సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 26, 2020 , 23:36:07

పునాదుల మీదే కరసేవ

పునాదుల మీదే కరసేవ

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

మత విశ్వాసానికి చెందిన విషయంలో కోర్టులు జోక్యం చేసుకొని తీర్పు చెప్పటాన్ని ఎం.ఎం.జోషి తప్పుగా భావించి తమ విచారాన్ని వ్యక్తం చేశారు. రామ మందిరం విషయంలో ప్రసార సాధనాల దుర్వినియోగాన్ని దుయ్యబట్టారు. అవి వాస్తవాలను వక్రీకరించి ప్రజాభిప్రాయాన్ని గందరగోళపరిచాయన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులు 1992 డిసెంబరు 6కు ముందే వెలువడగలవని భావించారు. ఇక గోవిందాచార్య నేరారోపణేమంటే.. ‘నేను సమస్యకు పరిష్కారం కనుగోనే బదులు విషయాన్ని సుప్రీంకోర్టుకు బదలాయించాననీ.. నాకు మైనారిటీ ఓట్లపై మక్కువ’ అనీ. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసేట్లయితే.. కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోతుందనీ, బాబ్రీ మసీదు ధ్వంసం చేయబడుతుందనీ, ఆకస్మికంగా తలెత్తే మత కల్లోలాలకు కేంద్రమే బాధ్యత వహించవలసి ఉంటుందనీ సచ్చిదానంద సాక్షి హెచ్చరించారు. సంఘపరివార్‌ సరాసరి కేంద్ర ప్రభుత్వంతో తలపడేందుకు సంసిద్ధమైంది. కానీ కేంద్రం మధ్యలో కోర్టును తెచ్చిపెట్టిందంటూ ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌ విలేకర్ల సమావేశంలో ఆగ్రహం వెలిబుచ్చారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించేలా కృషిచేసినా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేస్తే చాలా విషయాలు ప్రభావితం కావచ్చు. మధుర నుంచి ఎం.ఎం. జోషీ, వారణాసి నుంచి ఎల్‌కే అద్వానీ చేపట్టిన యాత్రలు సంఘపరివార్‌ కృష్ణభూమి విషయంలోనూ, కాశీ విశ్వనాథ మందిరం విషయంలోనూ తమ వాదాన్ని విడనాడలేదన్నది సుస్పష్టమే. కరసేవ కేవలం కాంప్లెక్స్‌ ఊడ్చటం, శుభ్రపర్చటం రూపంలోనే ఉంటుందనీ, అయితే అటువంటి లిఖితపూర్వక హామీని విశ్వ హిందూపరిషత్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇవ్వలేదనేది ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌ వాదన. కరసేవకులు సాయుధ దళాల్ని చూసి భయపడరనీ, తాను కొందరు మతపెద్దల్ని కలువగా వాళ్లు కరసేవ పునాదుల మీదే జరుగుతుందని చెప్పారనీ మహంత్‌ సేవాదాస్‌ ప్రకటించారు.

అద్వానీ తన యాత్రను వారణాసి నుంచి అయోధ్య వైపునకు, ఎం.ఎం. జోషి తన యాత్రను మధుర నుంచి అయోధ్యకు కొనసాగించారు. ఇరువురు నాయకులు కరసేవను గూర్చి ప్రకటనలు చేశారు. అద్వానీ ముఖల్‌సరాయ్‌, వారణాసి సభల్లో ప్రసంగించారు. రామ జన్మభూమి మందిర నిర్మాణ ఉద్యమాన్ని జాతీయతా గుర్తింపును తిరిగి స్వాధీనపర్చుకునే జాతీయ ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటులోనూ, నాలుగు రాష్ర్టాల్లోనూ ప్రాతినిధ్యం పెరుగటాన్ని భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చిన రాజకీయాధికారంగా యోగ్యతను ఆపాదిస్తూ రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, చట్టాల హుందాతనాన్ని గౌరవించే బీజేపీకి ప్రజల ఆకాంక్షలు, రాజకీయాధికారపు శక్తీ ఉన్నతమైనవని వాదించారు. న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్నీ, ప్రజల విశ్వాసాలనూ, నమ్మకాలనూ అణగదొక్కటాన్ని సహించబోమన్నారు. కరసేవ అంటే.. కేవలం భజనలు, కీర్తనలు గానం చేయటం కాదనీ, శుభ్రపర్చటం, ఊడ్చటం, గోతులు తవ్వటం వంటి శారీరక శ్రమదానం అని కూడా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారేమోననే విషయంలో తాను ఆందోళన చెందటం లేదన్నారు. నేను రామజన్మభూమి-బాబ్రీ మసీదు సమస్యను జటిలం చేశాననీ, ముస్లింలను రెచ్చగొట్టి బాబ్రీ మసీదు యాక్షను కమిటీ, విశ్వహిందూ పరిషత్‌ను వ్యతిరేకించేట్లు చేస్తున్నాననీ, యోగులు, మహంతుల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాననీ ఎం.ఎం. జోషీ అభియోగం. 

