శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 27, 2020 , 23:18:18

కరసేవకై ప్రచారం

కరసేవకై ప్రచారం

ఏడో అధ్యాయం కొనసాగింపు..

కేంద్రం అనిశ్చిత పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నదని, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పితే దాని బాధ్యత కేంద్రమే వహించాల్సి వస్తుందని ఆ వీహెచ్‌పీ నాయకుడు తెలియజేయటం జరిగింది. మందిర నగరానికి అప్పటికి ఎందరు కరసేవకులు వచ్చి చేరారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ వీహెచ్‌పీ నేత.. అయోధ్యకు వచ్చేందుకు 10 లక్షల మంది వాగ్దాన పత్రాలపై సంతకాలు చేశారన్నారు. ఎందరు కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారనే సమాచారాన్ని తెలియజేసేందుకు నిరాకరిస్తూ ఆయన చెప్పిందేమంటే.. నిర్మాణం జరిగే తావున ఏ రోజైనా 60 వేల నుంచి లక్ష వరకు కరసేవకులు ఉంటారని.

పాట్నాలో వియజాజె సింధియా ఈ విధంగా ప్రకటించారు.. ‘రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రానికి ఇంకేమాత్రం సమయం ఇచ్చేందుకు కుదరదు. పుణ్యక్షేత్రం వద్ద కరసేవ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 6న ప్రారంభమవుతుంది’. బీజేపీ, వీహెచ్‌పీలు బహిష్కరించినా ‘జాతీయ సమైక్యతా మండలి’ సమావేశం ముందుగా నిర్ణయించిన ప్రకారం 1992 నవంబరు 23న నిర్వహించబడింది. నాలుగు వాక్యాల తీర్మానాన్ని సీపీఎం నాయకుడు హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ ప్రవేశపెట్టగా బల్లలు చరుస్తూ అది ఆమోదించబడింది. ఆ తీర్మానం ఇలా ఉంది.. ‘ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వ్యవహారాన్నీ, ప్రభుత్వ నివేదికను ఈ సమావేశంలో అన్నికోణాల నుంచి పరిశీలించిన జాతీయ సమైక్యతా మండలి తన సంపూర్ణ సహకారాన్నీ మద్దతును, రాజ్యాంగాన్ని, న్యాయసూత్రాలను పరిరక్షించేందుకు, కోర్టు ఉత్తర్వుల్ని అమలుపరిచేందుకు, ప్రధాని ఏ మేరకు అత్యవసరమని భావిస్తే ఆ మేరకు అందించేందుకు సిద్ధమే..’.

ఇరువురు మాజీ ప్రధానులు- చంద్రశేఖర్‌, వీపీ సింగ్‌లు ఆ సమావేశంలో ప్రధానవక్తలు. ‘సహేతుకత లేకుండాపోయింది గనుక జాతీయ సమైక్యతా మండలి కఠిన నిర్ణయానికి రావలసి ఉంది. బీజేపీ ధోరణి చూస్తూంటే ఒక పెద్ద శాంతిభద్రతల సమం రూపుదాల్చేట్లున్నది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా జాతీయ సమైక్యతా మండలి దానికి మద్దతు పలుకుతుందన్నారు శ్రీ చంద్రశేఖర్‌. ‘తిరిగి మనం జూలై నాటి స్థితినే చూస్తున్నాం. బీజేపీ, వీహెచ్‌పీ కూటమి ఈ దశలో మెత్తబడుతుందనుకోవటంలో అర్థం లేదు’ అన్నారు శ్రీ వీపీ సింగ్‌, ఇది న్యాయస్థానాలకు పాలనా యంత్రాంగానికి, పార్లమెంటుకు ఓ సవాలు అని కట్టడానికి రక్షణ కల్పించటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఈ వ్యవహారంలో కక్షిదారుకావాలి, న్యాయసలహా పొందాలి, అయోధ్యలోని ఆస్తిని స్వాధీన పరచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా మాకు సమ్మతమే - అవసరమైతే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దు పరిచినా సరే’ అంటూ శ్రీ వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని ఒక నిర్ణయానికి రావలసిందిగా అభ్యర్థించారు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo