల శాసనాలలో వారు నిర్మించిన ఆలయాలు, తటాకాలు, చెరువుల గురించిన వర్ణనలు, రాజుల ప్రశస్తులే ముఖ్యంగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా ఒక కావ్యాన్నే శిలాక్షరాలుగా మార్చిన సందర్భం ఉంది. అదే ఉర్సుగుట్ట శాసనం. ఈ శాసనంలో కాలం పేర్కొనలేదు. కానీ అందులో ఉన్న విషయాన్ని బట్టి ఇది ప్రతాపరుద్రుని కాలం నాటిదని చరిత్రకారులు నిర్ణయించారు.

వరంగల్లు కోట దగ్గరలో ఉర్సు అనే ఊరి బయట ఉన్న గుట్టపైన, రెండు శాసన కావ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి అసంపూర్తిగా ఉంది. రెండవది పూర్తి కావ్యరూపంలో ఉంది. ఈ కావ్య రచయిత గణపతిదేవచక్రవర్తి, రుద్రమదేవుల రాజగురువైన విశ్వేశ్వర శివాచార్యుల పుత్రుడైన నరసింహకవి. ఇతను గొప్ప పండితుడు. వరంగల్లు కోటలోనే ఉన్న తోరణస్తంభంపై ఉన్న శాసనంలో ఇతడు ఋక్‌చ్ఛాయ, మరికొన్ని శాస్త్ర గ్రంథాలు వ్రాసినట్లు, ఇంకా 8 సర్గల కాకతీయ చరిత్ర ఒకేరోజులో రచించినట్లు ఉంది. మరో తోరణస్తంభంలో ఇతడు పది రూపకాలను రచించినట్లు, మలయవతీ అనే గద్యకావ్యాన్ని కూడా రచించినట్లు చెక్కి ఉంది.

ప్రస్తుతం చర్చించుకునే ఉర్సుగుట్ట శాసనకావ్యం 155 పంక్తుల్లో ఉన్న సుదీర్ఘ శాసనం. మొత్తం సంస్కృతభాషలో 60 శార్దూములు, 2 స్రగ్ధరలతో కూడి ఉంది. ఇందులో మొదటి వాక్యం మాత్రమే దేవనాగరి లిపిలో ఉండగా, మిగతా అంతా తెలుగు లిపిలో ఉంది. కావ్యరచయిత కావ్యానికి ఏ పేరు పేర్కొనలేదు. అందువల్ల పరిశోధకులు పరబ్రహ్మశాస్త్రి దీనికి “సిద్దోద్వాహం” అని పేరు పెట్టారు. ఈ కావ్యం కాళిదాసు మేఘసందేశాన్ని అనుకరించి కానీ, అనుసరించి కానీ రాసినట్లు చెప్పవచ్చు. అక్కడ మేఘుడి ద్వారా సందేశాన్ని పంపుతాడు కాళిదాసు. ఇక్కడ ప్రేయసితో సంభాషిస్తున్నట్లు ఒక సఖిద్వారా సందేశాన్ని పంపుతాడు నరసింహకవి.

ఇందులోని కథ కల్పితమైంది. కొత్త దంపతులు ఒకనాడు గంగానది ఇసుకతిన్నెలలో విహరిస్తుండగా ఒక యక్షుడు వారి విరహావస్థను చూడాలనే ఆసక్తితో నాయికను అదృశ్యం చేస్తాడు. నాయకుడు శయ్యమీద తన భార్య లేకపోవడం చూసి జఢుడై అలాగే ఉండిపోతాడు. కాసేపటి తర్వాత విషయం అర్థమై ప్రియురాలిని తల్చుకుంటూ, ఆమెతో సంభాషిస్తున్నట్లుగానే గుర్తు చేసుకుంటాడు. అందులో వారి ప్రథమ పరిచయం, పరస్పర అనురాగం, ఒక సఖిద్వారా ప్రేమ రాయబారం, తాడు సహాయంతో నాయిక భవనంలోకి దొంగతనంగా ప్రవేశించటం, ఆమె తండ్రికి పట్టుబడటం, కారాగారంలో బంధించబడటం, వీరి ప్రేమను గమనించిన నాయిక తండ్రి ఇద్దరికీ వివాహం జరిపించటం, వారి ప్రథమ సంగమం వంటి ప్రధానాంశాలను స్వీకరించి కవి కల్పిత శృంగార కావ్యంగా రచించాడు. యక్షుడి మాయతో తిరిగి వారిద్దరూ కలుసుకోవడంతో కావ్యం సుఖాంతమవుతుంది. ఇందులోని కవిత్వం... ఉపమానాలు, చిన్న చిన్న సమాసాలతో నిండి ఉంది.

ఇందులోని వర్ణనలు గమనిస్తే, రచయిత పాండిత్యం ఏపాటిదో అంచనా వేయవచ్చు. ‘సమస్త జగత్తు  చేతనతో పాటు భానుడు అస్తమించినాడు. వ్యామోహంతో పాటు చీకట్లు అన్ని దిక్కుల వ్యాపించాయి. కాముకుల కుటిల నేత్రాలతో పాటు నక్షత్రాలు తళుకుమంటున్నాయి’ అంటాడు ఓచోట. నాయకుని విరహ వర్ణనలో అతని కాముక స్థితిని పోలి ‘మొదట యవక పిండిలాగా లేత ఎరుపు రంగులో, తర్వాత దొండపండు రంగుల్లో, తర్వాత మోదుగుపూల మధ్యలో ఉంచిన చిత్రవర్ణంతో చివరకు విరహిణీముఖం లాగా వెల వెల పోవుచూ చంద్రబింబం పైకి వచ్చింది. ఈ సమయంలో లోకమంతా చంద్రుని వెలుగులతో శ్వేతద్వీపంలాగా ఉంటే తన మనస్సులో మాత్రం చీకటి ఉన్నట్లు’ అని నాయకుడు చెప్పుకుంటాడు. నాయిక కూడా విరహబాధలో లీలాసరస్సులో క్షణం, క్రీడాపర్వతంపై క్షణం, ప్రియసఖుల సల్లాపాలతో ఒక క్షణం, శయ్యపై క్షణం, గడపలపై క్షణం, నిల్చొని, కూర్చొని, వెనకకు, ముందుకు నడుస్తూ, ఒక్కోసారి నిశ్చలస్థితిలో ఉంటూ వివిధ రకాలుగా మన్మథావస్థలను పొందుతుంది. నాయిక విరహావస్థ హాలహలంతో మద్యంలా రెండు భావాలతో కూడిన అనుభవాలతో పేర్కొంటారు.

సాధారణంగా కావ్యాల్లో సంభోగ శృంగారానికి సంబంధించిన అంశాలు చాలా తక్కువ. ఈ కావ్యంలో దాని పాళ్ళు కొంచెం ఎక్కువ అయిందనీ, ఆ కారణంగానే ప్రజాదరణ పొందలేదనీ, పైగా ఈ రచనకు ఇతర ఏవిధమైన ఆధారాలు (తాళపత్రాలు, లేదా ఇతర లిఖితప్రతులు) లేవని శాసన పరిశీలకులు, చరిత్రకారులు భావిస్తున్నారు. దక్షిణభారతదేశంలోనే ఒక కావ్యం శిలాక్షరాలుగా మరల్చబడటం అన్నది మాత్రం చాలా అరుదైన అంశంగా, ఇదే ప్రథమమైనదిగా మనం గుర్తించవచ్చు.

- డా. భిన్నూరి మనోహరి, 9347971177


logo