బీజేపీ ధిక్కార ధోరణిని నొక్కిచెప్తూ.. నవంబర్‌ 23న ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక ఇలా పేర్కొంది.. ‘కేంద్రం ఇందులో చేయగలిగిందల్లా అలహాబాద్‌ హైకోర్టులో 2.77 ఎకరాలు ప్రభుత్వం సేకరించిన భూమి విషయంలో త్వరగా తీర్పు చెప్పమని దరఖాస్తు పెట్టుకోవటమేగా..’ అన్నారు. పార్టీ సీనియర్‌ నేత అటల్‌ బీహారీ వాజపేయి.. ‘డిసెంబరు 6న ప్రారంభం కానున్న కరసేవలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. బీజేపీ పాలిత నాలుగు రాష్ర్టాల్లోని మంత్రులు మాత్రం వాళ్ల మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత మాత్రమే కరసేవలో పాల్గొనే వీలుంది. అయితే కరసేవ శాంతియుతంగా జరుగుతుందా లేక హింస చోటుచేసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. చట్టాన్ని ధిక్కరించటం కూడా ఒకవిధమైన నిరసన తెలిపే ప్రక్రియగానూ, ఒక సిద్ధాంత పోరాట ప్రక్రియగానూ ఉంటూ వచ్చింది..’. అదే సమయంలో ఎల్‌కే అద్వానీ.. ‘యూపీ ప్రభుత్వంతో కేంద్రం తలపడితే అది బీజేపీకి మంచిదే గాని, దేశానికి శ్రేయోదాయకం కాదు’ అంటూ హెచ్చరించటం జరిగింది. అది కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వినాశనానికి దారితీయగలదని ఆయన అన్నట్లు వార్తలు.

వీహెచ్‌పీ నాయకులు కూడా అదే ధోరణిలో మాట్లాడసాగారు. ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ దినపత్రిక నవంబరు 23న ఈ విధంగా రాసింది.. ‘నవంబరు 25 నుంచి 27 లోపల ఎప్పుడైనా కేంద్రం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసే సూచనలు కనిపిస్తున్నాయని వీహెచ్‌పీ ఈ రోజు పేర్కొంది. వీహెచ్‌పీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌.. కేంద్రం-యూపీకి నాలుగు కంపెనీల కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలను పంపిందని పత్రికల వారికి తెలియజేశారు. అది రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలేకుండానే పంపటం జరిగింది. ఆ నాలుగు కంపెనీలలో  రెండు ఫైజాబాద్‌లోనూ, రెండు లక్నోలోనూ ఉన్నాయి. మరో 40 కంపెనీలు ఢిల్లీలో సిద్ధం చేయబడి ఉన్నాయి. 

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీకి చెందిన 500 బస్సులు రాష్ర్టానికి పంపటం జరిగిందనీ, కేంద్ర బలగాలను ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేరవేసేందుకు వాటిని పంపటం జరిగిందని ఆయనకు యూపీ నుంచి వార్తలు అందాయని ఆ వీహెచ్‌పీ నేత వెల్లడించటం జరిగింది. ఇంకా ఆయన తెలియజేసిందేమంటే.. కరసేవకులను అయోధ్యకు రాకుండా నిలువరించేందుకు గల అవకాశాలపై కేంద్రం పంజాబు గవర్నర్‌ను సంప్రదిస్తున్నదని. అయోధ్యలో కరసేవకులపై ప్రయోగించేందుకు రబ్బరు తూటాలు, నీళ్లు చిమ్మే గొట్టాలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన తెలియజేశారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను సిద్ధం చేయటం జరిగిందని కూడా తెలియజేశారు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo