సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 28, 2020 , 23:57:13

మోటు చిత్రాల నడుమ మోగిన రాగం

మోటు చిత్రాల నడుమ మోగిన రాగం

ప్రాచీనతకు ఆధునికతకు, శాస్త్రీయతకు వ్యాపారానికీ, మంచికీ చెడుకీ, మనిషి అంతర్గత బహిర్గత లోకానికీ నడుమ సంఘర్షణ అనివార్యమైంది. ఆయా సంఘర్షణల్లో కొట్టుమిట్టాడి రగిలి ఎదిగినప్పుడే ఏ మనిషి అయినా, సమాజమైనా ముందుకు సాగుతుంది. అప్పుడే నూతన ఆవిష్కరణలకు పాదులు పడుతాయి. వ్యక్తుల్లో, సంఘంలో వేళ్ళూనుకొని ఉన్న ఈ సంఘర్షణలను అన్ని కళారూపాలు ప్రతిభావంతంగా ఆవిష్కరించాలి. అప్పుడే ఆయా కళలకు సార్థకత శాశ్వతత్వం ఏర్పడుతాయి. అలాంటి కళా సృష్టి చేయాల్సిన బాధ్యత కళాకారులు, కవులు, రచయతలకు ఎంతో ఉన్నది. నిజాయితీగా ఆ కృషి జరిగినప్పుడే ఏ కళకైనా, రచనకైనా సార్థకత ఏర్పడుతుంది.

ఇవ్వాళ ఆధునిక, సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో టీవీ, ఇంటర్నెట్‌ నట్టింట్లో తిష్ఠ వేశాయి. దాదాపుగా అందరి కుటుంబాల్లోనూ జీవితాల్లోనూ అవి భాగమైపోయాయనే చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుత కరోనా సృష్టించిన వర్తమాన సంక్షోభకాలంలో అందరూ ఇళ్లకే పరిమితమైపోయి ఈ రెండు మాధ్యమాలతోనే ఎక్కువకాలం గడుపుతున్నారు. కానీ ఈరోజు వస్తున్న టీవీ సీరియళ్లయినా, ఇంటర్నెట్‌ వెబ్‌సిరీస్‌లు అయినా అధిక శాతం హింస, కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయి ఉంటున్నాయి. మన తెలుగు టీవీ సీరియళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దాదాపు అన్ని సీరియళ్లు కుటుంబ కథాంశాల పేర కుటుంబ విలువలను, కుట్రలు కుతంత్రాలతో నింపివేశాయి. 

ఇక ఇంటర్నెట్‌లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీలు వచ్చాక పరిస్థితి ఇంకా మారిపోయింది. అంతర్జాతీయస్థాయిలో హాలీవుడ్‌ ప్రభావంతో వస్తున్న హింసాత్మక పోకడలున్న  క్రైం సిరీస్‌ ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నో వెబ్‌సిరీస్‌ వీక్షకుల మనోభావాలపైన విపరీతమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా మంచితనం పట్ల, మనిషితనం పట్ల, మనుషుల పట్ల, మానవ విలువల పట్ల కళల పట్ల అత్యంత ఉదాసీన ధోరణి సర్వత్రా కనిపిస్తున్నది. దాదాపు అందరూ ఇంటికే పరిమితమైన వర్తమాన స్థితిలో ఈ వెబ్‌సిరీస్‌ ప్రభావం అమితంగా కనిపిస్తున్నది.

అయితే వీటన్నింటి నడుమ ఒక ఆశావాహమైన ప్రయత్నం అమెజాన్‌ ప్రైమ్‌లో చేశారు. ఇటీవలే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన సిరీస్‌ బందిష్‌ బండిట్స్‌. ‘పది సెకండ్లల్లో లక్షల మంది మనసులను పట్టేయాలి’ అన్న ఆధునిక పాప్‌ సంగీత సంస్కృతికి, దశాబ్దాల పాటు సాధన చేస్తే తప్ప ఒక రాగం నేర్చుకోలేమన్న హిందుస్తానీ సంగీతానికీ నడుమ జరిగే సంఘర్షణను ఈ సిరీస్‌ అద్భుతంగా ఆవిష్కరించింది. ‘యూట్యూబ్‌లోమిలియన్ల వ్యూస్‌' అన్న వాదనకు, పరిశుద్ధమైన రాగాలాపనకూ నడుమ ఉన్న సంఘర్షణను ‘బందిష్‌ బండిట్స్‌' మనముందు ప్రతిభావంతంగా ఉంచింది. ఆధునిక ప్రాచీన సంగీతాల నడుమనే కాదు ప్రతి పాత్రలోనూ ఉన్న సంఘర్షణను రచయిత, దర్శకుడు ఈ సిరీస్‌లో చాలా సహజంగా ఆవిష్కరించారు. 

