శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 28, 2020 , 23:57:11

కరసేవపై పిటిషన్‌ ఏడో అధ్యాయం కొనసాగింపు..

కరసేవపై పిటిషన్‌ ఏడో అధ్యాయం కొనసాగింపు..

ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు చెందిన ఉభయసభల్లోనూ అరుపులు, కేకల దృశ్యాలే. అయోధ్య విషయంలో ప్రతిపక్షాల వాళ్లు నిరసనలు తెలియజేస్తూ వాకౌట్‌ చేశారు. నవంబర్‌ 25 నాటి ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ కథనం ప్రకారం - ‘గందరగోళ దృశ్యాల మధ్య ముఖ్యమంత్రి ప్రయోజనం శూన్యమని భావించి తాము జాతీయ సమైక్యతా మండలి సమావేశానికి హాజరు కాలేదని ప్రకటించారు. గత యాభై సంవత్సరాలుగా పరిష్కారం లభించని అయోధ్య సమస్యను పరిష్కరించమని జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని ఏర్పాటుచేయటమన్నది నిష్పయోజక అభ్యాసమని ఆయన మళ్లీ ప్రకటించారు. జాతీయ సమైక్యతా మండలిని ఆయన ’బీజేపీకి ఎదురుగా నిలిచే రాజకీయ వేదికగా అభివర్ణించి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయటం బీజేపీని ఏకాకిని చేసేందుకేనన్నారు. మేము రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ప్రజలు అందుకోసం మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు’ అని శ్రీ కల్యాణ్‌ సింగ్‌ ప్రకటించారు. 

డిసెంబరు 6న కరసేవకై ప్రచారం: గతంలో పేర్కొన్నట్లుగా 1992 ప్రారంభ మాసాల్లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో పెద్ద ఎత్తున తవ్వటం, చదను చేయటం, కూల్చివేత కార్యక్రమాలను చేపట్టినందు వల్ల సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ పైనా, విశ్వహిందూ పరిషత్తుపైనా కోర్టు ధిక్కార నేరారోపణతో దరఖాస్తులు చేయబడినాయి. 1992 జులై 9న కాంక్రీటు అరుగు నిర్మాణం చేపట్టగానే రిట్‌ పిటిషన్లకు కొత్తగా దరఖాస్తులు సమర్పించటం జరిగింది.

1992 డిసెంబరు 6 నుంచి కరసేవకు పూనుకుంటామని వీహెచ్‌పీ 1992 అక్టోబరు 21న  ప్రకటించటంతో కోర్టు ధిక్కార నేరారోపణలో 1992 నవంబరు 2న కొత్తగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రతివాదులకు, వీహెచ్‌పీ ఇతర కార్యకర్తలకు, బీజేపి తదితర సంస్థలకు, కరసేవకులుగా చెప్పుకోబడేవారికీ, సన్యాసులకు సాధువులకు అందరికీ గతంలో యిచ్చిన అవకాశం వల్ల మరింతగా ధిక్కరిస్తున్నందు వల్ల, ఇప్పుడు తలపెట్టిన కరసేవను పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ కట్టుదిట్టమైన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా సుప్రీంకోర్టుకు విన్నవించుకోవటం జరిగింది. కరసేవకు అయోధ్యకు తరలివచ్చే లక్షలాది మందిని నిలిపివేయవలసిందిగా ఆదేశిస్తూ వెంటనే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు వారిని కోరటం జరిగింది. ఆ స్థలాన్ని రిసీవరును వేసో మరోవిధంగానో స్వాధీనపరచుకొని పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పేరా మిలటరీ లేదా మిలటరీ బలగాలను వినియోగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కూడా ఆ దరఖాస్తులో కోర్టును కోరటం జరిగింది.

ఆ దరఖాస్తుపై నవంబరు 20న సమాధానాలు సమర్పించుకుంటూ యూపీ ప్రభుత్వం విన్నవించిందేమంటే వెంటనే తీవ్ర చర్యలు చేపట్టేందుకు తాము సుముఖంగా లేమనీ అందుక్కారణం అక్కడ వివిధ వర్గాల మధ్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo