సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 25, 2020 , 23:09:36

కాంగ్రెస్‌ బలహీనత

కాంగ్రెస్‌ బలహీనత

కాంగ్రెస్‌ పార్టీలో తలెత్తిన తాజా సంక్షోభం ఆ పార్టీ నాయకత్వ బలహీనతను మరోసారి వెల్లడించింది. ‘పూర్తిస్థాయి, కనిపించే నాయకత్వం’ ఉండాలంటూ పార్టీ అధిష్ఠాన వర్గానికి 23 మంది పార్టీ ప్రముఖులు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ఈ లేఖ సోనియా నాయకత్వంపై జరిగిన దాడిగా రాహుల్‌గాంధీ అభివర్ణించారు. కానీ వాస్తవానికి అది ఆయన నిర్వహిస్తున్న ‘తెరచాటు నాయకత్వం’పై వెల్లడైన అసమ్మతి. పార్టీపై నెహ్రూ కుటుంబానికి బలమైన పట్టు ఉండటం వల్ల వర్కింగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌ తన మాట నెగ్గించుకోగలిగారు. లేఖ రాసినవారిలో ఒక్కరు కూడా తమ రాష్ట్రంలో కాదుగదా తమ నియోజకవర్గంలోనూ బలమైన నాయకులు కాదు. వారి భవిష్యత్తుపై ఏర్పడిన భయాలే లేఖ రాయడానికి పురికొల్పి ఉంటాయి. అయినప్పటికీ వారిపై చర్య తీసుకోలేని బలహీనస్థితిలో పార్టీ నాయకత్వం ఉన్నది. ప్రస్తుతానికి సంక్షోభం ముగిసినట్టు కనిపించినా, పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వ సమస్య మాత్రం ఇంకా తీరనే లేదు. 

2014 ఎన్నికలకు ముందునుంచే పార్టీలో రాహుల్‌గాంధీ మాట చలామణి అవుతున్నది. పార్టీని గెలుపు బాటలో ఆయన నడిపించలేరనేది ఆ ఎన్నికల్లోనే వెల్లడైంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన మిత్రపక్షాలతో వ్యవహరించిన తీరు, ఒంటరిపోకడ పార్టీకి మరింత నష్టం వాటిల్లజేసింది. ఈ పరాజయం తరువాత ఆయన వ్యవహారసరళి మరింత విడ్డూరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, బ్యాక్‌ సీట్‌ డ్రైవింగ్‌ ఎంచుకున్నారు. నెహ్రూ కుటుంబసభ్యులెవరూ అధ్యక్ష పదవి చేపట్టకూడదని షరతు విధించారు. అంటే ప్రియాంక రాకూడదనేది ఆయన అభిప్రాయం. పార్టీ వైఫల్యాలను అధ్యక్ష స్థానంలో తాను నియమించే అనామకుడిపైకి నెట్టి, తెరచాటు నుంచి డ్రైవింగ్‌ చేయాలనుకున్నారు. కానీ సీనియర్ల అభిప్రాయం మేరకు సోనియా బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. 

నెహ్రూ కుటుంబం పార్టీ నాయకత్వాన్ని వదలిపెట్టడం అంత సులభం కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టిన పీవీ వంటి పెద్ద నాయకుడినే పలువిధాలుగా కష్టపెట్టారు. కాంగ్రెస్‌ను వీడిన కొందరు నాయకుల భవిష్యత్తు అక్కడితో ముగిసిపో యింది. కానీ జగ్జీవన్‌రామ్‌, వీపీ సింగ్‌, శరద్‌పవార్‌ మాదిరిగా నిలదొక్కుకున్న వారూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్‌ జాతీయపక్ష లక్షణాన్ని కోల్పోయింది. బీజేపీని ఎదిరించి నిలువగ లిగే పటుత్వం ఆ పార్టీలో కనిపించడం లేదు. అందువల్లనే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రాంతీయశక్తులే ప్రత్నామ్నాయ నిర్మాణానికి ప్రయత్నించాయి. ఈ పరిస్థితుల్లో సీనియర్‌ నాయ కులు మునిగే నౌక వంటి కాంగ్రెస్‌లో కొనసాగుతారా! ప్రత్యామ్నా య వేదిక ఆవిర్భావం వైపు కదులుతారా! అన్నది వేచిచూడాలి. 


logo