ముఖ్యంగా హిందుస్తానీ సంగీతరాగాలను అందించడంలోనూ దానికి దీటుగా ఆధునిక సంగీత పోకడలను చూపించడంలోనూ సంగీత దర్శకులు శంకర్‌, ఎహసాన్‌, లోయ్‌త్రయం అభినందనీమైన కృషి చేశారు. ఇక కథా, కథనం విషయానికి వస్తే అందమైన జోద్‌పూర్‌, హవేలీల్లోనూ, ముంబైలోనూ సాగే ఈ కథ ప్రధానంగా సంగీత్‌ సామ్రాట్‌ పండిట్‌రాదే, మోహన్‌రాథోడ్‌ తన సంగీత ఘరానాను కాపాడుకోవడం తన అనంతరం ఆ ఘరానాను నిలబెట్టే వారసుడిని తయారుచేయడమన్న దానిపై సాగుతుంది. సంగీతంలో పరిపూర్ణతత్వాన్ని విశ్వసించే పండిట్‌జీ సాధనలోనూ, ప్రదర్శనలోనూ ఏ చిన్న పొరపాటునూ సహించడు, అంగీకరించడు. తన అకుంఠిత దీక్షాదక్షతలతో అనేక దశాబ్దాలుగా సంగీత సామ్రాట్టుగా నిలబడతాడు. తన ఇద్దరు కొడుకులు సంగీతంలో ప్రతిభ కల వారైనప్పటికీ వారిలో లోపించిన దీక్ష వల్ల వారిని తన వారసులుగా ఒప్పుకోలేడు. చివరికి తన మనుమడు రాదేకు శిక్షణనిచ్చి తన అంతటివాడిని చేయాలని సంకల్పిస్తాడు. ఆ దిశలో నిబద్ధతతో కూడిన శిక్షణ ఇస్తూ ఉంటాడు. యువకుడు అయిన రాదేమోహన్‌కు పాప్‌ సింగర్‌గా ప్రదర్శనలిస్తూ యువతరం లో పాపులారిటీ గడించిన అందమైన తమన్నా పరిచయమవుతుంది. ఆమె ఆకర్షణలో పడతాడు. తమన్నా శాస్త్రీయ సంగీతాన్ని చులకన చేస్తుంది, కానీ రాదే మోహన్‌ స్వరాన్ని తీరును నచ్చి తనతో ఆల్బంకు పాడమంటుంది. మొదట అంగీకరించకున్నా తమన్నా ఆకర్షణలో, కుటుంబానికి ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా అంగీకరించి ఆమెతో వీడియో ఆల్బం చేస్తాడు. మరోపక్క జోద్‌పూర్‌ రాజ కుటుంబం ఆధ్వర్యంలో జరిగే సంగీత సామ్రాట్‌ పోటీకి తయారవుతుంటాడు. పండిట్‌జీ మొదటి భార్య కొడుకు దిగ్విజయ్‌తో పోటీకి సిద్ధవుతుంటాడు. ఇంతలో పాప్‌ ఆల్బం సంగతి తెలిసి పండిట్‌జీ కోపంతో మౌనవ్రతం తీసుకుంటాడు  రాదేకి తన తల్లి మిగతా శిక్షణ ఇస్తుంది. 

దిగ్విజయ్‌ రాదే, తల్లి గతంలో ప్రేమికులని తెలిసి తండ్రి కోపం తెచ్చుకుంటాడు. ఈ సందర్భంలో పండిట్‌జీ తప్పు తనదేనని 25 ఏండ్ల కిందట ఆమె తనను ఓడించిందని, తానే కోడిగా తెచ్చుకొని ఆమె కెరీర్‌ను కూల్చేశానని ఒప్పుంటాడు. చివరికి రాదే పోటీలో దిగ్వజయ్‌ని ఓడించి సంగీత సామ్రాట్‌ అవుతాడు. తమన్నా తాను సంగీత కళాశాలలో చేరి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానని వెళ్లిపోతుంది.  కథ ఇట్లా ఉన్నప్పటికీ మొత్తం సిరీస్‌లో మనుషులు ఎప్పుడూ ఎళ్లవేళలా మంచివారుగా ఉండరని పండిట్‌జీ పాత్ర ద్వారా చూపించారు. అణిచివేయబడినప్పటికీ తనలో ఉన్న కళ స్థిరంగా ఉంటుందని తల్లి పాత్ర ద్వారా చూపారు. ఇట్లా అనేక మానసిక సంఘర్షణలను సిరీస్‌ ఆవిష్కరిస్తుంది. మొత్తంగా హిందుస్తానీ సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ‘బందిష్‌ బండిట్స్‌' సిరీస్‌ నిండా ఆవిష్కృతమవుతుంది. పండిట్‌జీ పాత్రలో నసీరుద్దీన్‌షా అద్భుతంగా నటించాడు. మౌనం కూడా గొప్ప భావాలను పలికిస్తుందని చూపిస్తాడు. ఆయనకు దీటుగా దిగ్విజయ్‌ పాత్రలో అతుల్‌ కుల్‌కర్ణి రాణించాడు.

ఇట్లా మొత్తం మనకు మన అలనాటి ‘శంకరాభరణం’, ‘స్వాతి ముత్యం’ సినిమాలు గుర్తొస్తాయి. వాటికంటే కూడా అత్యంత వాస్తవికంగా ఉండి కట్టిపడేస్తాయి. సిరీస్‌ నిండా నటీనటుల అభినయం, సంగీతం కొన్నిచోట్ల సంభాషణలూ ఆకట్టుకుంటాయి. ఇలాంటి సిరీస్‌ రావడం నేటి కాలంలో కొంత ఆశ్చర్యమే కానీ ఎంతో అవసరం. నవ తరానికి భారతీయ శాస్త్రీయ సంగీతం, ఘరానాలూ, మనుషుల తత్వాలూ పరిచయం కావడం వల్ల టెన్త్‌ జెనరేషన్‌గా పిలవబడుతున్న కొత్త తరం తమ మూలాలను వదిలివేయకుండా ఉండే అవకాశం ఉన్నది. మరిన్ని ‘బందిష్‌ బండిట్స్‌' లాంటివి రావాలని ఆశిద్దాం.


logo