ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 26, 2020 , 23:36:08

మనదే బాధ్యత

మనదే బాధ్యత

పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితిలో విలువైన సమయాన్ని వృథా చేయడం కన్నా, ఆన్‌లైన్‌ బోధన సాగించడమే శరణ్యం. అందువల్లే వచ్చే నెల ఆరంభం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిస్థితుల్లో- విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు, జూన్‌ పూర్వార్ధంలో ఎక్కువగా విద్యార్థులను సంసిద్ధులను చేయడానికే సరిపోతుంది. ఏడాదిలో అత్యంత ఎక్కువగా బోధన జరిగేది జూలై, ఆగస్టు నెలల్లో, ఆ తర్వాత నవంబర్‌లో. మిగతా నెలల్లో సెలవులు, పరీక్షలు ఇతరత్రా కారణాల వల్ల బోధనా కాలం తక్కువ. కరోనా మూలంగా విలువైన జూలై, ఆగస్టు నెలలను కోల్పోవలసి వచ్చింది. అందువల్ల ఇకనైనా ఆన్‌లైన్‌ బోధనను చేపట్టడం అవసరం.

టీవీ, ఫోన్‌, కంప్యూటర్‌లలో ఏదో ఒకదాని ద్వారా విద్యార్థులను అనుసంధానం చేయడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలి. చాలా ఇళ్ళకు టీవీలు అందుబాటులో ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు తమ కొత్త ఫోన్లను ఎట్లా వాడాలనేది అర్థం కానప్పుడు పిల్లలను అడిగి తెలుసుకుంటారు. అందువల్ల కొత్త బోధన ప్రక్రియకు పిల్లలు తొందరగా అలవాటు పడుతారనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా తల్లిదండ్రులు కొంత కట్టడి చేసేవారు. ఇప్పుడిక వారికి ఇవ్వకతప్పదు. అయినా పిల్లలు ఎక్కువసేపు ఫోన్‌పై గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణతో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావడంతో పాటు హోం వర్క్‌ పూర్తిచేసి పంపడం వరకు పిల్లలు చక్కగా చదువుకునే విధంగా తల్లిదండ్రులు చూడాలి. ఉపాధ్యాయులను సంప్రదిస్తూ సూచనలు పాటించాలి. 

ఈ కరోనా సమయంలో ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పెంచడానికి విద్యాశాఖ ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. ఉపాధ్యాయులు కూడా సందర్భానికి తగ్గట్టుగా ఎదగవలసి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్‌ పరిజ్ఞానం లేకుంటే సమాజంలో బతుకడం కష్టం. ఇందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశాన్ని కరోనా కల్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులుంటారు కనుక, డిజిటల్‌ బోధన ఉపాధ్యాయులకు ఒక కొత్త సవాలు. ఆన్‌లైన్‌ బోధనను అమలు చేస్తూనే, అందులో ఎదురయ్యే కష్టనష్టాలను గుర్తించి సవరించగలగాలి. డిజిటల్‌ బోధన ప్రయోగదశలో ఉన్నందున నిరంతరం సమీక్షించుకోవాలి, అధ్యయనాలలో భాగస్వాములు కావాలి. ఆన్‌లైన్‌ బోధన ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందనేది ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ఉమ్మడి కృషి మీద ఆధారపడి ఉంటుంది. 


logo