శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 27, 2020 , 23:18:23

అక్రమాలకు అడ్డుకట్ట

అక్రమాలకు అడ్డుకట్ట

‘పిట్టకో గూడు, మనిషికో ఇల్లు’ అనే వారు దాశరథి రంగాచార్య. కూడు, గూడు, నీడ అనేవి మనిషి కనీస అవసరాలు. దీంతోపాటు ఇళ్ళ స్థలాల కొనుగోలు లాభసాటి పెట్టుబడి అవకాశం కూడా. కానీ సామాన్యుల కనీస అవసరాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకోవడం, మోసాలకు పాల్పడటం చాలాకాలంగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు, దళారుల అక్రమాల మూలంగా పేద, మధ్యతరగతి వర్గాలు ఇంటి స్థలం లేదా ఫ్లాటు కొనుక్కోవడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. జీవితమంతా చీమలా కూడబెట్టుకున్న సొమ్ముతో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామనేసరికి అది వివాదాస్పదమైందని తెలిసి హతాశులవుతుంటారు. వృద్ధాప్యంలో న్యాయస్థానాల చుట్టూ తిరగలేని, అక్రమ వ్యాపారులతో గొడవ పడలేని దీనస్థితి వారిది. మరోవైపు అక్రమ లే ఔట్ల మూలంగా నగరాలలో జీవనం అస్థవ్యస్థంగా మారుతున్నది.

ఈ పరిస్థిని గమనించే అనధికార లే ఔట్లు, నిర్మాణాలు చేపట్టి అమాయకులను మోసం చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వివాదాస్పద స్థలాలను కబ్జా పెట్టి, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టి ప్లాట్లు అమ్ముకొని చేతులు దులుపుకొనే వ్యాపారులకు ఇక రిజిస్ట్రేషన్ల దగ్గరే అడ్డుకట్ట పడుతుంది. ఆయా ప్రాతిపదికలను క్షుణ్ణంగా పరిశీలించనిదే రిజిస్ట్రేషన్లు చేయకూడదనే కచ్చితమైన ఆదేశాలు వెలువడ్డాయి. సంబంధిత ప్రభుత్వ సంస్థల అనుమతి లేని ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. అక్రమాలను అరికట్టి అమాయకులను కాపాడటంతోపాటు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఇంతకాలం చెరువులు, నాళాలు వదలకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడం వల్ల నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ పరాయి పాలన మిగిల్చిన అవశేషాలు. ప్రభుత్వం కఠిన విధానం రూపొందించడం వల్ల నగరాలలో జీవనం మెరుగుపడుతుంది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత నిధులు, నీళ్ళు, నియామకాలలో కొంత న్యాయం జరిగితే సరిపోతుందని పరిమిత స్థాయిలో ఆలోచించిన వారున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కో కార్యక్రమం చేపట్టే కొద్దీ పరాయి పాలకులు తెలంగాణను ఎన్నివిధాలుగా శుష్కింపజేశారో అర్థమవుతున్నది. చట్టబద్ధపాలన సాగేవిధంగా, సక్రమమైన పాలనావ్యవస్థను నెలకొల్పే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణమనే విస్తృత అజెండా ఒక్క రోజులో సాధ్యపడేది కాదు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనుకున్నప్పటికీ, ఆ క్రమంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడవలసి ఉంటుంది. విద్యావ్యవస్థ, నగర పాలన వంటి ఏ రంగమైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేది ఉద్యోగబృందమే. తాజాగా అక్రమ నిర్మాణాలను అరికట్టడంలోనూ ప్రభుత్వ సిబ్బంది దీక్షతో కృషిచేయవలసి ఉన్నది. 


logo