శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Aug 26, 2020 , 23:36:07

బెదిరించిన వరదలు-చెదరని చెరువులు

బెదిరించిన వరదలు-చెదరని చెరువులు

గతంలో రామప్ప, గణపురం చెరువుల నీరు అలుగు దుమికితే ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గ్రామాల రహదార్లన్నీ ధ్వంసమై వారాలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. భారీ వరదల్లో చెరువు ఒక్కటి కూడా తెగలేదంటే మిషన్‌ కాకతీయ పనులే కారణం.

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అలుగుదుమికి ఎండిపోయిన వాగుల్లో వరదలు పొంగిపొర్లాయి. ఒక్క మంజీరా పరీవాహక ప్రాంతంలోని సింగూరు, నిజాంసాగర్‌ రిజర్వాయర్లు తప్ప మిగిలిన ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తూ కోట్లాది రైతుల కళ్ళల్లో ఆనందబాష్పాలుగా ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రమంతా జలకళతో సంతోషం వెల్లివిరిసినా ములుగు జిల్లాలోని సుమారు ఇరువై గ్రామాల్లోని  ప్రజల్లో భారీ వర్షాలు, వరదలు భయానక వాతావరణాన్ని సృష్టించి వందలాది కుటుంబాలను కట్టుబట్టలతో బయటపడేలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో కంటికి కునుకులేకుండా గడిపేలా చేశాయి.

ములుగు జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 71.9 శాతం అడవులు ఉండటం (రాష్ట్రంలో తొలిస్థానం) వలన ప్రతి సంవత్సరం విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కాకతీయులు 13వ శతాబ్దంలో తవ్వించిన రామప్ప, లక్నవరం వంటి పెద్ద చెరువులతో పాటు 890 కుంటలు, చెక్‌డ్యాంలు, చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆగస్టు రెండవ, మూడవ వారంలో కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా కేంద్రం పొలిమేరలన్నీ సముద్రాన్ని తలపించాయి. దీనికి కారణం రామప్ప చెరువు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ (+209.380) కాగా, ఆగస్టు 15న కురిసిన 16.82 సెం.మీ. వర్షం వలన ఒక్కరోజులోనే ఈ నీరంతా వచ్చి చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మరో నాలుగు రోజుల్లో 26.40 సెం.మీ, ఆగస్టు 20న మరో 16.76 సెం.మీ. వర్షం ములుగు మండలంలో కురవడంతో 2.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రామప్ప చెరువులోకి 4.27 టీఎంసీల నీరు చేరింది. వందల ఏళ్ళ రామప్ప చరిత్రలో ఇంత భారీగా వరదలు వచ్చిన దాఖలాల్లేవు. భారీగా వచ్చిన వరదలతో 9 చదరపు మైళ్ళ చెరువు నీరు కొన్ని కిలో మీటర్ల దూరం ఆవరించి ములుగు పట్టణ సమీప గ్రామాల్లోని వందలాది ఇళ్ళను ముంపుకు గురిచేసింది. నేషనల్‌ హైవే (హైదరాబాద్‌-భూపాలపట్నం) నంబర్‌ 613 కూడా ముంపులో ఉండటంతో కొన్నిరోజులు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడటమే కాక ఈ రోడ్డుపై ప్రయాణించిన ఇద్దరు యువకులు మోటర్‌ సైకిల్‌తో సహా వరదకు కొట్టుకొని పోయి మరణించారు. మరోపక్క రామప్ప చెరువు మత్తడిపై నుంచి సుమారు నాలుగున్నర ఫీట్ల ఎత్తులో వరదనీరు అలుగు దుమికి మోరంచ వాగులో పొంగిపొర్లింది.

