గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 27, 2020 , 23:18:19

డిజిటల్‌ పాలన అనివార్యం

డిజిటల్‌ పాలన అనివార్యం

సంక్షోభాలు, విపత్తులు వచ్చినప్పుడు సమాజం అన్ని కోణాల్లో అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావాలు మన పాలనా వ్యవహారాలపై కూడా ఉంటాయి. కరోనా సృష్టించిన పరిస్థితులను అనుకూలంగా ఉపయోగించుకోవాలంటే, డిజిటల్‌ విప్లవం వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందువల్లనే కేంద్రంతో సహా చాలా రాష్ర్టాల్లో ‘ఈ-ఆఫీస్‌' విధానానికి మొగ్గు చూపుతున్నారు. 

ఆఫీస్‌ ఫైల్స్‌పై దుమ్ము పేరుకుపోవడం, చెదలు పట్టడం పాత మాట. ఇప్పుడు ఎంత సమాచారమైనా, ఎన్నేండ్ల కిందటిదైన క్షణాల్లో చూడటం, నిక్షిప్తం చేయడం డిజిటల్‌ విప్లవంతో సాధ్యమవుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా కాగిత రహిత పాలన అనివార్యమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల కన్నా ఒక అడుగు ముందుకేసి  ‘ఈ-ఆఫీస్‌' పాలన ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ‘ఈ- ఆఫీస్‌' సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్ర సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సులభతర పరిపాలన, సేవలు అందించటానికి కృషిచేస్తున్నది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ‘వర్క్‌ ఫ్రం హోమ్‌' ప్రవేశపెట్టడంతో డిజిటల్‌ పాలన అనివార్యమైంది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన ఎన్నికల నిర్వహణలో కూడా డిజిటల్‌ పరిజ్ఞానం ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము లాంటిది. గత ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిన దక్షిణకొరియాను ఆదర్శంగా తీసుకొని భారత ఎన్నికల సంఘం వచ్చే అక్టోబర్‌, నవంబర్‌ నాటి బీహార్‌ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. పోలింగ్‌ కేంద్రాలు రెట్టింపు చేయడం, 65 ఏండ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించడం వంటి చర్యలను చేపట్టింది. కరోనా పరిస్థితుల్లో పార్టీలు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆశ్రయిస్తుండటం మంచి పరిణామం. సాధారణ పరిస్థితుల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో లక్షల మందితో జనసమీకరణ చేసే పార్టీలు డిజిటల్‌ సాంకేతికత పరిజ్ఞానంతో వర్చువల్‌ వేదికలను ఆశ్రయిస్తున్నాయి. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వర్చువల్‌ సమ్మేళనాలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఇదే దారిన నడుస్తున్నది. అలాగే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ఎన్నికల రూపురేఖలను మార్చేశాయి. పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ బెడద తొలిగిపోయింది. 

సుగమ్‌  పోర్టల్‌ ద్వారా రాజకీయపార్టీలకు అవసరమైన అనుమతులు ఇవ్వడం, సమాధాన్‌  పోర్టల్‌ వినియోగంతో ఫిర్యాదుల పరిశీలన సులభతరమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, ‘సి-విజిల్‌' యాప్‌ ద్వారా పౌర ఫిర్యాదుల స్వీకరణ సులువైంది. ఓట్ల కోసం పార్టీలన్నీ డిజిటల్‌ ప్రసార మాధ్యమాల వైపు మారాల్సిన అవసరాన్ని కరోనా కల్పించింది.డిజిటల్‌ పాలన ఫలాలు అందరికీ అందాలంటే, బడుగు, బలహీనవర్గాలను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చి, దేశంలో డిజిటల్‌ అగాధాన్ని అధిగమించాలి. డిజిటల్‌ పాలనకు ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్‌, సాంకేతికత) వ్యవస్థ కావాలి. దీనికోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. డిజిటల్‌ ప్రపంచంలో సైబర్‌ ముప్పు సర్వత్రా ఏర్పడుతున్న పరిస్థితుల్లో, పాఠ్యాంశాల్లో సైబర్‌ భద్రత గురించి అవగాహన కల్పించాలి.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అభినందించదగినది. 

కేంద్ర ప్రభుత్వం 2006లోనే ఎలక్ట్రానిక్‌ పాలనకు ప్రణాళికను చేపట్టింది. 2015లో ప్రారంభమైన ‘డిజిటల్‌ ఇండియా’ పథకం పౌరులందరికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి, ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆధార్‌, భూ రికార్డుల కంప్యూటరీకరణ, ఈ-సేవ తదితర సౌకర్యాలను కల్పించింది. అయితే ప్రజలకు చేరువగా రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ సేవలు అందించడం అంత సులభం కాదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చొరవ ప్రాధా న్యం పొందుతున్నది.

-గుర్రం రజితాదేవి


logo