దిగువన ఉన్న పాలంపేట, ఇతర వాగు పక్క గ్రామాల్లోని జనావాసాల్లో నీరు ప్రవేశించింది. సరిగ్గా ఆ సమయంలో రాష్ట్ర వాతావరణ శాఖ రెండు రోజులు ములుగు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో వరదలను కనిపెడుతూ సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్న ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య చీఫ్‌ ఇంజినీర్‌ బంగారయ్య, నేను ఆందోళనకు గురై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించాము. రామప్పకు పెను ప్రమాదం పొంచివుందని తెలియడంతో దిగువ, ఎగువ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైనారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క భారీ వర్షానికే వందలాది గొలుసు చెరువులు, కుంటలకు గండ్లుపడి, కట్టలు ధ్వంసమై వాటిలోని నీరంతా ఉధృతంగా బయటకువచ్చి పొంగిపొర్లిన అనుభవం వల్ల రామప్ప చెరువుకు ప్రధాన వాగులైన మేడివాగు, రాళ్ళవాగు క్యాచ్‌మెంట్‌లోని 34 కుంటలు, చెరువులు తెగుతాయేమోనని డీఈ ఆమ్రపాలి, ఈఈ జగదీశ్‌ తదితర నీటి పారుదల శాఖ ఇంజినీర్లు నిద్రలేని రాత్రులు భయాందోళనలతో గడిపారు. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు 20 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లుచేశారు. వందలాది మందిని ఈ కేంద్రాలకు తరలించారు కూడా. ఎందుకంటే రామప్ప చెరువు వరదనీరు మోరంచవాగు ద్వారా అనేక గ్రామాల గుండా ప్రవహిస్తూ మానేరులో కలుస్తుంది.

రామప్ప చెరువుకు గల రెండు తూముల ద్వారా కేవలం 250 క్యూసెక్కులు మత్తడి ద్వారా అత్యధికంగా 3800 క్యూసెక్కులు మాత్రమే ఔట్‌ఫ్లో ఉండగా ఆగస్టు 20న ఇన్‌ఫ్లో 8310 క్యూ.సెక్కులు. వచ్చే నీటిని రామప్ప దిగువకు పండానికి ఏ దిక్కూ కనిపించని తరుణంలో ఆదుకున్నది కేసీఆర్‌ దూరదృష్టితో, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి కృషితో తవ్వించిన రామప్ప-గణపురం లింక్‌ కెనాల్‌. 400 క్యూసెక్కుల డిజైన్‌ డిశ్చార్జీ గల ఈ కాల్వ నుంచి పై అధికారుల ఆదేశంతో సుమారు 700 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఏఈ నారాయణస్వామి. అంతేకాక కలెక్టర్‌ ఆదేశంతో వర్షంలో తడుస్తూ మూడురోజులు ఇంజినీర్లు, పాలంపేట మాజీ సర్పంచ్‌ రామ్‌మోహన్‌రావు మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు పోయేలా మత్తడి ప్రవాహానికి గల అడ్డంకులు తొలగించారు. భూపాలపల్లి శాసనసభ్యునిగా ఉండగా మధుసూదనాచారి నిర్మించిన బ్రిడ్జీల కారణంగా మోరంచ గణపురం చెరువు ప్రవాహాలకు ఏ ఒక్క రోడ్డు కూడా తెగలేదు. రాకపోకలకు ఎక్కడా అంతరాయం కలగలేదు. గతంలో రామప్ప, గణపురం చెరువుల నీరు అలుగు దుమికితే ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గ్రామాల రహదార్లన్నీ ధ్వంసమై వారాలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. భారీ వరదల్లో చెరువు ఒక్కటి కూడా తెగలేదంటే మిషన్‌ కాకతీయ పనులే కారణం. సమైక్య రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణ కేసీఆర్‌ సారథ్యంలో ఏ విధంగా పునర్నిర్మాణం జరుగుతూ పునరుజ్జీవం పొందుతున్నదో తెలుసుకోవడానికి ములుగు జిల్లాను వణికించిన వరదలను తట్టుకొని నిలిచిన చెరువులు, ఇరవై నాలుగు గంటలు ప్రజలను రక్షించడానికి నిబద్ధతతో పనిచేసిన అధికారులు, రీ-డిజైన్‌ చేయబడుతున్న ఈ ప్రాంత నీటి పారుదల వనరులు చక్కని ఉదాహరణ. ఇప్పటి ఇంజినీరింగ్‌ నైపుణ్యం, యంత్రాలు ఆ రోజుల్లో అందుబాటులో లేకున్నా ఎంతటి వరదలైనా తట్టుకొని నిలిచేలా చెరువులను 13వ శతాబ్దంలోనే ని ర్మించిన కాకతీయుల ప్రతిభ, నైపుణ్యాన్ని రామప్ప చెరువు మరోసారి గుర్తుచేసింది. 

(వ్యాసకర్త: రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌)logo